బొబ్బిలి భూకుంభకోణంపై క్రిమినల్‌ కేసు నమోదు

ABN , First Publish Date - 2020-10-31T08:43:46+05:30 IST

బొబ్బిలి పట్టణంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూమికి సంబంధించి క్రిమినల్‌ కేసు నమోదైంది. స్థానిక పోలీసు ఎస్‌హెచ్‌వో ఇ.కేశవరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.

బొబ్బిలి భూకుంభకోణంపై క్రిమినల్‌ కేసు నమోదు

బొబ్బిలి, అక్టోబరు 30: బొబ్బిలి పట్టణంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూమికి సంబంధించి క్రిమినల్‌ కేసు నమోదైంది. స్థానిక పోలీసు ఎస్‌హెచ్‌వో ఇ.కేశవరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి రాజవంశీ యుల ప్రతినిధి జూలపల్లి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఐరిస్‌ సంస్థ ప్రతినిధి వి.విజయ్‌కుమార్‌పై చీటింగ్‌, భూ ఆక్రమణ, నకిలీ పత్రాలు తదితర అభియోగాలపై గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్టు చెప్పారు. పట్టణ పరిధిలోని మల్లమ్మపేట రెవెన్యూ సర్వే నెంబరు 76, 77లో సుమారు మూడెకరాల భూమిని బొబ్బిలి రాజా ఆర్‌ఎస్‌ఆర్‌కే రంగారావు 1882లో కెనడాకు చెందిన మత సంస్థకు సామాజిక కార్యకలాపాల నిర్వహణ కోసం సంవత్సరానికి రూ.29.48కి లీజు ప్రాతిపదికన అప్పగించారు. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి లీజును పొడిగించుకునే ఒప్పందం కుదుర్చుకున్నారు.


మతసంస్థ ప్రతినిధిగా వీవీకే శర్మ వ్యవహరించేవారు. ఆయన తదనంతరం కుమారుడు విజయ్‌కుమార్‌ సంస్థ కార్యకలాపాలను చూస్తున్నారు. 40ఏళ్ల తరువాత లీజు పొడిగింపులో భాగంగా 1.12 ఎకరాల భూమి బొబ్బిలి రాజుల పేర ఉండగా, మిగిలిన 1.84 ఎకరాల భూమి సీబీఎన్‌సీ అనే సంస్థకు లీజులోనే కొనసాగుతుండేది. ఈ భూమిపై తరువాత కోర్టులో వివాదాలు నడిచాయి. ఈ భూమి వ్యవహారంలో జరిగిన అక్రమాలపై కేసు నమోదు కావటంతో ఈ ప్రాంతంలో ఇదే చర్చ సాగుతోంది. 

Updated Date - 2020-10-31T08:43:46+05:30 IST