రోజుల తరబడి ఎదురుచూపులు

ABN , First Publish Date - 2021-04-17T04:57:46+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ పరీక్షల ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పరీక్ష చేయించుకున్న మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఫలితాలు రాకపోవడంతో వైరస్‌ అనుమానితుల్లో ఆందోళన పెరిగిపోతోంది.

రోజుల తరబడి ఎదురుచూపులు

కొవిడ్‌ పరీక్షల ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం

నాలుగైదు రోజులకూ కూడా రాని వైనం

వేగంగా ఫలితాలు అందించేందుకంటూ...పరీక్షల సంఖ్యను కూడా తగ్గించిన అధికారులు

అయినప్పటికీ ఆలస్యం

ఈలోగా వైరస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 


జిల్లాలో కొవిడ్‌ పరీక్షల ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పరీక్ష చేయించుకున్న మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఫలితాలు రాకపోవడంతో వైరస్‌ అనుమానితుల్లో ఆందోళన పెరిగిపోతోంది. నమూనాల సేకరణకు, ఫలితాల వెల్లడికి మధ్య ఎక్కువ సమయం ఉండకూడదన్న ఉద్దేశంతోనే రోజువారీ పరీక్షల సంఖ్యను కూడా అధికారులు భారీగా తగ్గించారు. గతంలో రోజుకు ఆరు వేల నుంచి ఎనిమి ది వేల నమూనాలు సేకరించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్యను మూడు వేల నుంచి నాలుగు వేలకు కుదించారు. పరీక్షించే నమూనాల సంఖ్య సగానికిపైగా తగ్గినప్పటికీ..ఫలితాలు వెల్లడికి మాత్రం కనీసం మూడు నుంచి నాలుగు రోజులు తీసుకుంటున్నారు. ఫలితాలు ఆలస్యంగా వెల్లడి కావడం వల్ల వైరస్‌ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు. రెండో దశలో వైరస్‌ బారినపడిన చాలామందికి  లక్షణాలు కనిపించడం లేదు. అటువంటి వారంతా కాంటాక్ట్‌ హిస్టరీ దృష్ట్యా కొవిడ్‌ పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నారు. అయితే, ఫలితాల వెల్లడికి సమయం పడుతుండడంతో వారంతా ఇళ్లలోనే కూర్చునేందుకు ఇష్టపడడం లేదు. కొవిడ్‌ లక్షణాలు లేవు కాబట్టి..నెగెటివ్‌ వస్తుందనే నమ్మకంతో బయటకు వెళ్లిపోతున్నారు. ఈ విధంగా బయటకు వెళుతున్న ఎంతోమందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడం వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోంది. 


ఎందుకీ ఆలస్యం..


అధికారులు 24 గంటల్లో ఫలితాలు అందిస్తామని చెబుతున్నప్పటికీ  అది వాస్తవరూపం దాల్చడం లేదు. కనీసం రెండు నుంచి మూడు రోజులు, అంతకంటే ఎక్కువ సమయం కూడా పడుతోందని పలువురు చెబుతున్నారు. మధురవాడ ప్రాంతానికి రామారావు అనే వ్యక్తి సోమవారం కొవిడ్‌ పరీక్ష కోసం నమూనా ఇవ్వగా...శుక్రవారం నాటికి కూడా ఫలితం రాలేదు. అలాగే, అక్కయ్యపాలెం ప్రాంతానికి వెంకటకృష్ణ అనే వ్యక్తి తమ అపార్ట్‌మెంట్‌లో ఒకరు కొవిడ్‌ బారినపడి మృతిచెందడంతో...ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ నాలుగు రోజుల కిందట పరీక్ష చేయించుకున్నారు. ఫలితం ఇంకా రాకపోవడంతో సెలవుపెట్టి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, పాజిటివ్‌ నిర్ధారణ కాకముందే రోజుల తరబడి ఇంట్లో వుండడంతో అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రామారావు, వెంకటకృష్ణలే కాదు...ఎంతోమంది ఇటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలు వేగంగా వచ్చేలా చూడాలని కోరుతున్నారు. అయితే కొవిడ్‌ ఫలితాలు ఆలస్యం కాకుండా సకాలంలో విడుదల చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 24-48 గంటల్లోనే ఫలితాలు అందిస్తున్నామని, సాంకేతిక ఇబ్బందులతో ఒకటి, రెండు ఆలస్యమవుతున్నాయే తప్ప అన్నీ అలా కావడం లేదని ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌ అంటున్నారు. గతంలో ఎక్కువ మందికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించేవాళ్లమని, ప్రస్తుతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలే చేస్తున్నందున ల్యాబ్‌పై ఒత్తిడి వుంటుందని ఆయన పేర్కొన్నారు. అలా, అని పరీక్ష ఫలితాలేమీ ఆలస్యం చేయడం లేదని, సకాలంలోనే ఇస్తున్నామని వెల్లడించారు.


Updated Date - 2021-04-17T04:57:46+05:30 IST