Rajya Sabha polls: ఇక్కడ అధికారం మాది, మర్చిపోకండి : శివసేన నేత

ABN , First Publish Date - 2022-06-04T19:16:40+05:30 IST

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శనివారం

Rajya Sabha polls: ఇక్కడ అధికారం మాది, మర్చిపోకండి : శివసేన నేత

ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శనివారం భారతీయ జనతా పార్టీని హెచ్చరించారు. మహారాష్ట్రలో ఒక రాజ్యసభ స్థానం కోసం ఇరు పార్టీలు పోరాటానికి సిద్ధమవుతున్న సమయంలో రౌత్ ఈ హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నామని బీజేపీ గుర్తుంచుకోవాలన్నారు. 


మహారాష్ట్ర (Maharashtra) నుంచి రాజ్యసభ (Rajya Sabha) ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో మహావికాస్ అగాడీ కూటమికి చెందినవారు నలుగురు, బీజేపీకి చెందినవారు ముగ్గురు ఉన్నారు. అయితే ఈ కూటమిలోని మూడు పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్నిబట్టి కాంగ్రెస్, ఎన్‌సీపీ, శివసేన ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకోవడానికి అవకాశం ఉంది. బీజేపీ (BJP) ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోగలుగుతుంది. అయితే ఈ కూటమి తరపున నాలుగో అభ్యర్థి గెలవాలంటే బీజేపీ ఎమ్మెల్యేల ఓట్లు అవసరం, అదేవిధంగా బీజేపీ తరపున మూడో అభ్యర్థి గెలవాలంటే ఈ కూటమిలోని ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. అందువల్ల బీజేపీ పెద్ద ఎత్తున బేరసారాలకు పాల్పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. 


ఈ నేపథ్యంలో శివసేన (Shiv Sena) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) స్పందిస్తూ, ఎమ్మెల్యేల కొనుగోలు, బేరసారాలు జరగకుండా చూసేందుకు రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేయాలన్నారు. బీజేపీ ఉద్దేశం చాలా స్పష్టంగా వెల్లడవుతోందన్నారు. డబ్బు, కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారన్నారు. మహారాష్ట్రలో తాము అధికారంలో ఉన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. మనీలాండరింగ్ జరుగుతోందని, దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. 


ఇదిలావుండగా, బీజేపీ, మహా వికాస్ అగాడీ కూటమి మధ్య ఓ పరిష్కారం సాధించేందుకు శుక్రవారం ఓ ప్రయత్నం జరిగింది. బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్‌సీపీ నేత చగన్ భుజ్‌బల్ చర్చలు జరిపారు. కానీ ఓ పరిష్కారం కుదరలేదు. 


రాజ్యసభ ఎన్నికలు జూన్ 10న జరుగుతాయి. ఫలితాలను అదే రోజు ప్రకటిస్తారు. ఇప్పటికే 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 


Updated Date - 2022-06-04T19:16:40+05:30 IST