బొమ్మ పడేనా?

ABN , First Publish Date - 2020-10-02T10:09:41+05:30 IST

అన్‌లాక్‌-5లో సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈనెల 15 నుంచి 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తూ సినిమాలు ప్రదర్శించుకోవచ్చునని మార్గదర్శకాలు జారీచేసింది.

బొమ్మ పడేనా?


అన్‌లాక్‌-5లో థియేటర్లకు అనుమతి

ఈనెల 15 నుంచి తెరుచుకోవచ్చునంటూ మార్గదర్శకాలు జారీ

అయినా తెరిచే పరిస్థితి లేదంటున్న యజమానులు

పాత సినిమాలు ప్రదర్శిస్తే ప్రేక్షకుల ఆదరణ ఉండదనే అభిప్రాయం

థియేటర్‌ తెరిస్తే నెలకు కనీసం రూ.ఐదారు లక్షల నిర్వహణ ఖర్చు

మల్టీఫ్లెక్స్‌ల్లో మాత్రం సినిమాలు ప్రదర్శించే అవకాశం


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం):

అన్‌లాక్‌-5లో సినిమా థియేటర్లను తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈనెల 15 నుంచి 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తూ సినిమాలు ప్రదర్శించుకోవచ్చునని మార్గదర్శకాలు జారీచేసింది. అయితే పెద్ద సినిమాలు ఏవీ విడుదలకు సిద్ధంగా లేనందున ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోకపోవచ్చునని థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు) అంటున్నారు. మల్టీఫ్లెక్స్‌లు మాత్రం తెరిచే అవకాశం కనిపిస్తోంది. 


లాక్‌డౌన్‌ కారణంగా సుమారు ఏడు నెలల కిందట మూతపడిన సినిమా థియేటర్లు ఈనెల 15 నుంచి తెరుచుకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌-5 మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో థియేటర్లు తెరిచినా పాత సినిమాలనే ప్రదర్శించాల్సి వుంటుందని యజమానులు అంటున్నారు. వాటికి ప్రేక్షకుల నుంచి ఆదరణ వుండదనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.


ఇంగ్లీష్‌ సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నప్పటికీ వాటిని సింగిల్‌, డబుల్‌ స్ర్కీన్‌ థియేటర్లలో ప్రతిరోజూ ప్రదర్శించడం సాధ్యంకాదంటున్నారు. పోనీ వారానికి ఒకరోజు సినిమాలు ప్రదర్శిద్దామనుకున్నా, ఒకసారి థియేటర్‌ను తెరిస్తే నెలకు రూ.లక్షల్లో కరెంటు బిల్లులు కట్టాల్సి ఉంటుందంటున్నారు. అంతేకాకుండా షోకి ముందు, తర్వాత సీట్లను శానిటైజ్‌ చేయడం, ప్రేక్షకులకు శానిటైజర్‌ అందించడం, ప్రేక్షకులు సామాజిక దూరం పాటించేలా చూడడం వంటివి తమకు మరింత భారమని చెబుతున్నారు. 


నగరంతోపాటు రూరల్‌ జిల్లా పరిధిలో సుమారు వంద వరకూ సినిమా థియేటర్లు ఉన్నాయి. నెలకు విద్యుత్‌ బిల్లు కింద రూ.మూడు లక్షలు, సిబ్బంది వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు మరో రూ.మూడు లక్షల వరకూ వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో కొత్తసినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేకపోవడం, పాత సినిమాలను ప్రదర్శిస్తే ప్రేక్షకుల ఆదరణ వుండదనే భయంతో థియేటర్లును తెరిచేందుకు ఎగ్జిబిటర్లు విముఖత వ్యక్తంచేస్తున్నారు.


అయితే మల్టీఫ్లెక్స్‌లు మాత్రం సగం మంది ప్రేక్షకులతో అయినా సినిమాల ప్రదర్శనకు ముందుకు వచ్చే అవకాశం వుందని పేర్కొంటున్నారు. ఆయా థియేటర్లకు వెళ్లేవారిలో ఉన్నత వర్గాలకు చెందినవారే ఎక్కువ ఉంటారు కాబట్టి, ఇంగ్లీష్‌ సినిమాలు వేసినా ఆకట్టుకునేందుకు అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఆరు మల్టీఫ్లెక్స్‌లు వున్నందున ఒక్కోదాంట్లో ఒక్కో స్ర్కీన్‌ను ప్రదర్శనకు సిద్ధం చేయవచ్చునని పేర్కొంటున్నారు.  


మల్టీఫ్లెక్స్‌లు మాత్రమే తెరుచుకునే వీలుంది..ఎన్‌.రామకృష్ణారెడ్డి, క్రాంతి పిక్చర్స్‌, ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌

అన్‌లాక్‌-5లో థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ కేవలం మల్టీఫ్లెక్స్‌లు మాత్ర మే తెరుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా లేకపోవడమే దీనికి కారణం. పాత సినిమాలు వేస్తే ప్రేక్షకులు ఆదరించరు. ఈ పరిణామం సింగిల్‌, డబుల్‌ స్ర్కీన్‌ థియేటర్లకు అనుకూలం కాదు. థియేటర్‌ను ఒకరోజు తెరవాలనుకున్నా నెలకు కనీసం ఆరు లక్షల రూపాయల వరకూ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కాబట్టి, ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరుచుకోవడం అసాధ్యం.

Updated Date - 2020-10-02T10:09:41+05:30 IST