ప్రైవేటీకరణ ఒప్పుకోం

ABN , First Publish Date - 2020-10-01T16:45:35+05:30 IST

విజయ డెయిరీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం అడుగులు కదిపింది..

ప్రైవేటీకరణ ఒప్పుకోం

మదనపల్లె విజయ డెయిరీ నిర్వహణకు టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం

నిరసిస్తూ ఆందోళనకు దిగిన రైతులు

పాల సేకరణలో జిల్లాకే తలమానికంగా నిలిచిన మదనపల్లె 


మదనపల్లె(చిత్తూరు): విజయ డెయిరీని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం అడుగులు కదిపింది. గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో  రూ.35కోట్లతో అభివృద్ధి చేసిన డెయిరీని ప్రస్తుతం పీపీపీ మోడ్‌ పద్దతిలో ప్రైవేటు వ్యక్తుల నిర్వహణకు ఈనెల 3వ తేది ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు పిలిచింది. ఈ విషయం తెలిసిన పాడి రైతులు డెయిరీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.


ఏపీ డెయిరీ డెవల్‌పమెంట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో దశాబ్దాలుగా మదనపల్లె-బెంగళూరు మార్గంలోని చిప్పిలి వద్ద విజయ డెయిరీ పాలసేకరణ చేస్తోంది. జిల్లాలోనే అత్యధికంగా రోజుకు లక్ష లీటర్ల పాల సేకరణ చేసిన ఘనత ఈ డెయిరీ దక్కించుకుంది. పడమటి మండలాల్లో 13 బీఎంసీ(బల్క్‌మిల్క్‌చిల్లింగ్‌)కేంద్రాల ద్వారా పాలసేకరణ చేశారు. మదనపల్లె నుంచి హైదరాబాద్‌కు రోజూ లక్ష లీటర్ల పాలను సరఫరా చేశారు. రాష్ట్ర విభజన తరువాత అనేక ఆటుపోట్లతో విజయ డెయిరీ నిర్వహణ కష్టంగా మారింది.ఉమ్మడి నిర్వహణలో ఆంధ్రలోని విజయ డెయిరీకి రావాల్సిన బకాయిలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో 2017వ సంవత్సరంలో అప్పటి ఏపీడీడీసీఎఫ్‌ ఎండీ మురళి విజయ డెయిరీ అభివృద్ధికి చొరవ చూపారు.


115 సంఘాలతో సొసైటీలు ఏర్పాటు చేసి, ఈ సొసైటీలకు మహిళలే ప్రాతినిధ్యం వహించేలా చూసి డెయిరీకి పాలసేకరణ పెంచేలా చర్యలు చేపట్టారు. అంతే కాక మదనపల్లె విజయ డెయిరీలో రూ.35 కోట్లతో టెట్రా ప్యాకింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, అప్పటి సీఎం చంద్రబాబు నిధులు మంజూరు చేశారు. 2019 ఏప్రిల్‌లో చంద్రబాబు మదనపల్లె పర్యటనలో ఈ టెట్రా ప్యాకింగ్‌ యూనిట్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వున్న లక్షలాది అంగన్‌వాడీ కేంద్రాలకు మదనపల్లె నుంచే టెట్రా ప్యాకింగ్‌ పాలు సరఫరా చేస్తున్నారు.ఇదిలా వుండగా విజయ డెయిరీ నుంచి రైతులకు పాల బకాయిలు చెల్లించడంలో ఆలస్యం అవుతూ వచ్చింది. అంతేకాక ప్రైవేటు డెయిరీల కన్నా తక్కువ ధర(లీటరుకు రూ.2 నుంచి 3) మాత్రమే చెల్లిస్తుండడంతో పాడిరైతులు ప్రైవేటు డెయిరీల వైపు మొగ్గు చూపారు.


2019 డిసెంబరు నెలాఖరు నాటికి విజయ డెయిరీ రైతులకు రూ.15 లక్షల బకాయిలు నిలిపివేసింది. దీంతోపాటు మరో రూ.15లక్షల రవాణా ఛార్జీలు నిలిచిపోయాయి. దీంతో రైతులు విజయ డెయిరీకి పాలు పోయడం నిలిపివేశారు.కేవలం 250 లీటర్ల పాలు మాత్రమే డెయిరీకి వస్తుండడంతో నిర్వహణ కష్టంగా మారి ఈ యేడాది జనవరి నుంచి మే నెల వరకు డెయిరీ మూతపడింది. రూ.35 కోట్లతో నిర్మించిన టెట్రా ప్యాకింగ్‌ యూనిట్‌ మూతపడి యంత్రాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. దీంతో ఏపీడీడీసీఎఫ్‌ కర్ణాటకలోని ప్రైవేటు డెయిరీల నుంచి పాలు కొనుగోలు చేసి టెట్రాప్యాకింగ్‌ యూనిట్‌ నడుపుతోంది.


డెయిరీ నిర్వహణకు టెండర్ల ఆహ్వానం

మదనపల్లె విజయ డెయిరీని పీపీపీ(పబ్లిక్‌ ప్రైవేటు పార్టిసిపేషన్‌) పద్ధతిలో ప్రైవేటు వ్యక్తుల నిర్వహణకు ఏపీడీడీసీఎఫ్‌ ఈనెల 3వ తేదిన ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు పిలిచింది.మదనపల్లె విజయ డెయిరీ పరిధిలోని బీఎంసీల నిర్వహణ, అక్కడి నుంచి పాల సేకరణ, డెయిరీ ప్లాంటు నిర్వహణ, టెట్రా ప్యాకింగ్‌ యూనిట్‌ నిర్వహణకు టెండర్లు పిలిచారు. ఈనెల 24వ తేది లోపల టెండర్లు చేరాలని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే జరిగితే కో ఆపరేటివ్‌ సొసైటీలుగా ఏర్పడిన 115 మహిళ సంఘాల భవితవ్యం కోల్పోనుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


డెయిరీ ఎదుట రైతుల ధర్నా

విజయ డెయిరీని ప్రభుత్వం ప్రైవేటీకరించే ప్రయత్నాలను మానుకోవాలని పాడిరైతులు బుధవారం ఆందోళనకు దిగారు. డెయిరీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కన్నతల్లిలా ఆదుకున్న విజయ డెయిరీని ప్రభుత్వం నిర్వహణ పేరుతో ప్రైవేటుపరం చేస్తే తమ బతుకులు రోడ్డున పడతాయన్నారు. ప్రభుత్వ డెయిరీ వుంటేనే ప్రైవేటు డెయిరీలు పోటీతో ధరలు పెంచుతాయని, లేకుంటే ధరల్లో కోతేస్తారన్నారు. పాడిరైతుల ధర్నాకు మద్దతు పలికిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా వున్నపుడు లక్ష లీటర్లు సేకరించిన విజయ డెయిరీని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోందన్నారు.


చిత్తూరు డెయిరీలా మదనపల్లె డెయిరీని మూసివేసేందుకు కుట్రపన్నుతున్నారన్నారు. స్థానిక రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లి రైతులు గోడు చెప్పుకుంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విజయ డెయిరీ ప్రైవేటీకరణ చర్యలు నిలిపివేయాలని, లేకుంటే ఆందోళనలు ఉధ్రుతం చేస్తామని హెచ్చరించారు. పీపీపీ విధానంతో రైతులకు నష్టం వాటిల్లదు విజయ డెయిరీ నిర్వహణను పీపీపీ పద్ధతిలో  అప్పగించినంత మాత్రాన పాడి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లదు.గుజరాత్‌లోని అముల్‌ సంస్థతో  ప్రభుత్వం  ఒప్పందం చేసుకున్న దరిమిలా, డెయిరీలోని యంత్రాలు పాడు కాకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా రైతుల నుంచే పాలసేకరణ చేస్తాం. ఈ పాలను టెట్రాప్యాకింగ్‌ చేసి, అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే సరఫరా చేస్తారు. బయట మార్కెట్‌లో విక్రయించరు.

- నవీన్‌కుమార్‌, మేనేజరు, విజయ డెయిరీ


Updated Date - 2020-10-01T16:45:35+05:30 IST