‘డ్రిప్‌’ కోసం ఎదురుచూపు

ABN , First Publish Date - 2021-01-12T05:21:49+05:30 IST

మండలంలోని పలువురు డ్రిప్‌ పరికరాల కోసం డబ్బులు చెల్లించినా 8 నెలలుగా వారికి అవి అందలేదు.

‘డ్రిప్‌’ కోసం ఎదురుచూపు
లింగాలలో పంట సాగు కోసం రైతులు ఏర్పాటు చేసుకుంటున్న డ్రిప్‌ పరికరాలు (ఫైల్‌)

పంటల సాగుకు తప్పని ఇబ్బందులు

పలు రకాల కంపెనీలకు డీడీలు చెల్లించిన రైతులు


లింగాల, జనవరి 11: మండలంలోని పలువురు డ్రిప్‌ పరికరాల కోసం డబ్బులు చెల్లించినా 8 నెలలుగా వారికి అవి అందలేదు. ప్రభుత్వం సబ్సిడీతో అందించాల్సి ఉన్నా ఒక్క పరికరం సరఫరా చేయలేదు. దీంతో రైతుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మండలంలోని వందల మంది డ్రిప్‌ పైపులు, లాటర్‌ పైపుల కోసం వేలాది రూపాయలు డీడీల రూపంలో డ్రిప్‌ కంపెనీలకు చెల్లించారు. అయితే 10 సంవత్సరాల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతులు వాపోతున్నారు. పరికరాలు అందకపోవడంతో పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సర కాలం నుంచి ఆయా గ్రామాల్లో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన డీకేటీ భూముల్లో సాగు పెరిగింది. కొండలు, గుట్టలలో భారీ యంత్రాలతో చదును చేస్తున్నారు. చదును చేసిన పొలం సాగుకు డ్రిప్‌ పరికరాలు కోసం డబ్బులు కూడా చెల్లించి నెలలు గడుస్తున్నా పరికరాలు అందడం లేదని రైతులు వాపోతున్నారు. పరికరాలు మార్కెట్‌లో కొందామంటే వాటి ధరలు చూసి భయపడుతున్నారు.


డ్రిప్‌ పరికరాలు రాక తీవ్ర ఇబ్బందులు

ప్రభుత్వం నుంచి సబ్సిడీతో అందిస్తున్న డ్రిప్‌ పరికరాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. డీడీలు కట్టి 8 నెలలు అవుతున్నా ఇంతవరకు మాకు పరికరాలు ఇవ్వలేదు. డ్రిప్‌ పరికరాలు లేనిది ఇపుడు ఎలాంటి పంటలు సాగు చేసే స్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు డ్రిప్‌ పరికరాలు అందించాలని కోరుతున్నాం. 

- భాస్కర్‌రెడ్డి, రైతు, లింగాల


సంక్రాంతి తర్వాత డ్రిప్‌ పరికరాలు

సంక్రాంతి పండుగ తర్వాత డ్రిప్‌ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సరఫరా జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది రైతులు పరికరాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఆయా కంపెనీలకు బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. త్వరలోనే బకాయిలు చెల్లించి రైతులకు డ్రిప్‌ పరికరాలు అందజేస్తాం. 

- మధుసూదన్‌రెడ్డి, పీడీ, ఏపీఎంఐపీ 

Updated Date - 2021-01-12T05:21:49+05:30 IST