ఓటరు తీర్పుపై ఉత్కంఠ!

ABN , First Publish Date - 2022-06-23T04:53:00+05:30 IST

ఆత్మకూర ఉప ఎన్నికల విజయావకాశంపై రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున అంచనాలు వేసుకుంటున్నా.. ఓటరన్న ఇచ్చే తీర్పుపై అత్యంత ఉత్కంఠ నెలకొంది.

ఓటరు తీర్పుపై   ఉత్కంఠ!
జాబితా రెడీనా : పోలింగ్‌ సామగ్రి పంపిణీలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు

భారీ పోలింగ్‌కు వైసీపీ వ్యూహం

ఓటుకు రూ.500 చొప్పున పంపకాలు

వలంటీర్లు, పొదుపు వీఓఏలకూ తాయిలాలు

పొదుపు సభ్యులు, అంగనవాడీలు, ఆశా వర్కర్లకు పరోక్ష ఆదేశాలు

అధికార పార్టీ ఆగడాలను అడ్డుకునేందుకు కమలనాథుల సన్నద్ధం

  

ఆత్మకూరు జూన 22 : ఆత్మకూర ఉప ఎన్నికల విజయావకాశంపై రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున అంచనాలు వేసుకుంటున్నా.. ఓటరన్న ఇచ్చే తీర్పుపై అత్యంత ఉత్కంఠ నెలకొంది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి గుండ్లపల్లి భరతకుమార్‌, బీఎస్పీ అభ్యర్ధి నందా ఓబులేశు ఎవరికి వారు విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో వాతావరణాన్ని క్రోడీకరించుకుని తమకున్న అవకాశాలను అంచనా కడుతున్నారు. ప్రజాసంక్షేమ పథకాలు తమకు పెద్ద అస్సెట్‌గా వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీయడం, తమకు లాభిస్తుందని బీజెపీ నేతలు అంచనాలు క డుతున్నారు. 


భారీ పోలింగ్‌కు వైసీపీ వ్యూహం


ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున ఓట్లు పోల్‌ చేయించుకునేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహాన్ని సిద్ధం చేశారు. దాని ప్రకారం గురువారం జరిగే పోలింగ్‌లో రసవత్తర సన్నివేశాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితమే వలంటీర్ల పర్యవేక్షణలో ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ పూర్తి చేశారు. రెండు లక్షల మంది ఓటర్లకు రూ.10 కోట్లు మేర పంపిణీ చేసినట్లు గుసగుసలు వినవస్తున్నాయి. వలంటీర్లకు, పొదుపు వీఓఏలకు ఒక్కొక్కరికి రూ.5000 చొప్పున ముట్టజెప్పారనే విమర్శలూ లేకపోలేదు. గ్రామాల్లో ప్రతి 50 మంది ఓటర్లకు ఒక టీమ్‌ లీడర్లును కేటాయించి వారిని పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లు వేయించే బాధ్యతను అప్పగించినట్లు సమాచారం. టీం లీడర్లను, ఓటింగ్‌ తీరుతెన్నులను గంట గంటకు పర్యవేక్షిస్తూ దిశదశ నిర్ధేశించేందుకు వారిపై కొందరు నాయకులను నియమించినట్లు తెలుస్తోంది. వీరికితోడుగా పొదుపు గ్రూపు సభ్యులు, అంగనవాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు సైతం వైసీపీకి ఓటు వేయించేలా సహకరించాలని ఆ పార్టీ నేతలు అనధికారిక సూచనలు ఇచ్చినట్టు విమర్శలు ఉన్నాయి. ప్రతి బూతలో సమయాన్ని బట్టి తమకు పోలయ్యే ఓట్ల సంఖ్యను బట్టి అప్పటికప్పుడే కొన్ని నిర్ణయాలు తీసుకునేందకు కూడా మద్దతుదారులను సమాయత్తం చేశారు. తమకు అనుకూల గ్రామాల్లో రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశాలు లేకపోలేదు. ముందుగా తమకు ఏయే బూతుల్లో అధికంగా ఓట్లు పోలవుతాయో, ఏయే బూతల్లో తక్కువ స్థాయిలో పోలవుతాయన్న అంచనా బూతల జాబితాను తయారు చేసినట్లు తెలిసింది. ఇంకా పలు రకాల వ్యూహాలతో  వైసీపీ నేతలు పోలింగ్‌కు సమాయత్తమయ్యారు.


ఎదుర్కొనేందుకు బీజేపీ సన్నద్దం


వైసీపీ ప్రభుత్వం పనితీరుపై ప్రజావ్యతిరేకతే తమకు వజ్రాయుధమని కమలనాథులు ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వంపై వ్యతిరేకతతోపాటు మేకపాటి కుటుంబంపై అసంతృప్తి ఈ ఎన్నికల్లో తమకు లాభిస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.  మరోవైపు పోలింగ్‌ బూతల వద్ద వైసీపీ అరాచాకాలకు పాల్పడినా, రిగ్గింగ్‌కు యత్నించినా ప్రతిఘటించేందుకు సిద్ధమయ్యారు. అన్ని పోలింగ్‌ బూతలలో సమర్ధులైన ఏజెంట్లు నియామకం పకడ్బందీగా నియమించారు.   అలాగే ఓటుకు రూ.200 చొప్పున పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇక బీఎస్పీ అభ్యర్థి నందా ఓబులేశు సైతం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే విజయసోఫానాలుగా మారతాయనే ఆశాభావం ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. 


నేడే పోలింగ్‌!


ఉదయం 7 నుంచి సాయంత్ర 6 గంటల వరకు..

ఏర్పాట్లు పూర్తి, పటిష్ట బందోబస్తు


ఆత్మకూరు, జూన 22 : ఆత్మకూరు ఉప ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గురువారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్‌లో 2,13,338 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఆత్మకూరు మండలంలో 52,155 మంది, అనంతసాగరంలో 35,002 మంది, చేజర్లలో 27,894 మంది, మర్రిపాడులో 34,859 మంది, ఏఎ్‌సపేటలో 28,026 మంది, సంగంలో 35,402 మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకుగాను 279 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు తదితర సామగ్రిని తీసుకుని ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర సిబ్బంది బుధవారం సాయంత్రానికల్లా నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో పోలింగ్‌ సామగ్రిని తరలించారు. ఎన్నికల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. 


కట్టుదిట్టమైన భద్రత


ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 1032 మంది పోలీస్‌ సెంట్రల్‌ ఆన ఫోర్సుతో పాటు 1132 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించారు. ఎప్పటికప్పుడు ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షంచే విధంగా వైబ్‌ కాస్టింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా వెంటనే అక్కడకు వెళ్లేందుకు సై్ౖటకింగ్‌ ఫోర్సు, రూరల్‌ పార్టీస్‌ సిద్ధం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో గుర్తించిన 131 సమస్యాత్మక కేంద్రాల వద్ద   1500 మంది సిబ్బంది, 11 సీపీఎఫ్‌, ఏసీఎస్పీ కంపెనీలతో పకడ్బందీ బందోబస్తు పెట్టారు.  ప్రజల్లో భద్రతాభావం కల్పించేందుకు పలు ప్రాంతాల్లో పోలీసు కవాతు నిర్వహంచారు. కావున ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌, ఎన్నికల అధికారి  చక్రధర్‌బాబు, రిటర్నింగ్‌ అధికారి, జేసీ ఎంఎస్‌ హరేంధిరప్రసాద్‌, నోడల్‌ అధికారి టి బాపిరెడ్డి పిలుపునిచ్చారు.


స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి

కలెక్టర్‌ చక్రధర్‌బాబు


ఆత్మకూరు, జూన 22 : ఉప ఎన్నికలలో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌, ఎన్నికల అధికారి చక్రధర్‌బాబు తెలిపారు. ఆత్మకూరులోని ఆంధ్ర ఆంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన డిసి్ట్రబ్యూషన సెంటర్‌ను బుధవారం ఆయన పరిశీలించి అధికారులకు, పోలింగ్‌ సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్‌ సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్‌, వ్యాక్సినేషన కౌంటర్‌, సూక్ష్మ పరిశీలకులకు ఏర్పాటు చేసిన కౌంటర్‌ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ గురువారం ఉదయం 6 గంటలకు మాక్‌ పోల్‌తో పోలింగ్‌ ప్రక్రియ మొదలవుతుందన్నారు. నిర్ణయించిన క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల వరకు వెబ్‌ కాస్టింగ్‌ లైవ్‌ ఉంటుందని తెలిపారు. ప్రతి రెండు గంటలకు నమోదైన పోలింగ్‌ శాతం తెలియజేసేలా అన్ని ఏర్పాట్లు చేపట్టామని పేర్కొన్నారు. ముందుగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జేసీ హరేంధిరప్రసాద్‌, ఆర్డీవో బాపిరెడ్డి పర్యవేక్షణలో డిసి్ట్రబ్యూషన కేంద్రానికి చేరుకున్న సిబ్బందికి పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ చేశారు.


కట్టుదిట్టమైన భద్రత : ఎస్పీ 


ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టామని  ఎస్పీ విజయరావు తెలిపారు. పోలీసు అధికారులకు, సిబ్బందికి స్థానిక ఆంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో భ్రీఫింగ్‌ నిర్వహించి ఎన్నికలకు సంబదించి విధివిధానాలపై దిశా నిర్ధేశం చేశారు.  మహిళలకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయడంతోపాటు వృద్ధుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.



Updated Date - 2022-06-23T04:53:00+05:30 IST