పథకాలున్నా నీరుపయోగం

ABN , First Publish Date - 2022-06-30T06:07:17+05:30 IST

మన్యంలో విద్యుత్‌ సదుపాయం లేని మారుమూల ప్రాంతాల్లో గిరిజనుల దాహం తీర్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సోలార్‌ విద్యుత్‌ ఆధారిత నీటి పథకాలు చాలా వరకు అలంకారప్రాయంగా ఉన్నాయి.

పథకాలున్నా నీరుపయోగం
జి.మాడుగుల మండలం ఉరుముగ్రామంలో నిరుపయోగంగా ఉన్న సోలార్‌ నీటి పథకం

ఏజెన్సీ వ్యాప్తంగా 800 సోలార్‌ నీటి పథకాలు

విద్యుత్‌ సదుపాయం లేని ప్రాంతాల్లో రూ.32 కోట్లతో ఏర్పాటు

నిర్వహణను పట్టించుకోని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు

ఐదేళ్లపాటు ఉచితంగా మరమ్మతులు చేయాల్సి ఉన్నా మిన్నకుంటున్న కంపెనీ నిర్వాహకులు

చాలా పథకాలు మూలకు చేరినా చర్యలు శూన్యం

గిరిజనులకు తప్పని ఊటనీటి వెతలు 


ఏజెన్సీ వ్యాప్తంగా రూ.32 కోట్లతో 800 సోలార్‌ నీటి పథకాలు ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. వాటిని ఏర్పాటు చేసిన కంపెనీ ఐదేళ్ల పాటు ఉచితంగా మరమ్మతులు చేయాలన్న నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అఽధికారులు కూడా దీనిని పట్టించుకోవడం లేదు. ఫలితంగా చాలా నీటి పథకాలు మూలకు చేరాయి. యథావిధిగా గిరిజనులు ఊటగెడ్డ నీటిపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది.


(పాడేరు/పాడేరు రూరల్‌- ఆంరఽధజ్యోతి)  

మన్యంలో విద్యుత్‌ సదుపాయం లేని మారుమూల ప్రాంతాల్లో గిరిజనుల దాహం తీర్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సోలార్‌ విద్యుత్‌ ఆధారిత నీటి పథకాలు చాలా వరకు అలంకారప్రాయంగా ఉన్నాయి. వాటిని ఏర్పాటు చేసిన తరువాత అధికారులు నిర్వహణను పట్టించుకోవడం లేదు. దీంతో అవి మరమ్మతులకు గురై నిరుపయోగంగా ఉంటున్నాయి. ఫలితంగా గిరిజనులు ఊటగెడ్డ నీటిపైనే ఆధారపడాల్సిన దుస్థితి కొనసాగుతున్నది. ఏజెన్సీలో విద్యుత్‌ సౌకర్యం లేని పల్లెలకు సోలార్‌ ఆధారంగా నీటిని అందించాలని 2015లో గ్రామీణ నీటి సరఫరా అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏజెన్సీలో తొలి విడతగా సుమారు 120 వరకు సోలార్‌ నీటి పథకాలను మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఆ తరువాత నుంచి క్రమంగా మండల కేంద్రాలు, ఎక్కువ మంది జనాభా ఉన్న గ్రామాల్లో సైతం సోలార్‌ నీటి పథకాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఇప్పటికి దాదాపుగా ఏజెన్సీ వ్యాప్తంగా 800 వరకు సోలార్‌ నీటి పథకాలను ఏర్పాటు చేశారు. మొదట్లో ఒక్కో నీటి పథకానికి రూ.3.80 లక్షలు వ్యయం కాగా, ప్రస్తుతం రూ.5.30 లక్షలు వ్యయం చేస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటికి మన్యంలో ఏర్పాటు చేసిన మొత్తం సోలార్‌ పథకాలకు రూ.32 కోట్లు వరకు వ్యయం చేశారని అంచనా. 


పథకాల మరమ్మతులపై నిర్లక్ష్యం

ఏజెన్సీలో సోలార్‌ నీటి పథకాలను ఏర్పాటు చేసేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం చూపుతున్న శ్రద్ధ, వాటి మరమ్మతులపై కనీసం చూపడం లేదు. పథకాల ఏర్పాటు వరకే తమ బాధ్యత అన్నట్టుగా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వ్యవహరిస్తున్నారు. లక్ష్యం మేరకు వాటిని ఏర్పాటు చేశామా..? లేదా..? అనేదే ప్రాతిపదికగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. నీటి పథకం ఎన్నాళ్లు పని చేస్తుంది?, పని చేయకపోవడం వల్ల గిరిజనులు పడుతున్న తాగునీటి ఇబ్బందులు ఏమిటనే దానిపై కనీసం ఆలోచించడం లేదు. పథకాలు ఏర్పాటు చేశామా..?, తమ కమీషన్‌ తీసుకున్నామా..? అనేదే ప్రాధాన్యంగా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఆయా నీటి పథకాలను ఏర్పాటు చేస్తున్న కంపెనీ ఐదేళ్లు ఉచితంగా మరమ్మతులు చేయాలనేది నిబంధన. కానీ ఆర్‌డబ్ల్యూఎస్‌ అఽధికారులు, సదరు కంపెనీ మధ్య లాలూచీ కారణంగా వాటి మరమ్మతులపై అధికారులు పెద్దగా దృష్టిసారించడం లేదని తెలిసింది. దీంతో సోలార్‌ నీటి పథకాలు ఏర్పాటు చేసిన ఆరు నెలలు, ఏడాదిలోపే మోటార్లు పాడైపోవడం, స్టాటర్లు కాలిపోవడం వంటి మరమ్మతులకు గురైనా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో మరమ్మతుకు గురైన సోలార్‌ నీటి పథకాలు మూలకు చేరుకుంటున్నాయి. ఉదాహరణకు అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు మండలంలో మొత్తం 32 సోలార్‌ నీటి పథకాలకు ఎనిమిది పథకాలు చాన్నాళ్లుగా మరమ్మతులకు గురై నిరుపయోగంగా ఉన్నాయి. పాడేరు మండలంలో కించూరు, ఐనాడ, రాకోట, జామిగుడ, బైలువీధి, కొలంబో, మద్దులబంధ, కుంచాపల్లి, జి.కొత్తూరు, మినుములూరు గ్రామాల్లో సోలార్‌ నీటి పథకాలు పని చేయడం లేదు. అలాగే జి.మాడుగుల మండలంలో గొడుగుమామిడి, పెదలోచలి, ఉరుము, పాతమాడుగుల, కృష్ణాపురం, సింగర్భ, కొక్కిరాపల్లి, భీరం, కె.కోడాపల్లి, సొలభం గ్రామాల్లోని పథకాలు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. ఇదే పరిస్థితి ఏజెన్సీ వ్యాప్తంగా కొనసాగుతున్నది. అయితే ఆర్‌డబ్ల్యూఎస్‌ అఽధికారులు పట్టించుకోకపోవడంతో వాళ్లకు ఎన్నిమార్లు చెప్పినా ఉపయోగం లేదని గిరిజనులు సైతం మిన్నకుంటున్నారు. దీంతో సోలార్‌ నీటి పథకాలున్నా మరమ్మతులతో మూలకు చేరడంతో ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు ఊటగెడ్డ నీటిపైనే ఆధారపడుతున్నారు. దీంతో ఏజెన్సీలో సోలార్‌ నీటి పథకాలకు రూ.లక్షలు వ్యయం చేసినా గిరిజనుల తాగునీటి అవసరాలు తీర్చలేని దుస్థితి కొనసాగుతున్నది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సోలార్‌ నీటి పథకాలను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. 


సకాలంలో మరమ్మతులకు చర్యలు

ఏజెన్సీలో సోలార్‌ నీటి పథకాల నిర్వహణ బాగానే ఉంది. సహజంగా వాటికి స్వల్ప మరమ్మతులు వస్తుంటాయి. వాటిని టెండర్‌ పొందిన కంపెనీ బాగు చేస్తుంది. పథకం ఏర్పాటు చేసిన తరువాత ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ బాధ్యత సదరు కంపెనీదే. సోలార్‌ ప్యానెల్‌ పాడైతేనే నెల రోజులు పడుతున్నది. ఇతర మరమ్మతులు సకాలంలో చేపడుతున్నారు. మరమ్మతులకు గురైన పథకాల సమాచారం మాకు అందితే ఎప్పటికప్పుడు మరమ్మతులు నిర్వహిస్తాం. ప్రజలు వాటి వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాం. 

- జీవీఎస్‌ ప్రకాశ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈఈ, పాడేరు 

Updated Date - 2022-06-30T06:07:17+05:30 IST