స్థలం కొనిస్తాం.. ఇక్కడ డంపింగ్‌ వద్దు

ABN , First Publish Date - 2021-03-07T06:08:19+05:30 IST

డంపింగ్‌ యార్డుకు కావాల్సిన భూమిని తామే కొనుగోలు చేసి ఇస్తామని, ఇక్కడ డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయవద్దని పాతనేరేడుచర్ల గ్రామస్థులు కోరారు.

స్థలం కొనిస్తాం.. ఇక్కడ డంపింగ్‌ వద్దు
పోలీసులతో వాగ్వాదం చేస్తున్న పాత నేరేడుచర్ల గ్రామస్థులు


 డంపింగ్‌యార్డు పనులను అడ్డుకున్న గ్రామస్థులు నేరేడుచర్లలో ఉద్రిక్తత 


నేరేడుచర్ల, మార్చి 6:  డంపింగ్‌ యార్డుకు కావాల్సిన భూమిని తామే కొనుగోలు చేసి ఇస్తామని, ఇక్కడ డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేయవద్దని పాతనేరేడుచర్ల గ్రామస్థులు కోరారు. డంపింగ్‌ యార్డు పనుల్లో భాగంగా ఎక్స్‌కవేటర్‌తో శనివారం భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్నారు. కమిషనర్‌ గోపయ్య, తహసీల్దార్‌ సరితతో పాటు నేరేడుచర్ల, పాలకవీడు ఎస్‌ఐలు యాదవేంద్రరెడ్డి, నరే్‌షలు బందోబస్తుతో వెళ్లి ప్రభుత్వభూమిని చదును చేయించేందుకు రెండు ఎక్స్‌కవేటర్లతో చెట్లను తొలగించారు. కొద్ది సేపటికే గ్రామస్థులు తరలివచ్చారు. పోలీసులను తోసుకొని గ్రామస్థులు రావడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. తాము ఉన్నతాధికారులతో మాట్లాడతామని వైస్‌ చైర్మన్‌ శ్రీలతారెడ్డి, కౌన్సిలర్‌ కొణతం చిన వెంకటరెడ్డి, డీసీఈసీబీ డైరక్టర్‌ దొండపాటి అప్పిరెడ్డిలు నేరేడుచర్ల తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి ఆర్డీవోతో చర్చించారు. తాము స్వయంగా రెండెకరాలు కొనుగోలు చేసి డంపింగ్‌ యార్డుకోసం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఆర్డీవో కలెక్టర్‌తో మాట్లాడారు. రెవెన్యూ అధికారులు స్వాధీనపర్చుకోవాలని వైస్‌చైర్మన్‌ చల్లా శ్రీలతారెడ్డి ఆర్డీవోను కోరారు. నేరేడుచర్లలో 350ఎకరాలు ప్రభుత్వ భూమి రికార్డుల్లో ఉందని, వెంటనే ఆ భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని కోరారు. గ్రామస్థులంతా డంపింగ్‌ యార్డు వద్దకు వెళ్లి అడ్డుకోవడంతో మొదలు పెట్టిన పనులు నిలిచిపోయాయి. 


 

Updated Date - 2021-03-07T06:08:19+05:30 IST