సామాజిక మాధ్యమాల వాడకంపై ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోం : హైకోర్టు

ABN , First Publish Date - 2020-08-05T22:13:51+05:30 IST

రక్షణ దళాల సిబ్బంది, అధికారులు ఫేస్‌‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలను

సామాజిక మాధ్యమాల వాడకంపై ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోం : హైకోర్టు

న్యూఢిల్లీ : రక్షణ దళాల సిబ్బంది, అధికారులు ఫేస్‌‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలను వాడటానికి అనుమతి ఇస్తే, శత్రు దేశాలకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే, ఆ నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి కోర్టులు ఇష్టపడబోవని ఢిల్లీ హైకోర్టు బుధవారం చెప్పింది. 


ప్రస్తుత ప్రపంచంలో యుద్ధం అంటే కేవలం భూబాగాలను ఆక్రమించుకోవడానికి పరిమితం కావడం లేదని, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడం, దేశంలో ప్రజా అశాంతిని రెచ్చగొట్టడం వంటివాటికి విస్తరించిందని పేర్కొంది. 


భారత సైన్యం తన సిబ్బంది, అధికారులు  89 సామాజిక మాధ్యమాల సైట్లను వాడటంపై విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా, జస్టిస్ ఆశా మీనన్ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. 


భారత సైన్యంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది తమ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సహా 89 సామాజిక మాధ్యమాల వెబ్‌సైట్లలోని ఖాతాలను తొలగించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ జూన్ 6న ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను లెఫ్టినెంట్ కల్నల్ పీకే చౌదరి సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 


నేటి ప్రపంచంలో ఏదైనా దేశంపై యుద్ధం చేసే శత్రు దేశాలు కేవలం భూబాగాలను ఆక్రమించుకోవడానికి పరిమితం కావడం లేదని హైకోర్టు తెలిపింది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, ప్రజల రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేయడం, అశాంతి సృష్టించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, అందువల్ల ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి తాము ఇష్టపడటం లేదని తెలిపింది. 


Updated Date - 2020-08-05T22:13:51+05:30 IST