నీటిని అక్రమంగా నిల్వ చేసి ముంచేస్తున్న అధికారులు

ABN , First Publish Date - 2021-06-23T05:19:12+05:30 IST

పోలవరం పునరావాసం అమలు చేయకుండా ఎగువ కాపరు డ్యాం నిర్మించి అక్రమంగా నీటిని నిల్వచేసి గిరిజన గూడెంలను ముంచేస్తున్నారంటూ ఏజెన్సీ గిరిజన సంఘం అధికారులపై ఆరోపణలు గుప్పించింది.

నీటిని అక్రమంగా నిల్వ చేసి ముంచేస్తున్న అధికారులు

  • ముఖ్యమంత్రి ప్రకటించిన 10 లక్షల ప్యాకేజీని అమలు చేయాలి 
  • ఐటీడీఏ పీవోకు, ఆర్డీవోకు ఏజెన్సీ గిరిజన సంఘం వినతిపత్రం

రంపచోడవరం, జూన్‌ 22:  పోలవరం పునరావాసం అమలు చేయకుండా ఎగువ కాపరు డ్యాం నిర్మించి అక్రమంగా నీటిని నిల్వచేసి గిరిజన గూడెంలను ముంచేస్తున్నారంటూ ఏజెన్సీ గిరిజన సంఘం అధికారులపై ఆరోపణలు గుప్పించింది. ఈ మేరకు మంగళవారం రంపచోడవరం ఐటీడీఏ పీవో, ఆర్డీవో లకు వినతిపత్రాలను అందజేశారు. కాపర్‌ డ్యాం కారణంగా గిరిజన గ్రామాల కు ప్రమాదం లేదని చెబుతున్న అధికారులు గిరిజన గ్రామాలను ముంచెత్తిన బ్యాక్‌వాటర్‌ వరదకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని వారు ప్రశ్నించారు. వరదతో ముంచేస్తే గిరిజనులు ఖాళీచేసి వెళిపోతారన్న భావనలో పునరావాసం పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ పోలవరంపై తన తొలి సమావేశంలో నిర్వాసితులందరికీ రూ.10 లక్షల ఆర్థిక ప్యాకేజీని ఇస్తా రని చేసిన ప్రకటన ఇప్పటికీ అమలుకు నోచుకోలేదేని వారు ఆరోపించారు. పునరావాస కాలనీలను అరకొర వసతులతోను, నాణ్యతా లోపాలతోను నిర్మించా రని, ఇవి నిర్వాసితులకు అసౌకర్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. నిర్వాసితుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా అధికారులు తమకు నచ్చిన చోట కాలనీలు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. కొండమొదలు పంచాయతీతో 2017లో పునరావాస అధికారులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాలతోపాటు న్యాయపోరాటాలు సాగిస్తామని వారు పేర్కొన్నారు. ఏజెన్సీ గిరిజన సంఘం అధ్యక్షుడు ఇల్లా రామిరెడ్డి, కొండమొదలు సర్పంచ్‌ వేట్ల విజయ, నాయకులు టి.బుల్లబ్బాయి, వి.సత్యనారాయణ  పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:19:12+05:30 IST