ఒమన్‌లో శ్రీకాకుళం వాసుల తీవ్ర అవస్థలు

ABN , First Publish Date - 2022-08-19T03:56:05+05:30 IST

ఒమన్‌లో శ్రీకాకుళం వాసుల తీవ్ర అవస్థలు

ఒమన్‌లో శ్రీకాకుళం వాసుల తీవ్ర అవస్థలు
ఒమన్‌లో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా వాసులు

- మమ్మల్ని స్వదేశానికి తీసుకెళ్లండి

- తిండి లేక అవస్థలు పడుతున్నాం 

- వేడుకుంటున్న శ్రీకాకుళం జిల్లా వాసులు

సంతబొమ్మాళి, ఆగస్టు 18: ఉద్యోగాల కోసం ఒమన్‌కు వెళ్లి మోసపోయామని, తమను స్వదేశానికి రప్పించాలని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 8 మంది బాధితులు వేడుకుంటున్నారు. అధిక జీతాలు వస్తాయన్న ఆశతో బ్రోకర్లను నమ్మి ఒమన్‌లో చిక్కుకున్నామన్నారు. అక్కడ పనిలేక తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు వారు ఓ వీడియో ఇక్కడికి పంపించారు. వారి వివరాల మేరకు.. సంతబొమ్మాళి మండలం గోవిందపురానికి చెందిన కల్లి నాయుడు, కంచలి మండలం పెద్ద పోలేరుకు చెందిన వాశెట్టి రవికుమార్‌, గుల్లా గోపాల్‌, సోంపేట మండలం బేసి రామచంద్రాపురానికి చెందిన శీల వాసుదేవ్‌, వజ్రపుకొత్తూరు మండలం తోటపల్లికి చెందిన తామాడ కృష్ణారావు, లేరపల్లికి చెందిన కీలు మాణిక్యాలరావు, గోపినాథపురానికి చెందిన కర్ని లోకనాథం, బాలాజీపురానికి చెందిన తలగాన నీలకంఠం మూడు నెలల క్రితం విశాఖపట్నానికి చెందిన ఓ ఇన్‌స్టిట్యూట్‌ను సంప్రదించారు. తెలంగాణకు చెందిన వ్యక్తి వీరిని విశాఖలో ఇంటర్వూ చేశాడు. మంచి జీతం లభిస్తుందని, తాను ఆ కంపెనీలోనే పనిచేస్తున్నానని నమ్మబలికాడు. దీంతో రూ.60 వేలతో పాటు మెడికల్‌ టెస్టులకు మరో రూ.10వేలు మొత్తం రూ.70 వేల చొప్పున జిల్లాకు చెందిన 8 మంది చెల్లించారు. మే 5వ తేదీన ఆ వ్యక్తితో పాటు వారంతా ఒమన్‌ దేశం వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఆ వ్యక్తి చెప్పిన కంపెనీ లేదు. ఆ వ్యక్తి అందరినీ ఒక రూంలోనే ఉంచాడు. పని కోసం వెతుకుతున్నట్లు వారికి చెప్పారు. ఇప్పడు అందరినీ చిన్న పల్లెటూరులో ఉంచాడు. చాలీచాలని భోజనంతో జీవిస్తున్నామని, తమ వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్లు తీసుకున్నాడని, తాము బయటకు వచ్చి ఫిర్యాదు చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని బాధితులు ఆ వీడియో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజాప్రతినిధులు తమను స్వదేశానికి క్షేమంగా తీసుకురావాలని వారు వేడుకున్నారు. 

Updated Date - 2022-08-19T03:56:05+05:30 IST