జిల్లా ఓటర్లు.. 40,54,052

ABN , First Publish Date - 2021-01-16T05:12:56+05:30 IST

ప్రత్యేక సంగ్రహ సమీక్ష - 2021ని జాతీయ ఎన్నికల సంఘం పూర్తి చేసింది.

జిల్లా ఓటర్లు.. 40,54,052

 మహిళా ఓటర్లే ఎక్కువ..

పురుషుల కంటే అధికంగా 94,131 మంది 

తుది ఓటర్ల జాబితా విడుదల 

రాష్ట్రంలోనే రెండో స్థానంలో గుంటూరు జిల్లా

 

గుంటూరు, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సంగ్రహ సమీక్ష - 2021ని జాతీయ ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఈసీ ఆదేశాల మేరకు తుది ఓటర్ల జాబితాని జిల్లా ఎన్నికల అధికారి ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ శుక్రవారం విడుదల చేశారు. ఎప్పటిలానే మహిళా ఓటర్లు తమ ఆధిక్యాన్ని చాటుకొన్నారు. ఇంచుమించు లక్ష వరకు మహిళా ఓటర్లు జిల్లాలో అధికంగా ఉండటం విశేషం. కాగా రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా ఓటర్ల సంఖ్యలో రెండో స్థానంలో నిలిచింది. తూర్పు గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానంలో గుంటూరు ఉన్నది.  తుది ఓటర్ల జాబితాలను జిల్లాలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు అందజేశారు. అలానే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలు, సీఈవో ఆంధ్ర వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచారు. 


గత ఏడాది సెప్టెంబరు నెల నుంచి జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఎస్‌ఆర్‌-2021 ప్రారంభమైన విషయం తెలిసిందే. 18 ఏళ్లు నిండిన ఏ ఒక్కరూ ఓటరుగా నమోదు కాకుండా మిగిలిపోకూడదన్న ప్రధాన లక్ష్యంతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అర్హుల చేత ఓటుహక్కు కోసం బీఎల్‌వోలు దరఖాస్తు చేయించారు. అలానే అభ్యంతరాలు, తొలగింపుల కోసం వచ్చిన అర్జీలను పరిష్కరించారు. డిసెంబరు నెలలో ముసాయిదా ఓటర్ల జాబితాని విడుదల చేశారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి తుది జాబితాని ఖరారు చేశారు. జిల్లాలో పురుష ఓటర్లు 19,76,299 ఉండగా 20,70,430 మంది మహిళా ఓటర్లు నమోదు అయ్యారు. 485 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. మూడు కేటిగిరీలు కలిపి 40,47,214 మంది ఓటర్లు ఉన్నారు. అలానే 6,623 మంది పురుష సర్వీసు ఓటర్లు, 215 మంది మహిళా సర్వీసు ఓటర్లు కలిపి మొత్తం 6,838 మంది ఉన్నారు. ఈ విధంగా మొత్తం ఓటర్ల సంఖ్య 40 లక్షల 54 వేల 52గా ఖరారు చేశారు. జిల్లాలో అత్యధికంగా 2,74,848 మంది ఓటర్లతో మంగళగిరి ప్రథమ స్థానంలో నిలిచింది. బాపట్లలో తక్కువగా 1,86,128 మంది ఓటర్లు ఉన్నారు. 

Updated Date - 2021-01-16T05:12:56+05:30 IST