చివరి ఆయకట్టుకు నీరందించాలి

ABN , First Publish Date - 2021-03-04T07:19:21+05:30 IST

ల్లాలోని ప్రాజెక్టుల పరిధిలోని చివరి ఆయకట్టు భూములన్నింటికీ సాగునీరు అందించేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు.

చివరి ఆయకట్టుకు నీరందించాలి
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ పోలా భాస్కర్‌

కలెక్టర్‌ పోలా భాస్కర్‌ 

మద్దిపాడు, మార్చి 3 : జిల్లాలోని ప్రాజెక్టుల పరిధిలోని చివరి ఆయకట్టు భూములన్నింటికీ సాగునీరు అందించేందుకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధిపై బుఽధవారం మల్లవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద, చిన్న ప్రాజెక్టుల నుంచి సజావుగా సాగునీరు వెళ్లేందుకు ఎదురైన అడ్డంకులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.  మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఆయా ప్రాజెక్టుల్లో నీరు తక్కువగా ఉన్న సమయంలో పనులు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్‌ సూచించారు. పుల్లలచెరువు, ఎర్రగొండపాలెం పరిధిలో సాగర్‌ ప్రధాన కాలువ 36వ మైలు నుంచి ఆయకట్టు చివరి వరకూ సుమారు 26వేల ఎకరాలకు నీరు చేరడం లేదని సీఎంకు ఆ ప్రాంత రైతులు ఫిర్యాదు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. దీనిపై ఇంజనీరింగ్‌ అధికారులు స్పందిస్తూ కాలువలో పూడిక తీత పనులు చేయకపోవడంతో దిగువకు నీరు వెళ్లడం లేదని చెప్పగా తక్షణమే ఆ పనులు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఏబీసీ 9వ మైలురాయి వద్ద నుంచి ఎర్రబాలెం, తమ్మవరం, కొరిశపాడు ప్రాంతాలకు నీరు సక్రమంగా చేరడం లేదని ఆయన తెలిపారు. వెంటనే అక్కడ నాలుగు కిలోమీటర్ల మేర కాలువ పూడికతీత పనులు చేపట్టాలన్నారు. జె.పంగులూరు మండలంలో 7వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా చూడాలన్నారు. తర్లుపాడు మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కింద పంట కాలువల్లో పూడికతీత పనులు రెండు నెలల్లో పూర్తిచేయాలన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు దిగువన ఉన్న మాచవరం, మోపాడు, గోపాలపురం మరొక గ్రామానికి నీరందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కంభం చెరువు కింద 2.3 టీఎంసీలు తాగునీరు వివిధ గ్రామాలకు అందించేలా పూడికతీత పనులు వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రామతీర్థం నుంచి ఎస్‌ఎన్‌పాడు మండలంలోని దిగువకు వచ్చే కాలువను ఆధునికీకరించాలని ఆదేశించారు. పర్చూరు, చిన్నగంజాం మండలాలకు ప్రధానమైన ఎత్తిపోతల పనులు పూర్తిచేయాలన్నారు. 6 కి.మీ మేర పంట కాలువ తవ్వకాలు చేపట్టాలని సూచించారు. కొరిశపాడు ఎత్తిపోతల కింద 467 కుటుంబాలు నిర్వాసితులవుతారని, వారందరికీ పునరావాసం కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. రూ.10కోట్లతో 50 ఎకరాలు భూసేకరణ చేపట్టి పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలన్నారు.  జేసీ వెంకటమురళి మాట్లాడుతూ గుండ్లకమ్మ కుడికాలువ ద్వారా చివరి భూములకు నీరందించడానికి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించాలన్నారు. జేసీ కె.కృష్ణవేణి, ప్రత్యేక కలెక్టర్‌ కె.సరళా వందనం, ప్రాజెక్టు ఎస్‌ఈ నగేష్‌బాబు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ రెడ్డయ్య, ఒంగోలు ఆర్డీవో ప్రభాకరరెడ్డి, తహసీల్దార్‌ సాయి శ్రీనివాస్‌, ప్రాజెక్టు డీఈ బోల్లయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-04T07:19:21+05:30 IST