కోవర్టులను తరిమేస్తాం

ABN , First Publish Date - 2022-01-17T05:52:52+05:30 IST

టీడీపీ కార్యాలయంలో పట్టణ మైనార్టీ అఽధ్యక్షుడు నిస్సార్‌అహ్మద్‌ ఆధ్వర్యంలో జరిగిన ముస్లిం మైనార్టీ సదస్సులో టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ మాట్లాడుతూ... కోవర్టులను తన్ని తరిమేస్తామని అన్నారు.

కోవర్టులను తరిమేస్తాం
సదస్సులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి

టీడీపీ మైనార్టీ సదస్సులో దొమ్మలపాటి


మదనపల్లె టౌన్‌, జనవరి 16:  కోవర్టులను తన్ని తరిమేస్తామని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌ అన్నారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పట్టణ మైనార్టీ అఽధ్యక్షుడు నిస్సార్‌అహ్మద్‌ ఆధ్వర్యంలో జరిగిన ముస్లిం మైనార్టీ సదస్సులో ఆయన మాట్లాడుతూ... టీడీపీలో కష్టపడే వారికే గుర్తింపు ఉంటుందన్నారు. మదనపల్లె నియోజకవర్గంలో చాలా మంది ముస్లిం, మైనార్టీలు టీడీపీకి అండగా వున్నారని గుర్తుచేశారు.  టీడీపీలో పగలంత ఇటువైపు వుండి రాత్రిళ్లు వైసీపీ వాళ్లతో చర్చిస్తున్న కోవర్టులను తన్ని తరిమేస్తామని  హెచ్చరించారు. ఇటీవల కొంతమంది వైసీపీ నాయకులతో రాత్రిళ్లు మంతనాలు చేస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. 35 ఏళ్లుగా టీడీపీ కోసం కష్టపడే వారిని అధ్యక్షుడు చంద్రబాబు గుర్తించారని, కోట్ల కట్టలు తీసుకొచ్చేవారిని పక్కన పెడతారన్నారు. ప్రతి గ్రామం, వార్డులో టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులే సుప్రీంలు అని ఎవరైనా స్వార్థ రాజకీయాలు చేస్తుంటే సస్పెండ్‌ చేయాలని సూచించారు. ఇక జగన్‌ పాలనలో ముస్లిం, మైనార్టీలకు ఒరిగిందేమి లేదని, కేవలం అంకెల గారడితో వారిని మభ్యపెడుతున్నారన్నారు. చంద్రబాబు పాలనలోనే మైనార్టీలకు, అలాగే మదనపల్లెలో ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారన్నారు. మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం రఫి మాట్లాడుతూ... ముస్లింలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. ఇప్పుడు చూస్తే జగన్‌ పాలనలో చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసి ముస్లింల పట్ల ఆయనకున్న ద్వేషాన్ని రుజువు చేసుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో వున్న ముస్లింలు టీడీపీని బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దొమ్మలపాటి యశశ్విరాజ్‌, ముస్లిం, మైనార్టీ నాయకులు తాజ్‌బాషా, కలీముల్లా, దాదాపీర్‌, సీనియర్‌ నాయకులు ఆర్‌జే వెంకటేశ్‌, మోడెం సిద్దప్ప, శివయ్య, కొయ్యలమండి రాజారెడ్డి, ఆర్‌కే శీనా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T05:52:52+05:30 IST