గట్టెక్కేదెలా...?

ABN , First Publish Date - 2022-04-15T15:43:35+05:30 IST

వాటర్‌బోర్డు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నా శివారులోని కొన్ని ప్రాంతాలు బోరు నీటిపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి...

గట్టెక్కేదెలా...?

ఎప్పటికప్పుడే డిస్ట్రిబ్యూషన్‌ రిజర్వాయర్లు ఖాళీ

పలు ప్రాంతాల్లో అరకొరగా నీటి సరఫరా

ఇప్పుడే ఇలా.. మిగిలిన 50 రోజులు ఎలా?

గ్రేటర్‌లో పడిపోతున్న భూగర్భ జలాలు


గ్రేటర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా జలాలే ఆధారంగా మారాయి. రోజుకు 600 మిలియన్‌ గ్యాలన్ల నీటిని తీసుకొచ్చి నగరవాసులకు సరఫరా చేస్తున్నా చాలడం లేదు. కొన్ని ప్రాంతాలకు అరకొరగానే అందుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో లో ప్రెషర్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇంకా 50 రోజులుండే వేసవి కాలాన్ని గట్టెక్కించడం వాటర్‌బోర్డుకు సవాల్‌గా మారింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా  సరఫరా ఎలా అనే దానిపై తర్జనభర్జన పడుతోంది. 


హైదరాబాద్‌ సిటీ: వాటర్‌బోర్డు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నా శివారులోని కొన్ని ప్రాంతాలు బోరు నీటిపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి. వేసవి ఎండలతో భూగర్భ జలాలు పడిపోవడంతో ఆయా ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలైంది. మొన్నటి వరకు అపార్ట్‌మెంట్లకు నీరందించిన బోర్లు సైతం పని చేయడం లేదు. దీంతో ఇబ్బందులు తీవ్రం అవుతున్నాయి. 


రోజూ 2, 450 మిలియన్ల నీటి సరఫరా

గ్రేటర్‌తోపాటు ఔటర్‌ పరిధిలోని ప్రాంతాలకు సరఫరా చేసేందుకు వాటర్‌బోర్డు రోజూ 2,450 మిలియన్‌ లీటర్ల నీటిని నగరానికి తీసుకొస్తోంది. కృష్ణా, గోదావరితో పాటు సింగూరు, మంజీర, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల నుంచి నగరానికి నీటిని తరలిస్తున్నారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలోని ప్రాంతాలకు 115 మిలియన్‌ లీటర్ల వరకు, జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 2,300 లీటర్ల నీళ్లు అందిస్తున్నారు. అవి సరిపోవడం లేదు. ఐటీ కారిడార్‌లో కంపెనీలు, వాణిజ్య సంస్థలన్నీ తెరుచుకోవడంతో నీటి అవసరాలు పెరిగాయి. 


నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు

నగరంలో గుట్టలు కలిగిన ప్రాంతాలైనా బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, బోరబండ, మాదాపూర్‌, వెంకటగిరి, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతుకు వెళ్తే కానీ నీళ్లు దొరికే పరిస్థితి లేదు. రంజాన్‌ మాసం కావడంతో పాతబస్తీతోపాటు పలు ప్రాంతాల్లో నీళ్లు అత్యవసరంగా మారాయి. ఉపవాస దీక్షల నేపథ్యంలో నీటి అవసరాలు పెరిగాయి. అందుకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిగిలిన 50 రోజుల వేసవి కాలంలో నీటి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.


రిజర్వాయర్లు ఖాళీ

వందల కిలోమీటర్ల నుంచి కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా జలాలను నగరానికి తీసుకొచ్చి డిస్ట్రిబ్యూషన్‌ రిజర్వాయర్లను నింపుతున్నారు. వచ్చిన నీళ్లు వచ్చినట్లుగా ఆయా ప్రాంతాల వాసులకు సరఫరా చేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు రోజూ సుమారు అరగంటకు పైగా నీళ్లు వదులుతుండగా, మరికొన్ని ప్రాంతాలకు 45 నిమిషాల వరకు అందిస్తున్నారు. రిజర్వాయర్లలో నీళ్లు ఎప్పటికప్పుడు ఖాళీ అవుతుండడంతో చాలా ప్రాంతాలకు సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదు. లో ప్రెషర్‌ కారణంగా కొన్నిచోట్ల నీళ్లు సరిపోవడం లేదు. 


కొన్ని ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి..

 అత్తాపూర్‌లోని భరత్‌నగర్‌ కాలనీకి నీళ్లు రావడం లేదని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్యాంకర్ల నీళ్లపై ఆధారపడాల్సి వస్తోందని చెబుతున్నారు.

 కూకట్‌పల్లి పరిధి హెచ్‌ఎంటీ హిల్స్‌లోని శుభోదయ కాలనీలో నాలుగు రోజులుగా నీళ్లు రావడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నామని స్థానికుడు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌ ప్రాంతంలోనూ  అదే పరిస్థితి. నీటి ఇబ్బందులు చెబుదామంటే అధికారులు ఫోన్లు ఎత్తడం లేదని స్థానికులు వాపోయారు. ట్యాంకర్‌ బుక్‌ చేసినా సకాలంలో రావడం లేదని చెబుతున్నారు.

 బేగంబజార్‌లోని ముల్తానిపురా వీధిలో రెండు రోజులుగా నీళ్లు రావడం లేదు. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

 హఫీజ్‌పేట పరిధి కేపీహెచ్‌బీ 9 ఫేజ్‌ పరిధి లోనూ నీళ్లు రావడం లేదు. ఎప్పటి వరకు వస్తాయో కూడా క్షేత్రస్థాయి సిబ్బంది సైతం చెప్పడం లేదు. 

 చిక్కడపల్లిలోని వివేకనగర్‌లో పరిధిలో నాలుగైదు రోజులుగా నీళ్లు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయాన్ని వాటర్‌బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తే బోర్డు జీఎం వచ్చి పరిశీలించారు. నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ  నేటికీ రావడం లేదు.  

 బోరబండ పరిధిలోని అల్లాపూర్‌లో నీటి సరఫరా నిలిచిపోయింది. ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో సిబ్బంది చెప్పడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-04-15T15:43:35+05:30 IST