ఆరు నెలల్లో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మిస్తాం

ABN , First Publish Date - 2022-01-22T04:23:48+05:30 IST

కూరగాయల వ్యాపారులు మునిసిపాలిటీకి సహాకారిస్తే ఆరు నెలల్లోగా సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ను ఆధునాతనంగా నిర్మించి మీరు వ్యాపారాలు చేసుకునేందుకు అప్పగిస్తామని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ తెలిపారు.

ఆరు నెలల్లో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మిస్తాం
కూరగాయల వ్యాపారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

 కలెక్టర్‌ గౌతమ్‌

 వైరా, మధిర, ఎర్రుపాలెంలో పర్యటన

వైరా/మధిరటౌన్‌, జనవరి 21: కూరగాయల వ్యాపారులు మునిసిపాలిటీకి సహాకారిస్తే ఆరు నెలల్లోగా సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ను ఆధునాతనంగా నిర్మించి మీరు వ్యాపారాలు చేసుకునేందుకు అప్పగిస్తామని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ తెలిపారు. శుక్రవారం వైరాలో రూ. 5 కోట్లతో నిర్మించ తలపెట్టిన సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ స్థలాన్ని అలాగే ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌ను సందర్శించి పరిశీలించారు. ముందు గా మునిసిపల్‌ చైౖర్మన్‌ సూతకాని జైపాల్‌, కమిషనర్‌ ఎన్‌. వెంకటస్వామితో ఈ మార్కెట్‌ నిర్మాణానికి ఉన్న అడ్డంకులపై సమీక్షించారు. మార్కెట్‌ ప్లాన్‌ మ్యాప్‌ను పరిశీలించారు. కూరగాయల మార్కెట్‌ను సందర్శించి అక్కడ వ్యాపారులతో మాట్లాడారు. మార్కెట్‌లో మినహా బయట రోడ్లపై తోపుడు బండ్లతో కూరగాయల వ్యాపారాలను అనుమతించవద్దని అలా చేస్తే మార్కెట్‌లోని వ్యాపారులు దెబ్బతింటారని కలెక్టర్‌ స్పష్టం చేశారు. రోడ్లపై కూరగాయల వ్యాపారాలు లేకుండా చూడాలని కలెక్టర్‌ మునిసిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. కొత్త మార్కెట్‌ నిర్మించిన తర్వాత వైరా ప్రజలకు, వ్యాపారులకు అన్ని వసతులతో ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. అందువలన ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా మునిసిపాలిటీకి సహకరిస్తే.. మూడు, నాలుగు నెలల్లో మార్కెట్‌ నిర్మిస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు నెలల్లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకు హరిత రెస్టారెంట్‌లోని స్థలంలో వ్యాపారాలు చేసుకోవాలని అందుకు మున్సిపల్‌ అధికారులకు సహకరించాలన్నారు. ప్రస్తుతం ఉన్న చోటనే కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని అలా అయితే తాము సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని కూరగాయల వ్యాపారులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌, ముళ్లపాటి సీతరాములు, మండల ప్రత్యేకాధికారి కస్తాల సత్యనారాయణ, తహశీల్దార్‌ ఎన్‌. అరుణ, ఎంపీడీఓ ఎన్‌. వెంకటపతిరాజు, ఏఈ అనిత పాల్గొన్నారు.


అడ్డంకులు తొలగించండి.. డ్రెయినేజీ నిర్మించండి


వైరాలోని నేషనల్‌ హైవేకు రెండు వైపులా డ్రెయినేజీ నిర్మాణానికి ఎదురవుతున్న ఆటంకాలపై కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ప్రత్యేక దృష్టి సారించారు. మిషన్‌ భగీరథ గ్రీడ్‌ పైపులైనుకు ఎలాంటి నష్టం లేకుండా ఆక్రమణలను తొలగించి డ్రెయినేజీ నిర్మించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌. వెంకటస్వామిని కలెక్టర్‌ ఆదేశించారు. మధిర తదితర ప్రాంతాల్లో పర్యటనలు ముగించుకోని తిరుగు ప్రయాణంలో ఖమ్మం వెళ్తూ.. శుక్రవారం సాయంత్రం రెండోసారి వైరాలో మళ్లి పర్యటించారు. కమిషనర్‌ను కారు వద్దకు పిలిచి డ్రెయినేజీ నిర్మాణానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించి పనులు చేపట్టాలని ఆదేశించారు. అంతకు ముందు రోడ్డు మధ్య నుంచి 50-55 అడుగుల మధ్యలో డ్రెయినేజీ నిర్మించడం వలన జరిగే నష్టంపై నివేదిక అడిగారు.

 జ్వరం సర్వేను పరిశీలించిన కలెక్టర్‌

వైరా మునిసిపాలిటీ 7వ వార్డులో జరుగుతున్న జ్వరం సర్వేను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సర్వేలో పాల్గొంటున్న ఐకేపీ ఆర్పీలకు కరోనా కిట్లను పంపిణీ చేశారు. అలాగే గిరిజన భవన నిర్మాణానికి వైరా సొసైటీ స్థలాన్ని పరిశీలించారు. మున్సిపల్‌ చైౖర్మన్‌, వైస్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, ముళ్లపాటి సీతరాములు, కమిషనర్‌ ఎన్‌. వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. 

మధిరలో కలెక్టర్‌ విస్తృత పర్యటన  

మధిర టౌన్‌: కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ శుక్రవారం మధిరలో విస్తృతంగా పర్యటించారు. ప్రధానంగా మధిర పట్టణానికి మంజూరు అయిన సమీకృత వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌ నిర్మాణానికి గతంలో పరిశీలించి ఎంపిక చేసిన స్థలం అభ్యంతరాలు రావడంతో నూతన స్థల పరిశీలన కోసం వచ్చిన కలెక్టర్‌ బంజారా కాలనీ వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని, కూరగాయల మార్కెట్‌ వద్ద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రైతుబజారు ను సందర్శించి కూరగాయల విక్రయించే వారితో మాట్లాడారు.  దానికి ఎదురుగా ఉన్న ఖాళీ బడ్డీ కొట్లను చూసి రోడ్లను ఆక్రమించి అద్దెలకు ఇస్తారని తక్షణమే వీటిని తొలగించాలని మునిసిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఎంపీడీవో ఆఫీస్‌ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదులు రావ డంతో దీనిపై విచారించి సంయుక్తంగా నివేదిక ఇవ్వాలని  మునిసిపల్‌ కమిషనర్‌, తహసీల్దార్‌ ను ఆదేశించారు. స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయాలని సైదల్లిపురం సర్పంచ్‌ చిట్టిబాబు, గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల స్థలాలను చూపించాలని, తమ సమ్యసలు పరిష్కరించాలని పలువురు కలెక్టర్‌కు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం కృష్ణాపురం వద్ద ఇటీవల వేసిన రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవీంధ్రనాధ్‌, తహసీల్దార్‌ రాజేష్‌, మునిసిపల్‌ కమిషనర్‌ రమాదేవి, ఎంపీడీవో విజయభాస్కర్‌ రెడ్డి పలువురు ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-22T04:23:48+05:30 IST