ఆదివాసీ దినోత్సవం పేరుతో ప్రజాధనం వృథా

ABN , First Publish Date - 2022-08-07T06:28:50+05:30 IST

ఆదివాసీ దినోత్సవం పేరుతో ప్రజా ధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తున్నదని ఏబీవీపీ జిల్లా నేత అల్లంగి మహేష్‌బాబు అన్నారు.

ఆదివాసీ దినోత్సవం పేరుతో ప్రజాధనం వృథా
సమావేశంలో మాట్లాడుతున్న ఏబీవీపీ నాయకులు

గిరిజనుల సమస్యలు పట్టించుకోకుండా సంబరాలా

ఏబీవీపీ జిల్లా నేత మహేశ్‌బాబు

పాడేరు రూరల్‌, ఆగస్టు 6: ఆదివాసీ దినోత్సవం పేరుతో ప్రజా ధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తున్నదని ఏబీవీపీ జిల్లా నేత అల్లంగి మహేష్‌బాబు అన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, అనేక సమస్యలతో గిరిజనులు సతమతమవుతున్నారని, వీటిని పట్టించుకోకుండా జిల్లా కేంద్రంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించే కార్యక్రమానికి కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించిడం సరికాదని పేర్కొన్నారు. ఆదివాసీ ప్రజలు, యువత, విద్యార్థులు కోరుకునేది నామమాత్రంగా ఒక రోజు నిర్వహించే పండగ కాదన్నారు. గిరిజన ప్రాంతంలో నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. కొన్ని గిరిజన గ్రామాల్లో పాఠశాల భవనాలు లేక రేకుల షెడ్లలో చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. అలాగే ముంచంగిపుట్టు మండలంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మహిళా విద్యార్థినులు వసతి గృహ సదుపాయంలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు. అలాగే గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే బెస్టు అవైల్‌బుల్‌ స్కూల్స్‌ రద్దు చేయడం వల్ల వేలాది మంది చదువులు ప్రశ్నార్థకంగా మారాయన్నారు. ఒక్క రోజు నిర్వహించే కార్యక్రమానికి వెచ్చించే కోట్లాది రూపాయలను, గిరిజన గ్రామాల్లో సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తే గిరిజనులు మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమలో ఏబీవీపీ నాయకులు జి.కల్యాణ్‌, బి.కామరాజు, పి.ఉపేంద్ర, కె.మల్లేశ్‌ బుజ్జిబాబు, ఎస్‌.సత్తిబాబు, వంశీ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T06:28:50+05:30 IST