250 గ్రామాల్లో కట్‌..కట

ABN , First Publish Date - 2021-08-04T04:52:40+05:30 IST

ప్రజల దాహార్తిని తీర్చేందుకు సత్యసాయి సేవాసంస్థ ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా కార్మికుల నిరవదిక సమ్మెతో రెండు రోజులుగా నిలిచిపోయింది.

250 గ్రామాల్లో కట్‌..కట

సత్యసాయి పథకం కార్మికుల సమ్మె

ఏడు నెలలుగా వేతనాల పెండింగ్‌

మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలకు ఆగిన నీటి సరఫరా

 

పోలవరం, ఆగస్టు 3: ప్రజల దాహార్తిని తీర్చేందుకు సత్యసాయి సేవాసంస్థ ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా కార్మికుల నిరవదిక సమ్మెతో రెండు రోజులుగా నిలిచిపోయింది. పోలవరం, చింతలపూడి, కొవ్వూరు,గోపాలపురం నాలుగు నియోజకవర్గాల్లోని 17 మండలాల్లో 250 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం విలవిల్లాడుతున్నారు. వేతనాలు చెల్లించక పోవడంతో ఏడు నెలలుగా 160 మందికి పైగా కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో  సమ్మెబాట పట్టారు. 

2005 నుంచి ప్రారంభమైన సత్యసాయి మంచినీటి పథకం నిరంతరాయంగా 16 సంవ త్సరాలు ప్రజల మంచినీటి అవసరాలను తీర్చింది.  మెట్ట, మైదాన, గిరిజన ఏజెన్సీ పాంత్రాల్లో కొన్నిచోట్ల ఫ్లోరిన్‌ నీటితో ప్రజలు ఇబ్బందులు పడేవారు. మరికొన్నిచోట్ల సరైన తాగునీటి సదు పాయమే ఉండేది కాదు. సత్యసాయి మంచినీటి పథకంతో ఈ ఇబ్బందులు తొలగిపోయాయి. పోలవరంలో కృష్ణారావుపేటలో ఏర్పాటు చేసిన ప్యూరిఫికేషన్‌ ట్యాంకు ద్వారా పోలవరం, కొవ్వూరు నియోజకవర్గాలకు, గోపాలపురం మండలం హకుంపేటలో ఉన్న మరో ప్యూరిఫికేషన్‌ ట్యాంకు ద్వారా గోపాలపురం, చింతలపూడి నియోజకవర్గాలకు మంచినీరు సరఫరా అవుతోంది. గోదావరి నీటిని శుద్ధిచేసి పైప్‌లైన్ల ద్వారా ఈ నియోజకవర్గాల్లోని మండలాలకు సరఫరా చేస్తున్నారు. మొదట్లో సత్యసాయి ట్రస్టు నిధుల ద్వారానే దీన్ని నిర్వహించేవారు. 2007 నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఎల్‌అండ్‌టీ సంస్థకు మంచినీటి సరఫరా అప్పగించింది. అప్పటి నుంచి ఎల్‌అండ్‌టీ కాంట్రాక్టర్లే దీన్ని నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం 18 నెలలుగా బిల్లులు నిలిపి వేయడంతో ఎల్‌అండ్‌టీ కంపెనీ రెండునెలల క్రితమే మంచినీటి సరఫరా నిర్వహణ వదిలి వెళ్లిపోయింది. అప్పటికే కంపెనీ కార్మికులకు 5 నెలల 15 రోజుల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. కార్మికులు ఆందోళనకు దిగడంతో ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీరాజ్‌ అధికారులు కలుగ జేసుకుని బకాయిల విషయంలో తాము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కరోనా కష్టకాలంలో సైతం జీతాలు లేకపోయినా అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకొస్తూ మంచినీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విధులు నిర్వహించారు. విసిగి వేసారిన కార్మికులు రెండురోజులుగా సమ్మెబాట పట్టారు. వేతన బకాయిలు చెల్లించాలని,ఉద్యోగభద్రత కల్పించాలని,  విధులు నిర్వహిస్తూ చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని, జీవో నెం.11 ప్రకారం పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని వేతనాలు రూ.18500కు పెంచాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. 


అప్పులతో కాలం నెట్టుకొస్తున్నా

వాసంశెట్టి మోహన శివ ప్రసాద్‌, ఆపరేటర్‌

తొమ్మిది సంవత్సరాలుగా నీటి శుద్ధత విభాగంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాను. కృష్ణారావు పేటలో నెలకు రూ.3 వేలు అద్దె చెల్లిస్తూ ఏడు నెలలుగా అప్పులు చేస్తూ కాలం నెట్టుకొస్తున్నా. జీతాలు వస్తేకానీ పూట గడవని పరిస్థితి. అప్పు ఇచ్చిన వారు వేధింపులు మొదలుపెట్టారు. 


ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు

కందుకూరి ఆదిత్య, గుడ్డిగూడెం, లైన్‌మేన్‌

13 సంవత్సరాలుగా ఈ పథకంలో లైన్‌మేన్‌గా పనిచేస్తున్నాను. గోపాలపురం మండలం గుడ్డిగూడెం నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణం పోలవరం వచ్చి విఽధులు నిర్వహిస్తున్నాను. కరోనా కష్టకాలంలో సైతం ప్రాణాలకు తెగించి డ్యూటీ చేశాం. కార్మికులపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు. జీతాల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.


తిండికి కూడా ఇబ్బందులు

తిరుమలశెట్టి రవికుమార్‌, నూతనగూడెం,సెక్యూరిటీ గార్డు

పది సంవత్సరాలుగా మనుగోపల ప్లాంట్‌ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. పోలవరం నుంచి 40 కిలోమీటర్లు లోపలకు వెళ్లి డ్యూటీ చేస్తున్నాను. ఏడు నెలలుగా జీతాలు లేక పోవ డంతో పిల్లా పాపలతో పస్తులతో బాధపడుతున్నాం. అధికారులు స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. 


రెండో రోజూ సమ్మెబాట

గోపాలపురం/బుట్టాయగూడెం, ఆగస్టు3: ప్రజల దాహార్తి తీర్చడం కోసం రేయింబవళ్లు పని చేస్తున్న కార్మికుల ఆకలి బాధలు అధికారులకు కానరాకపోవడం బాధకరమని శ్రీసత్యసాయి మంచినీటి పథక కార్మిక సంఘం జిల్లా సలహాదారుడు రమేష్‌ అన్నారు. గోపాలపురంలో రెండో రోజూ సమ్మె చేపట్టి దీక్షలో పాల్గొన్నారు.సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామన్నారు. సహాయ కార్యదర్శి సాయిల బాబురావు, సభ్యులు బొంతా ప్రసాద్‌, సూరిబాబు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ శ్రీ సత్యసాయి డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టు మెయింటినెన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి సమీపంలో ఉన్న సత్యసాయి వాటర్‌ ట్యాంకు వద్ద ఆందోళన చేశారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు, కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకువెళ్లినా స్పందన లేదన్నారు. బాలాజీ, ఎం.శ్రీనివాస్‌, పి.మహారాజు, పోసిబాబు, కె.సత్యన్నారాయణ పాల్గొన్నారు.





Updated Date - 2021-08-04T04:52:40+05:30 IST