ఉపాధ్యాయుల ఉపాధి కష్టాలు

ABN , First Publish Date - 2020-10-01T08:30:46+05:30 IST

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే బోధనా సిబ్బంది బతుకులను కరోనా ఛిన్నాభిన్నం చేసింది. ఉన్నత చదువులు అభ్యసించినా సర్కారు కొలువుల కోసం ఎదురుచూడకుండా ప్రైవేటు సంస్థల్లో పని చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న వారిని రోడ్డున పడేసింది.

ఉపాధ్యాయుల ఉపాధి కష్టాలు

కరోనాతో ఐదారు నెలలుగా ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జీతాలు నిల్‌

భార్యతో కలిసి రెండు నెలలు ఉపాధి కూలి పనులకు వెళ్లిన ఓ టీచర్‌

ఎంఏ బీఈడీ చదివి కుటుంబ పోషణ కోసం నానా తిప్పలు


నర్సీపట్నం టౌన్‌, సెప్టెంబరు 30: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే బోధనా సిబ్బంది బతుకులను కరోనా ఛిన్నాభిన్నం చేసింది. ఉన్నత చదువులు అభ్యసించినా సర్కారు కొలువుల కోసం ఎదురుచూడకుండా ప్రైవేటు సంస్థల్లో పని చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న వారిని రోడ్డున పడేసింది. కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు మూతపడడంతో ఐదారు నెలలుగా యాజమాన్యాలు వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో ఉపాధ్యాయులు కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకుంటున్నారు. ఈ క్రమంలో కూలిపనికి వెళ్లడానికి కూడా వెనుకాడడం లేదు.


గొలుగొండ మండలం పాలకపాడు గ్రామానికి చెందిన కిల్లాడ లోకేశ్‌ ఎంఏ బీఈడీ చదివారు. ఆయనకు భార్య, నాలుగేళ్ల బాబు ఉన్నారు. నర్సీపట్నంలోని ఒక ప్రైవేటు కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేసేవారు. మార్చి నెలలో ప్రైవేటు కళాశాలలో మానేసి పెదబొడ్డేపల్లిలో గల సెంట్‌ ఆన్స్‌ స్కూల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీగా చేరారు. మార్చి, ఏప్రిల్‌ నెలలు పని చేస్తే ఆ తర్వాత ఏదో కళాశాలలో పని చేసుకోవచ్చుననుకున్నారు.


ఇంతలో కరోనా కారణంగా మార్చి 25 నుంచి పాఠశాల మూతపడింది. దీంతో బతుకు తెరువు కష్టమైంది. ఏప్రిల్‌ నెలలో భార్యతో పాటు ఉపాధి కూలి పనులకు వెళ్లారు. వంద పని దినాలు అయిపోవడంతో మళ్లీ బతుకుతెరువు ప్రశ్నార్థకంగా మారింది. ఆగస్టు నెలలో నర్సీపట్నంలో గల బంగార్రాజు థియేటర్‌ సమీపంలోని ఒక హోటల్లో పనికి చేరారు. ఇక్కడ కర్రీ పాయింట్‌లో (రోజుకు రూ.300) పార్శిల్స్‌ కడుతున్నారు. విద్యాసంస్థలు తెరుచుకుంటే ఏదోక కళాశాలలో చేరవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. తాను ఏ పని చేసినా కుటుంబాన్ని పోషించుకోవడం కోసమేనని, ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదన్నారు.


ఉపాధ్యాయ దంపతులు కూరగాయల విక్రయం

ఎలమంచిలి అయోధ్యపురి కాలనీ సమీపంలో నివాసం వుంటున్న దంపతులు డి.నూకరాజు (ఎం,ఏ. బీఈడీ), విజయశ్రీ (బీఎస్‌సీ కంప్యూటర్స్‌) చదువుకున్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో మూడేళ్ల నుంచి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. అయితే కరోనాతో ఐదు నెలలుగా యాజమాన్యం వేతనాలు నిలిపివేసింది.


దీంతో కుటుంబ పోషణ కోసం కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకున్నారు. ఇంటి వద్ద దుకాణంలో తన భార్య, వీధుల్లో తిరుగుతూ తాను కూరగాయలు విక్రయిస్తున్నట్టు నూకరాజు తెలిపారు. జీవనం కోసం ఏదో ఒక పనిచేసుకోక తప్పదని భావించి కూరగాయలు విక్రయిస్తున్నామని, ప్రభుత్వం, విద్యాసంస్థల యాజమాన్యాలు తమలాంటి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


బోర్‌ మెకానిక్‌గా మారిన పీఈటీ

గొలుగొండ మండలం కృష్టాదేవిపేటకు చెందిన డి.అప్పారావు 2002 నుంచి చింతపల్లిలోని ఓ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ట్రైనర్‌ (పీఈటీ)గా పనిచేస్తున్నారు. కరోనా కారణంగా పాఠశాలలు మూతబడడం, వేతనాలు చెల్లించలేమని యాజమాన్యం చేతులెత్తేయడంతో పీఈటీ అప్పారావు స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్‌, మండల పరిషత్‌ పరిధిలో మరమ్మతులకు గురైన బోర్‌లు బాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు.


ఒక్కొక్క బోర్‌ బాగు చేస్తే రూ.ఐదు వందలు చెల్లిస్తున్నారని, ఈ కష్టకాలం ముగిసేంత వరకు బోర్‌ మెకానిక్‌గా పనిచేస్తానని ఆయన తెలిపారు. ప్రభుత్వం తమలాంటి ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-10-01T08:30:46+05:30 IST