డీఎంకే కంచుకోట‌ ఉదయనిధికి క‌లిసొచ్చేనా?

ABN , First Publish Date - 2021-05-02T15:32:10+05:30 IST

త‌మిళ‌నాట రాజకీయాల్లో అడుగుపెట్టిన‌ మరో వారసుడు...

డీఎంకే కంచుకోట‌ ఉదయనిధికి క‌లిసొచ్చేనా?

చెన్నై: త‌మిళ‌నాట రాజకీయాల్లో అడుగుపెట్టిన‌ మరో వారసుడు ఉద‌య‌నిధి ఈరోజు వెలువ‌డే అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి తొలిసారిగా ఎన్నికల బ‌రిలోకి దిగారు. ఒకప్పుడు తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇక స్టాలిన్‌ ఎప్పటిలాగే కొలతూరు స్థానం నుంచి బరిలోకి దిగారు. ఉదయనిధి.. మూడేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన డీఎంకే యూత్‌ వింగ్‌ సెక్రటరీగా ఉన్నారు. ఆయ‌న పోటీ చేస్తున్న‌ చెపాక్‌-ట్రిప్లికకేన్‌ నియోజకవర్గం డీఎంకేకు కంచుకోటగా ఉంది. గతంలో కరుణానిధి ఈ స్థానం నుంచి మూడు సార్లు పోటీ చేసి విజయం సాధించారు. 1996, 2001, 2006లో వరుసగా మూడుసార్లు చెపాక్‌ నుంచి కరుణానిధి అసెంబ్లీ ఎన్నిక‌య్యారు. ఇందులో రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఈ స్థానాన్ని కరుణానిధి కుటుంబానికి క‌లిసివ‌చ్చే స్థానంగా భావిస్తుంటారు. 2008లో చెపాక్‌, ట్రిప్లికేన్‌ ప్రాంతాలను విలీనం చేశారు. అనంత‌రం 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఇక్కడ విజ‌యం సాధించింది. 


దివంగత ముఖ్య‌మంత్రి జయలలితకు, కరుణానిధికి అప్పట్లో ఢీ అంటే ఢీ అన్నట్లు రాజకీయాలు కొన‌సాగాయి. 60 ఏళ్ల స్టాలిన్‌ను యువనేతగా, తన రాజకీయ వారసుడిగా ప్రకటించి కరుణానిధి క‌న్నుమూశారు. పదేళ్లుగా డీఎంకే ప్రతిపక్ష స్థానంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమిళనాట తమ‌ జెండా ఎగురవేయాలని డీఎంకే అధినేత స్టాలిన్‌ పట్టుదలతో కృషి చేశారు. రాష్ట్రమంతా కలియతిరుగుతూ రాజకీయాల‌ను వేడెక్కించారు. తొలిసారి ప్రత్యక్షంగా శాసనసభ ఎన్నికల్లో పోటీకి దిగిన ఉద‌య‌నిధి సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. కాంగ్రెస్, ఎండీఎంకే మిత్రపక్షాలతో డీఎంకే పొత్తు పెట్టుకుంది ఇందులో భాగంగా తమిళనాట 234 సీట్లకుగానూ 173 స్థానాల్లో డీఎంకే పోటీ చేసింది. 61 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. చెపాక్‌ నియోజకవర్గం డిఎంకెకు బ‌ల‌మైన కోట‌గా భావిస్తుంటారు. డిఎంకెను లౌకిక పార్టీగా, మైనారిటీ అనుకూల పార్టీగా భావిస్తుంటారు.  దివంగత డిఎంకె ఎమ్మెల్యే జె అన్పాలగన్ వరుసగా రెండుసార్లు నియోజకవర్గాన్ని గెలుచుకున్నారు. 

Updated Date - 2021-05-02T15:32:10+05:30 IST