చెరువును తలపిస్తున్న పేదల ఇంటిస్థలాలు

ABN , First Publish Date - 2020-11-29T06:30:48+05:30 IST

పేదల ఇళ్ల కోసం కేటాయించిన స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి.

చెరువును తలపిస్తున్న పేదల ఇంటిస్థలాలు
ఇళ్ల స్థలాలు చుట్టూ ఉన్న నీరు

కనిగిరి, నవంబరు 28 : పేదల ఇళ్ల కోసం కేటాయించిన స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి. రవాణా సౌకర్యం,  జనసంచారం లేని కొండ దిగువన కనిగిరి పట్టణ పేదల ఇళ్లకు ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. ప్రస్తుతం కురిసిన వర్షాలకు అవి నీట మునిగాయి. నింబోడు కొండ దిగువన పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాల్లోకి నడుము లోతు నీళ్లు చేరాయి. ఇప్పటివరకు ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చుచేసి చదును చేసిన ఆ స్థలాల్లో మట్టి అంతా కొట్టుకుపోయింది. దీంతో పాత రాళ్లగుట్టలు, కొండగుట్టలు బయటపడ్డాయి. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదని ప్రచారం చేయడమే తప్ప ఆచరణలో ఏమాత్రం పాటించడం లేదనేందుకు ఇది ఉదాహరణ. పట్టణానికి దాదాపు 7 కిలో మీటర్ల దూరంలో గ్రానైట్‌ క్వారీల సమీపంలో కోట్లు వెచ్చించి నిరుపయోగమైన భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయించడం పట్ల ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పేదల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరుతున్నారు. 


Updated Date - 2020-11-29T06:30:48+05:30 IST