ప్రజా ధనం వృథా

ABN , First Publish Date - 2022-08-10T03:43:50+05:30 IST

మంచిర్యాల మున్సిపాలిటీలో ఇటీవల కాలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడడం లేదు. కేవలం నిధులు ఖర్చు చేసి పనులు చేశామని చేతులు దులుపుకోవడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు. ముందు చూపు లేకుండా చేపడుతున్న పనులకు పాలక వర్గం ఆమోదం తెలపడం గమనార్హం. అవసరం లేని చోట అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజావసరాలను తుంగలో తొక్కుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి.

ప్రజా ధనం వృథా
వృధాగా వీధి వ్యాపారుల కోసం నిర్మించిన సముదాయం

నిధులు ఖర్చు చేయడమే లక్ష్యంగా నిర్మాణాలు

నిరుపయోగంగా అభివృద్ధి పనులు

అధికారుల వైఖరిపై ప్రజల విస్మయం  

మంచిర్యాల మున్సిపాలిటీలో వింత పోకడ  

మంచిర్యాల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మున్సిపాలిటీలో ఇటీవల కాలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడడం లేదు. కేవలం నిధులు ఖర్చు చేసి పనులు చేశామని చేతులు దులుపుకోవడమే తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు. ముందు చూపు లేకుండా చేపడుతున్న పనులకు పాలక వర్గం ఆమోదం తెలపడం గమనార్హం. అవసరం లేని చోట అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజావసరాలను తుంగలో తొక్కుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. మిగులు బడ్జెట్‌ ఉందనే ఉద్దేశంతో ముందు చూపు లేకుండా చేపడుతున్న పనుల కారణంగా పెద్ద మొత్తంలో ప్రజా ధనం వృఽథా అవడమే కాకుండా ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

రూ. 20 లక్షలు వృథా

మంచిర్యాల పట్టణ సుందరీకరణలో భాగంగా ఐబీ చౌరస్తాలో నిర్మిం చిన ‘మంచి మంచిర్యాల’ మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రజలకు ఆకర్షనీయంగా కనిపిస్తుందనే ఉద్దేశంతో 8 నెలల క్రితం నిర్మించిన స్వాగత తోరణాన్ని కూల్చివేస్తుండడంతో నిధులు వృథా కానున్నాయి. రూ. 20 లక్షల అంచనాతో  పట్టణ ప్రగతి నిధులు వెచ్చించి ఐబీ చౌర స్తాలో గత ఏడాది మంచి మంచిర్యాల నిర్మించారు. డిసెంబర్‌  24న ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించారు. దానిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ అతిథి గృహం ప్రహరీ గోడను తొలగిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం జరుగుతుండడంతో అధికారులు ప్రహరీ కూల్చివేత పనులను ప్రారంభించారు. దీంతో ‘మంచి మంచిర్యాల’ వెనుక ఉన్న ప్రహరీ తొలగించడంతో ఆ ప్రాంతమంతా కళావిహీనంగా తయా రైంది. 8 నెలల పాటు ప్రజలు, ప్రయాణికులను ఆకట్టుకున్న నిర్మాణం ప్రస్తుతం కూల్చివేత దశలో ఉంది. గతంలో ప్రజలు ప్రత్యేకంగా అక్కడికి వచ్చి సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ఆహ్లాదకర వాతావరణంలో గడిపేవారు. ప్రహరీ కూల్చివేత పనులు జరుగుతుండడంతో రూ.20 లక్షల నిధులు వృథా కావడమే కాక ప్రభుత్వ లక్ష్యం పూర్తిగా నీరుగారుతోంది. 

మందుబాబులకు అడ్డాగా వ్యాపార సముదాయం 

మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో వీధి వ్యాపారులకు శాశ్వతంగా  అడ్డా ఏర్పాటు చేసే ఉద్దేశంతో నిర్మించిన వీధి వ్యాపారుల సముదా యాలు వృథాగా మారాయి. మున్సిపాలిటీ పరిధిలో మూడు ప్రాంతాల్లో రూ.10 లక్షల చొప్పున వెచ్చించి వీధి వ్యాపారుల సముదాయాలను నిర్మించారు. పట్టణంలోని హైటెక్‌ సిటీ ముఖద్వారం వద్ద జాతీయ రహ దారి పక్కన వ్యాపార సముదాయాన్ని నిర్మించగా ఐబీ చౌరస్తాలోని ప్రభుత్వ అతిథి గృహ ప్రహరీని ఆనుకొని  మరో సముదాయం, పాత మంచిర్యాల వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఇంకో సముదాయాన్ని నిర్మించారు. ఒక్కొ చోట కనీసం 15 మంది వీధి వ్యాపారులు విక్రయాలు జరిపేందుకు వీలుగా శాశ్వతమైన సిమెంట్‌ గద్దెలతో నిర్మాణాలు చేపట్టారు. ఇనుప పైపులు, రేకులతో పైకప్పును ఏర్పాటు చేసి పనులు చేపట్టారు. రూ. 30 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణాలు పూర్తయి సంవత్సరాలు గడుస్తోం ది. ఐబీ చౌరస్తాలో నిర్మించిన సముదాయాన్ని రెండు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ సముదాయం లో ఒక్క వీధి వ్యాపారి కూడా సరుకుల విక్రయం జరపకపోగా అవి మందుబాబుల అడ్డాగా మారిపోయింది. వ్యాపార సముదాయానికి సమీపంలో మూడు వైన్‌ షాపులు ఉండడంతో మందుబాబులకు చక్కని అడ్డా లభించినట్లయింది. వ్యాపార సముదాయాలు ఖాళీగా ఉండడంతో రాత్రి పగలు అందులో కూర్చొని మద్యం సేవిస్తున్నారు. అలాగే పాత మంచిర్యాలలో నిర్మించిన వ్యాపార సముదాయం పూర్తయి దాదాపు సంవత్సరం గడుస్తున్నా ఇంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజలకు సౌకర్యంగా లేని ప్రాంతం కావడంతో వృథాగా మిగిలిపోయింది. 

కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే....?

మంచిర్యాల మున్సిపాలిటీలో అభివృద్ధి పేరిట చేపడుతున్న పలు పనులు కేవలం కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ప్రణాళికలు లేకండా చేపడుతున్న పనుల వల్ల నిధులు ఖర్చు చేశామనిపించడమే తప్ప, వాటి  వల్ల ఎంత మాత్రం ఉపయోగం లేదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పనికి రాని పనుల కోసం లక్షల రూపాయలు ప్రజా ధనం వెచ్చించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అనాలోచిత  పనుల కారణంగా కాంట్రా క్టర్లకు  జేబులు నిండడంతో పాటు పాలకులు, అధికారులకు కమీషన్‌ల రూపేనా పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరుతుందనే ప్రచారం బాహాటంగా జరుగుతోంది.  మిగులు బడ్జెట్‌ ఉన్నందున మున్సిపాలిటీలో పరిస్థితి ఆడిందే ఆటగా  తయారైందనే అభిప్రాయాలున్నాయి. ఇక మీదటనైనా పాలకవర్గం, అధికారులు ఒకటికి  రెండు సార్లు ఆలోచించి పనులు చేపట్టాలని ప్రజలు హితవు పలుకుతున్నారు.  

Updated Date - 2022-08-10T03:43:50+05:30 IST