Watch: విమానం గాల్లో ఉండగా ఫ్లైట్ అటెండెంట్‌పై ప్రయాణికుడి పిడిగుద్దులు.. జీవితాంతం వెంటాడేలా శిక్ష!

ABN , First Publish Date - 2022-09-24T02:24:04+05:30 IST

విమానం గాల్లో ఉండగా ఫ్లైట్ అటెండెంట్‌ (flight attendant)పై దాడి చేసిన ప్రయాణికుడికి జీవితంలో కోలుకోలేని

Watch: విమానం గాల్లో ఉండగా ఫ్లైట్ అటెండెంట్‌పై ప్రయాణికుడి పిడిగుద్దులు.. జీవితాంతం వెంటాడేలా శిక్ష!

కాలిఫోర్నియా: విమానం గాల్లో ఉండగా ఫ్లైట్ అటెండెంట్‌ (flight attendant)పై దాడి చేసిన ప్రయాణికుడికి జీవితంలో కోలుకోలేని శిక్ష పడింది. మెక్సికో (Mexico) నుంచి లాస్ ఏంజెలెస్(Los Angeles) వెళ్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం (American Airlines flight)లో ఈ ఘటన జరిగింది. విమానం లాస్ ఏంజెలెస్‌లో ల్యాండ్ కాగానే 33 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


ఫ్లైడ్ అటెండెంట్‌పై నిందితుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపిస్తుండగా తోటి ప్రయాణికుడు బారీ లివింగ్ స్టోన్ ఈ ఘటనను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియా (California)లోని వెస్ట్‌మాస్టర్ (Westminster)కు చెందిన నిందితుడు అలెగ్జాండర్ టంగ్ క్యూ లె కనుక దోషిగా తేలితే 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఫ్లైట్ అటెండెంట్ సీట్ల మధ్య నిలబడి ‘నువ్వు నన్ను బెదిరిస్తున్నావా?’ అని అడిగాడు. అనతరం వెనక్కి తిరిగి విమానం ముందు వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన నిందితుడు ఆయనపై దాడిచేసి వీపుమీద, ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడు. అనంతరం తన సీటు వద్దకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత విమానం ల్యాండ్ అయ్యే వరకు నిందితుడిని తోటి ప్రయాణికుడు అదుపులో ఉంచినట్టు అదే విమానంలో ప్రయాణిస్తున్న ప్రత్యక్ష సాక్షి అయిన అమెరికా మీడియా చానెల్‌కు చెందిన ఓ ప్రొడ్యూసర్ తెలిపారు. విమానం ల్యాండయ్యాక  లాస్ ఏంజెలెస్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అతడిని విమానం నుంచి కిందికి దింపినట్టు పేర్కొన్నారు. 


ఆ తర్వాత అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన చేస్తూ.. తమ ఫ్లైట్ అటెండెంట్‌పై భౌతిక దాడికి దిగిన నిందితుడు విమానం ఎక్కకుండా జీవితకాల నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది.అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో 24వేల మందికి పైగా ఫ్లైట్ అటెండెంట్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ ఫ్లైట్ అటెండెంట్స్’ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది. ఇది చాలా ప్రమాదకరమైనదని, ప్రాణాపాయకరమైనదని ఆందోళన వ్యక్తం చేసింది.



Updated Date - 2022-09-24T02:24:04+05:30 IST