ప్రతి గింజను కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2021-04-16T06:18:48+05:30 IST

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
చర్లబూత్కూర్‌లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌

రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 15: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం కరీంనగర్‌ రూరల్‌ మండలం చర్లబూత్కూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కరోనా సాకుతో దేశంలో కొనుగోలు కేంద్రాలు మూసి వేస్తుంటే రైతుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి తెలంగాణలో గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు పూనుకున్నారన్నారు. యాసంగిలో సైతం మూడు వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం దిగుబడి రానుందన్నారు. జిల్లాలో 45 రోజుల్లో 4 లక్షల 34 వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ చేస్తామన్నారు. ఏ గ్రేడ్‌కు రూ.1,888, బి గ్రేడ్‌కు రూ.1,867 మద్దతు ధర చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో 6400కుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కోటి 32 లక్షల మెట్రిక్‌ టన్నుల ఽధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. కాళేశ్వరం జలాల ద్వారా ఎస్సారెస్పీ 11 ఆర్‌ కింద చర్లబూత్కూర్‌కు సమృద్ధిగా సాగునీరు, నిరంత విద్యుత్‌ అందుతుందన్నారు. యాసంగిలో 22 వేల క్వింటాళ్ల పైచిలుకు దిగుబడి అంచనాతో ప్రతి గింజ కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కరీంనగర్‌ జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామన్నారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి రైతుల ఇబ్బందులు తొలగిస్తామన్నారు. కొనుగోలు చేసిన రెండు మూడురోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా ప్రభుత్వ గ్యారెంటీతో బ్యాంకుల ద్వారా 20 వేల కోట్ల రూపాయలను సిద్ధం చేశామన్నారు. కలెక్టర్‌ కె శశాంక, నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  

  

రైతు విజ్ఞాన కేంద్రాలుగా రైతు వేదికలు

   రైతు వేదిక భవనాలు రైతు విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లనున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం ముగ్ధుంపూర్‌లో సొంత ఖర్చులతో సోదరుని జ్ఞాపకార్థం నిర్మించిన రైతువేదిక భవనాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేసేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. రైతుల బాధలు తెలిసిన ముఖ్యమంత్రిగా రైతులకు ఏం చేస్తే మేలు చేకూరుతుందో ఆలోచించి నిర్ణయాలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతువేదికల నిర్మాణాలు చేస్తున్నారన్నారు. తన సోదరుని జ్ఞాపకార్థం కొత్తపల్లి మండలం బద్దిపల్లి, ముగ్దుంపూర్‌ గ్రామాల్లో వేదికల నిర్మాణాలు చేశామన్నారు. గతంలో సాగునీరు, కరెంటు లేక రైతుల పొలాలు బీడు వారి పోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పూర్తి చేయడంతోపాటు పాటు క్రాస్‌ రెగ్యులేటర్‌ కట్టడం కోసం స్వయంగా చొరవ తీసుకుని ముగ్ధుంపూర్‌కు నీళ్లు తెచ్చామన్నారు.  రైతుబంధు, రైతు బీమా పథకాల అమలుతో విప్లవాత్మక పథకాలకు రూపకల్పన చేశామన్నారు. కొత్తపల్లి చెరువు, చెక్‌ డ్యాంలు నిర్మించుకుంటు భూగర్భ జలాలు పెంపొందించుకుని రైతు సంక్షేమం, అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.  కలెక్టర్‌ కె శశాంక, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎలుక అనిత, ఎంపీపీ లక్ష్మయ్య, జడ్పీటీసీ పురుమల్ల లలిత, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, ఆనంద్‌రావు, సర్పంచులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-16T06:18:48+05:30 IST