తుంగభద్రకు జలకళ

ABN , First Publish Date - 2022-05-23T06:11:38+05:30 IST

తుంగభద్ర జలాశయానికి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది.

తుంగభద్రకు జలకళ
శ్రీశైలం డ్యామ్‌

28 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ 


హాలహర్వి, మే 22: తుంగభద్ర జలాశయానికి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాలైన మలేనాడు, హగుంబే, హరిహర, శివమొగ్గ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో రెండు రోజుల్లో 20 టీఎంసీల వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. దీంతో కర్నూలు జిల్లాలోని 1.5 లక్షల ఎకరాల్లో పత్తి, మిరప, వరి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,633 అడుగులు ఉండగా... ప్రస్తుతం 1605.56 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 100 టీఎంసీలు ఉండగా... ప్రస్తుత నీటి నిల్వ 28 టీఎంసీలకు చేరింది. ఇన్‌ఫ్లో 89,664 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 255 క్యూసెక్కులు ఉంది.


శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా ఇన్‌ఫ్లో


శ్రీశైలం, మే 22: ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఆదివారం స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సుంకేసుల జలాశయం నుంచి 8,622 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో ఆదివారం రాత్రి 9 గంటల సమయానికి 813.20 అడుగుల వద్ద 36.1914 టీఎంసీలుగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఎటువంటి విద్యుదుత్పత్తి జరగడం లేదు.

Updated Date - 2022-05-23T06:11:38+05:30 IST