కరోనాపై.. మేముసైతం

ABN , First Publish Date - 2020-03-31T09:01:16+05:30 IST

కలకలం సృష్టిస్తోన్న కరోనాపై ఒకవైపు ప్రభుత్వం యుద్ధం చేస్తుండగా.. మేము సైతం అంటు వివిధ వర్గాల ప్రజలు కూడా తమకు చేతనైన

కరోనాపై.. మేముసైతం

సేవా కార్యక్రమాలతో పలువురు చేయూత

ఆహార పొట్లాల పంపిణీ, రైతుబజార్లలో సేవలు


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌)

కలకలం సృష్టిస్తోన్న కరోనాపై ఒకవైపు ప్రభుత్వం యుద్ధం చేస్తుండగా.. మేము సైతం అంటు వివిధ వర్గాల ప్రజలు కూడా తమకు చేతనైన సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. లాక్‌డౌన్‌తో దినసరి కూలీలు, కార్మికులు, యాచకులతో పాటు పశుపక్ష్యాదులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆహారం, తాగునీరు తదితరాలను అందిస్తున్నారు. ఈ విధంగా పలు సంస్థలతో పాటు యువకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొందరైతే రైతుబజార్ల వద్ద సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అనాథలు, నిరాశ్రయులు, కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటివారి కడుపునింపేందుకు తమ వంతుగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు. 


అన్నదానమే గొప్పదానమంటూ పెదకాకాని మండలం తక్కెళ్ళపాడుకు చెందిన చిగురుపాటి ప్రసాద్‌ పెదకాకాని, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రోడ్డుపైన అలమటిస్తున్న కూలీలకు, పేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. సోమవారం సుమారు 500 మందికి ఆహార పొట్లాలను అందజేశారు. వచ్చే నెల 14  వరకు ప్రతిరోజూ 500 మందికి ఆహార పదార్థాలను అందజేస్తామని ప్రసాద్‌ తెలిపారు. 

 

ఫిరంగిపురంలోని ఎస్టీ కాలనీలో రూ.22 వేలు విలువ చేసే నిత్యావసరాలను జిల్లా విశ్రాంత అదనపు ఎస్పీ మొగిలి వెంకటేశ్వర్లు సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేడా రామకృష్ణ, కుంభా రామతిరుపతయ్య, మేడాశ్రీను, మేడా రామకోటయ్య, దేవరకొండ శంకర్‌, కుంభా ముసలయ్య మేడా నాగేశ్వరరావు, మేడా ఆంజయ్య తదితరులు పాల్గొన్నారు. 


లాక్‌డౌన్‌లో భాగంగా గుంటూరు బీఆర్‌ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రైతుబజార్ల వద్ద రెడ్‌క్రాస్‌, నెహ్రూ యువకేంద్రం వలంటీర్ల సేవలు అందిస్తున్నారు. దుకాణాల వద్ద  ఉదయం 5.30 గంటల నుంచి 10 గంటల వరకు వినియోగదారులకు తగిన సూచనలు ఇస్తూ సేవలు చేస్తున్నారు.


టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర(నాని) సోమవారం 23వ డివిజన్‌లో టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి గంటా వెంకట మౌళిక, గంటా పెద్దబ్బాయ్‌ ఇతర నాయకులతో కలిసి హోమియో మందులు, భోజన ప్యాకెట్లుతో పాటు కరోనాపై అవగాహనకు కరపత్రాలను పంపిణీ చేశారు.  కార్యక్రమంలో యాకోబు, చలపతిరావు, యాహోను, లాంవర్ధనరావు, పి మధు, పాపారావు, రావూరి కిషోర్‌, షైదా, శ్రీనివాసరావు, మురళీ, శ్రీపతి, అన్వర్‌ బాషా తదితరులున్నారు. 


పీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులోని రైల్వే స్టేషన్‌ ఎదుట నిరాశ్రయులు, అనాథలకు భోజన ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సయ్యద్‌ సుభాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


పుస్తకాలు, మ్యాగ్‌జైన్ల పంపిణీ

లాక్‌డౌన్‌ పేరుతో రోజుల తరబడి ఇంట్లో ఉండాల్సిన నేపథ్యంలో పుస్తకాలు పంపిణీ చేసేందుకు అవగాహన సంస్థ సిద్ధమైనట్లు కార్యదర్శి కొండా శివరామిరెడ్డి తెలిపారు. గుంటూరు అరండల్‌పేటలోని అవగాహన కార్యాలయంలో పుస్తకాలు, మ్యాగజైన్లు, ఆదివారం అనుబంధం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. పుస్తకాలు కావాల్సిన వారు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అరండల్‌పేట 15/1 కుబేరా టవర్స్‌లోని అవగాహన కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. వివరాలకు 0863 - 2251945, 9394107157కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవాలన్నారు.


గుంటూరులోని శ్రీనివాసరావుపేటలో  సోమవారం జనసేన నాయకుడు ఆళ్లహరి మిత్రబృందం పలు వీధుల్లో ఇంటింటికి వెళ్లి కూరగాయలు అందజేశారు. వైసీపీ నాయకుడు గేదెల రమేష్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో టమాటాలు, పచ్చి మిరపకాయలు ప్రతీ గడపకు వెళ్లి పంపిణీ చేశారు.


గుంటూరులోని జిన్నాటవర్‌, గుజ్జనగుళ్ల, అరండల్‌పేట, బాడ్రీపేట తదితర ప్రాంతాల్లో వారికి రియల్‌ మిరాకిల్స్‌ బృంద సభ్యులు ద్విచక్ర వాహనాలపై తిరిగి భోజనం, మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సవరం రోహిత్‌ మాట్లాడుతూ పనులు లేక ప్రధాన వీధుల్లో చాలామంది పస్తులుంటున్నారని చెప్పారు. వారి ఆకలి తీర్చేందుకు తాము సామాజిక బాధ్యతగా తొలి రోజున 200 మందికి భోజనం పెట్టామన్నారు. లాక్‌డౌన్‌ పూర్తి అయ్యేంత వరకు ఏదో ఒక సహాయ కార్యక్రమం చేస్తుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు సునిత, సతీష్‌, రమేష్‌, విజయ్‌, శేఖర్‌, నాగూల్‌మీరా పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-31T09:01:16+05:30 IST