Abn logo
Oct 1 2020 @ 02:30AM

తీర్పును స్వాగతిస్తున్నాం

Kaakateeya

రామజన్మభూమి ఉద్యమం పట్ల మా చిత్తశుద్ధిని నిరూపించింది: ఆడ్వాణీ

భగవంతుడు అందరినీ ఆశీర్వదిస్తాడు: జోషి

ఆలస్యమైనా న్యాయమే  గెలిచింది: రాజ్‌నాథ్‌

తీర్పును స్వాగతించిన వీహెచ్‌పీ, ఆరెస్సెస్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ స్వాగతించారు. ఈ కేసులో ఆడ్వాణీ సహా 32 మందిని కోర్టు బుధవారం నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన 92 ఏళ్ల ఆడ్వాణీ.. ‘జై శ్రీరామ్‌’ అంటూ నినదించారు. రామజన్మభూమి ఉద్యమం పట్ల వ్యక్తిగతంగా తనకు, బీజేపీకి ఉన్న నమ్మకం, చిత్తశుద్ధి ఈ తీర్పుతో నిరూపితమయ్యాయని చెప్పారు. ‘‘ఇదెంతో కీలకమైన నిర్ణయం. మాకెంతో సంతోషం కలిగించింది. కోర్టు తీర్పు గురించి తెలియగానే.. జై శ్రీరామ్‌ నినాదాలతో స్వాగతించాం’’ అని ఆడ్వాణీ వీడియో సందేశంలో తెలిపారు. ‘‘గత నవంబరులో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు బాటలోనే ప్రస్తుత తీర్పు వచ్చింది. ఇది మాకు ఆశీర్వచనమే. సుప్రీం తీర్పుతో అయోధ్యలో నేనెంతో కాలంగా ఎదురుచూస్తున్న భవ్యమైన రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. నా స్వప్నం నెరవేరబోతోంది’’ అని సంతోషం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వార్తలను ఆయన కుమార్తె ప్రతిభ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి టీవీలో చూశారు. తీర్పు వెలువడిన అనంతరం తన నివాసం వద్దకు చేరుకున్న మీడియా ప్రతినిధులను ‘జై శ్రీరామ్‌’ అంటూ సంతోషంగా పలకరించారు. అయోధ్య ఉద్యమ సమయంలో తనకు అండగా నిలిచిన బీజేపీ కార్యకర్తలు, నేతలు, సాధువులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో మంది త్యాగాలు చేశారని, వారి అండతోనే తాను ఉద్యమాన్ని నడిపించానని ఆడ్వాణీ వెల్లడించారు. బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి కూడా కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘‘నేను ఒక్కటే చెబుతా. జై జై శ్రీరామ్‌. భగవంతుడు అందరినీ ఆశీర్వదిస్తాడు’’ అని అన్నారు. బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాస్త ఆలస్యమైనా న్యాయమే గెలిచిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.  గౌరవప్రదమైన నేతలపై కుట్ర పూరితంగా నమోదు చేసిన కేసులో మూడు దశాబ్దాల తర్వాత సత్యమే గెలిచిందని బీజేపీ నేత రాంమాధవ్‌ ట్వీట్‌ చేశారు. బాబ్రీ కూల్చివేత కేసులో సత్యం, న్యాయమే గెలిచాయని వీహెచ్‌పీ పేర్కొంది. ఈ కేసులో న్యాయం గెలిచేందుకు 28 ఏళ్లు పట్టిందని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌కుమార్‌ అన్నారు. ఏహెచ్‌పీ అధ్యక్షుడు ప్రవీణ్‌ తొగాడియా, ఇతర హిందూ సంస్థల నేతలు కోర్టు తీర్పును స్వాగతించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ, ముంబై నగరాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 


నా నిర్ణయమే సరైందని నిరూపితమైంది: శర్మ 

బాబ్రీ కూల్చివేత కేసులో నాటి ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీపై నేరపూరిత కుట్ర అభియోగాన్ని ఉపసంహరించాలని తాను నిర్ణయించానని సీబీఐ మాజీ చీఫ్‌ పీసీ శర్మ అన్నారు. తాజా తీర్పుతో తన నిర్ణయం సరైందేనని తేలిందని చెప్పారు.  


దురదృష్టకరం: సీపీఐ నారాయణ

డాబాగార్డెన్స్‌ (విశాఖపట్నం)/అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 30: ‘ప్రపంచమంతా చూస్తుండగానే బాబ్రీమసీదు కూల్చివేత జరిగింది. అటువంటి కేసులో ఆధారాల్లేవు కాబట్టి, నిందితులంతా నిర్దోషులు అని సీబీఐ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం అత్యంత దురదృష్టకరం’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. 


బాబ్రీ కేసుకు ప్రాధాన్యమే లేదు: శివసేన 

రామజన్మభూమి వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించిన నేపథ్యంలో బాబ్రీ కూల్చివేత కేసుకు ప్రాధాన్యమే లేకుండా పోయిందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అన్నారు. అయినా సీబీఐ కోర్టు తీర్పును శివసేన స్వాగతిస్తోందని చెప్పారు. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పునివ్వడం, రామాలయానికి శంకుస్థాపన కూడా చేయడంతో ఈ కేసుకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్నారు. చివరికి సత్యమే గెలిచిందని కేసులో నిర్దోషిగా బయటపడిన శివసేన మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నేత సతీశ్‌ ప్రధాన్‌ చెప్పారు. 


సత్యమేవ జయతే: యోగి ఆదిత్యనాథ్‌ 

బాబ్రీ కేసులో సీబీఐ కోర్టు తీర్పును యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతించారు. ఇది సత్యానికి లభించిన విజయమన్నారు. నాటి కాంగ్రెస్‌ సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సాధువులు, బీజేపీ నేతలు, వీహెచ్‌పీ పదాధికారులు, ఇతరులపై అభియోగాలు మోపిందని ఆరోపించారు. నాటి కుట్రకు బాధ్యులైన వారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆడ్వాణీ, జోషిలకు ఆయన ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. 


సామరస్యంగా సాగుదాం: ఆరెస్సెస్‌ 

కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆరెస్సెస్‌ ప్రకటించింది. ‘‘బాబ్రీ కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ స్వాగతిస్తోంది. ఈ నిర్ణయం తర్వాత సమాజంలోని అన్ని వర్గాల వారు  సామరస్యంగా ముందుకు సాగాలి’’ అని ఆరెస్సెస్‌ నేత సురేశ్‌ భయ్యాజీ జోషి ట్విటర్‌లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement