భారత్ టీకా నాకు మేలు చేసింది : బోరిస్ జాన్సన్

ABN , First Publish Date - 2022-04-22T22:56:05+05:30 IST

బ్రిటన్ గడ్డపై ఉంటూ, ఇతర దేశాలను బెదిరించే ఉగ్రవాద సంస్థలను

భారత్ టీకా నాకు మేలు చేసింది : బోరిస్ జాన్సన్

న్యూఢిల్లీ : బ్రిటన్ గడ్డపై ఉంటూ, ఇతర దేశాలను బెదిరించే ఉగ్రవాద సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదనేది తమ బలమైన దృక్పథమని ఆ దేశ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. శుక్రవారం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి హైదరాబాద్ హౌస్‌లో సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. 


ఆర్థిక నేరగాళ్ళు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, ఖలిస్థానీ ఉగ్రవాదులను భారత దేశానికి అప్పగించడం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు జాన్సన్ సమాధానం చెప్తూ, భారత దేశాన్ని, ఇతర దేశాలను బెదిరించే ఉగ్రవాద సంస్థల పట్ల తమకు బలమైన దృక్పథం ఉందని చెప్పారు. భారత దేశానికి సహాయపడేందుకు తాము యాంటీ ఎక్స్‌ట్రీమిస్ట్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. 


భారత దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో ఉంటున్న ఆర్థిక నేరగాళ్ళను తిరిగి స్వదేశానికి అప్పగించడం గురించి మాట్లాడుతూ, చట్టపరమైన సాంకేతిక అంశాలు ఇమిడియున్నందువల్ల వీరిని తిరిగి అప్పగించడం సంక్లిష్టమవుతోందని చెప్పారు. వారిని తిరిగి పంపిచేయాలని బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించిందన్నారు. భారత దేశంలోని చట్టాన్ని తప్పించుకోవడం కోసం బ్రిటన్‌లోని న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవాలనుకునేవారిని తాము స్వాగతించబోమని చెప్పారు. 


భారత టీకా బాగా పని చేసింది 

‘‘నా చేతికి భారత కోవిడ్-19 టీకా వేయించుకున్నాను. అది నాకు మేలు చేసింది. భారత దేశానికి చాలా ధన్యవాదాలు’’ అని బోరిస్ జాన్సన్ చెప్పారు. 


భారత్-బ్రిటన్ కోవిడ్ టీకా భాగస్వామ్యం

భారత్-బ్రిటన్ మధ్య వ్యాక్సిన్ల భాగస్వామ్య ఒప్పందం ఉంది. 2021 మే నెలలో మోదీ, జాన్సన్ మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో ఇరు దేశాలు ఈ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడానికి అంగీకారించారు.  కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకోవడానికి భాగస్వామ్యాన్ని పటిష్టపరచుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ఉత్పత్తి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల దాదాపు 100 కోట్ల మందికి ప్రయోజనం కలిగింది. 

Updated Date - 2022-04-22T22:56:05+05:30 IST