కుక్కింద ఉన్నత పాఠశాలలో అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్ నిఖిల
ధారూరు, మే 17 : మన ఊరు-మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను సత్వరమే చేపట్టి, త్వరితగతిన పూర్తిచేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని కుక్కింద జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను మంగళవారం ఆమె సందర్శించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పాఠశాలకు మంజూరైన రూ.58లక్షల నిధులతో అవసరమైన పనులు చేపట్టి, పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అధునికీకరణ పనులు పూర్తిచేయాలని సూచించారు. పాఠశాలకు అవసరమైన డైనింగ్ హాలు, వంటగది, ఫ్లోరింగ్, తలుపులు, తాగునీటి సదుపాయంతో పాటు, సుందరీకరణ పనులను పూర్తి చేయాలని ఆమె సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి రేణుకాదేవి, మండల విద్యాధికారి బాబూసింగ్, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్, ఉపాధ్యాయులు ఉన్నారు.