నీరవ్ మోదీ తోడల్లుడిపై వారంట్ల రద్దు

ABN , First Publish Date - 2021-09-07T21:56:16+05:30 IST

విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తోడల్లుడు

నీరవ్ మోదీ తోడల్లుడిపై వారంట్ల రద్దు

న్యూఢిల్లీ : విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తోడల్లుడు మయాంక్ మెహతాపై జారీ అయిన అన్ని నాన్ బెయిలబుల్ వారంట్లను కోర్టు రద్దు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆయనపై ఈ వారంట్లు జారీ అయ్యాయి. ఈ కేసులో ఆయన ప్రాసిక్యూషన్ సాక్షిగా మారేందుకు అంగీకరించడంతో ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కోర్టు మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. రూ.50,000 పూచీకత్తు సమర్పించాలని, విదేశాలకు వెళ్ళే ముందు కోర్టు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. 


నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన సంగతి తెలిసిందే. మయాంక్ మెహతా బ్రిటిష్ జాతీయుడు. ఆయన హాంగ్ కాంగ్ నుంచి భారత దేశానికి వచ్చి, కోర్టులో హాజరయ్యారు. నీరవ్ మోదీ సోదరి పూర్వీ. ఆమె భర్త మయాంక్. నీరవ్ మోదీ తదితరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని మయాంక్, పూర్వీ జనవరిలో కోర్టును కోరారు. నీరవ్ మోదీ తదితర నిందితులపై వాస్తవాలు రుజువయ్యేందుకు ముఖ్యమైన వివరాలను తాము వెల్లడిస్తామని తెలిపారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. అంతర్జాతీయ ప్రయాణాలపై కోవిడ్ సంబంధిత ఆంక్షలను సడలించిన తర్వాత తాను భారత దేశానికి వచ్చి, కోర్టుకు హాజరవుతానని తెలిపారు. తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారంట్లను రద్దు చేయాలని కోరారు. 


తాను మంగళవారం కోర్టుకు హాజరవుతానని, పెండింగ్ వారంట్ల నేపథ్యంలో తనను అరెస్టు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోర్టును మెహతా గత వారం కోరారు. కోర్టు ఇందుకు అంగీకరించి, దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. ఆయన కోర్టుకు హాజరయ్యే వరకు ఆయనను అరెస్టు చేయరాదని తెలిపింది.


పూర్వీ బెల్జియన్ జాతీయురాలు. ఆమె కూడా తనపై జారీ అయిన వారంట్లను రద్దు చేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టు నిలిపేసింది. ఆమె తన సమక్షంలో హాజరైన తర్వాత కోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది.


పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదుపై నీరవ్ మోదీ తదితరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సీబీఐ కేసుల్లో మయాంక్, పూర్వీల పేర్లు లేవు. కానీ ఈడీ కేసులో వీరి పేర్లు ఉన్నాయి. 


Updated Date - 2021-09-07T21:56:16+05:30 IST