అమెరికా ఆంక్షలను లెక్కచేయబోం, చమురు పరిశ్రమను అభివృద్ధి చేస్తాం : ఇరాన్

ABN , First Publish Date - 2020-07-12T00:47:03+05:30 IST

అమెరికా ఆంక్షలు అమలవుతున్నప్పటికీ, తమ దేశంలో చమురు పరిశ్రమను

అమెరికా ఆంక్షలను లెక్కచేయబోం, చమురు పరిశ్రమను అభివృద్ధి చేస్తాం : ఇరాన్

టెహ్రాన్ : అమెరికా ఆంక్షలు అమలవుతున్నప్పటికీ, తమ దేశంలో చమురు పరిశ్రమను అభివృద్ధి చేసి తీరుతామని ఇరాన్ చమురు శాఖ మంత్రి బైజాన్ జంగనేహ్ స్పష్టం చేశారు. యారాన్ ఆయిల్ ఫీల్డ్ అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకోబోతున్న తరుణంలో బైజాన్ ఓ టెలివైజ్డ్ ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు మీడియా పేర్కొంది. 


నైరుతి ఇరాన్‌లో ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో యారాన్ చమురు క్షేత్రం ఉంది. ఇక్కడి నుంచి 39.5 మిలియన్ బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ, పర్షియా ఆయిల్ అండ్ గ్యాస్ (ఇరాన్ కంపెనీ) ఒప్పందం కుదుర్చుకోబోతున్నాయి. ఈ ఒప్పందం విలువ 294 మిలియన్ డాలర్లు. ఈ చమురు క్షేత్రం పొరుగునే ఉన్న ఇరాక్‌కు చెందిన మజ్నూన్ చమురు క్షేత్రంతో కలిసి ఉంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, ఇరాన్ చమురు ఉత్పత్తి పెరుగుతుంది. 


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆర్థిక ఆంక్షలతో ఇరాన్‌ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆరు దేశాలు సంతకాలు చేసిన ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏకపక్షంగా వైదొలగిన సంగతి తెలిసిందే. ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ చమురును ఇతర దేశాలు కొనడానికి అవకాశం లేకుండా పోయింది. మన దేశం కూడా ఇరాన్ నుంచి చమురు దిగుమతిని బాగా తగ్గించుకుంది. 


Updated Date - 2020-07-12T00:47:03+05:30 IST