టీకా.. నిరాశే!

ABN , First Publish Date - 2021-04-21T06:32:50+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో కొవిడ్‌ టీకాకు జనం బారులు తీరుతున్నారు.

టీకా.. నిరాశే!
ఆకివీడులో టీకాకు వచ్చి కూర్చున్న జనం

ఐదు రోజులైనా అందని వ్యాక్సిన్‌

పీహెచ్‌సీలలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే టీకా

మండిపడుతున్న ప్రజానీకం

ఆసుపత్రుల వద్ద జనం క్యూ


ఆకివీడు/ఆచంట/పాలకొల్లు రూరల్‌/యలమంచిలి, ఏప్రిల్‌ 20: కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో కొవిడ్‌ టీకాకు జనం బారులు తీరుతున్నారు. గత నాలుగైదు రోజులుగా వ్యాక్సిన్‌ కొరతతో టీకాలు వేయలేదు. మంగళవారం చేస్తారని చెప్పడంతో ప్రభుత్వాసుపత్రులకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఉద్యోగులకే వ్యాక్సిన్‌ చేయమని ఉన్నతాధికారులు చెప్పారని తెలిజే యడంతో అధికారులు, వైద్య సిబ్బందిపై మండిపడ్డారు. ఒక పక్క కరోనా విజృంభిస్తుండగా మరో పక్క టీకా కొరత ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. అరకొరగా వ్యాక్సిన్‌ సరఫరా వల్ల మొదటి డోసు టీకాలకు నిరీక్షించే వారితో పాటు, రెండో డోసుకు గడువు దాటి పడిగాపులు పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఫ్రంట్‌లైన్‌ వారియర్లతో పాటు జనానికి సకాలంలో టీకాలు ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన వైద్య సిబ్బంది బుధవారం రమ్మని చెప్పారు. ఆచంట వేమవరం పీహెచ్‌సీకి మంగళవారం వ్యాక్సిన్‌ వచ్చిందని సమాచారం రావడంతో వందల కొద్ది జనం తరలివచ్చారు. దీంతో ఆసుపత్రి  మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా జనంతో కిక్కిరిసిపోయింది. పెదమల్లం సర్పంచ్‌ దిరిశాల వెంకట వరప్రసాద్‌ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలో ఇంటింటికి మాస్కులు పంపిణీ చేశారు. పాలకొల్లు మండలంలోని లంకలకోడేరు గ్రామ సచివాలయంలో మంగళవారం 32 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు లంకలకోడేరు పిహెచ్‌సీ డాక్టర్‌ అడ్డాల ప్రతాప్‌ కుమార్‌ తెలిపారు. పీహెచ్‌సీలో వైద్య సిబ్బంది 110 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. వీరిలో 52 మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌, 58 మంది పౌరులకు వ్యాక్సిన్‌ వేసినట్లు ప్రతాప్‌కుమార్‌ తెలిపారు. యలమంచిలి పీహెచ్‌సీలో 100 మందికి, మేడపాడు పీహెచ్‌సీలో 90 మందికి, దొడ్డిపట్ల పీహెచ్‌సీలో 60 మందికి మంగళవారం కరోనా వ్యాక్సిన్‌ వేసినట్టు వైధ్యాధికారులు తెలిపారు.  


కాళ్ళ  : మండలంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కష్టాలు తొలగలేదు. కాళ్ళ పీహెచ్‌సీకి జనం మంగళవారం అధిక మొత్తంలో విచ్చేశారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు టీకా వేస్తామనడంతో ఉద్యోగస్తులు ఎక్కువమంది వచ్చారు. తీరా ఆసు పత్రిలో వ్యాక్సిన్‌ కొద్ది మొత్తంలోనే అందుబాటులో ఉండటంతో 40 మందికి మాత్రమే వ్యాక్సిన్‌ అందించారు. దీంతో కొంతమంది ఉద్యోగస్తులు తమ నెందుకు పిలిచారంటూ వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.మండలంలో 59 మందికి కొవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. 

Updated Date - 2021-04-21T06:32:50+05:30 IST