జల వనరులపై రాబందులు

ABN , First Publish Date - 2020-06-03T11:05:23+05:30 IST

అందరి దృష్టి కరోనా వైరస్‌ వైపు ఉన్న ప్రస్తుత తరుణంలో నెల్లూరు రూరల్‌ మండలంలోని పలు గ్రామాల్లో భూ ఆక్రమణలు ..

జల వనరులపై  రాబందులు

కొమ్మరపూడి, కందమూరులో చెరువుల చెర

వెల్లంటి, కోడూరుపాడులో పెన్నా కబ్జా 

తెలిసినా తెలియనట్లున్న యంత్రాంగం 


నెల్లూరు (రూరల్‌), జూన్‌ 2 : అందరి దృష్టి కరోనా వైరస్‌ వైపు ఉన్న ప్రస్తుత తరుణంలో నెల్లూరు రూరల్‌ మండలంలోని పలు గ్రామాల్లో భూ ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో చెరువులను చెరపట్టగా, మరికొన్ని పల్లెల్లో ఏకంగా పెన్నా పరీవాహక ప్రాంతాన్నే కబ్జా చేసేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 


మండలంలోని కొమ్మరపూడి గ్రామంలో 80 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఎర్ర చెరువును ఆ గ్రామస్థులు పూర్తిగా కబ్జా చేశారు. వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే నీరు చేరే ఈ చెరువును ఇటీవల కొందరు ట్రాక్టర్లతో దున్ని ఆక్రమించుకున్నారు. దీనిపై అధికారులకు సమాచారం వెళ్లినా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. ఇదేవిధంగా కందమూరు గ్రామంలోనూ చెరువు దురాక్రమణకు గురైంది. 20 ఎకరాలకుపైగా లోతట్టు ప్రాంతాన్ని ఆక్రమించేసి సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని వల్ల ఆయకట్టు రైతాంగానికి సాగు నీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఇక కొత్తవెల్లంటి గ్రామంలో పెన్నా పరీవాహక ప్రాంతాన్ని అదే గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించారు. ఉద్యాన పంటల సాగుకు అనుకూలంగా ఉందంటూ 60 ఎకరాలకుపైగా పెన్నా నదిని ఆక్రమించేసి సాగుకు సిద్ధం చేస్తున్నారు.


కోడూరుపాడులో అయితే గతంలోనే కొందరు పెన్నా నదిని కబ్జా చేయగా ఇటీవల స్థానికులు కొందరు మరింత భూమిని ఆక్రమించేశారు. దీంతో ఆ ప్రాంతంలో 600 ఎకరాల వరకు పెన్నా ఆక్రమణకు గురైనట్లు సమాచారం. అంతేకాదు ఇక్కడ కరకట్టలను తవ్వేసి ఇసుక అమ్మేసుకుంటుండటంతో భవిష్యత్తులో వరద ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. ఈ విధంగా గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, నీటి వనరులు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంటున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది పరోక్షంగా ఆక్రమణదారులను ప్రోత్సహించడ మేనన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-06-03T11:05:23+05:30 IST