డిష్యుం.. డిష్యుం

ABN , First Publish Date - 2020-07-03T10:11:03+05:30 IST

ఇళ్ల స్థలాల పంపిణీ విషయమై తలెత్తిన వివాదం ముదిరి అధికార పార్టీ వైసీపీలోని రెండు వర్గాల నడుమ ఘర్షణకు

డిష్యుం.. డిష్యుం

ఇళ్ల స్థలాల విషయమై 

వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

రాళ్లు, కర్రలతో ఇరువర్గాల దాడులు

ధర్మవరంలో ఘటన.. ముగ్గురికి గాయాలు

ఆ సమయంలో వలంటీర్లు అక్కడే..

 

ఉదయగిరి రూరల్‌/వరికుంటపాడు, జూలై 2: ఇళ్ల స్థలాల పంపిణీ విషయమై తలెత్తిన వివాదం ముదిరి అధికార పార్టీ వైసీపీలోని రెండు వర్గాల నడుమ ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన వరికుంటపాడు మండలం ధర్మవరంలో గురువారం జరిగింది. గ్రామంలో  లబ్ధిదారులకు ఇటీవల లాటరీ విధానంలో ఇంటి స్థలాలను కేటాయించారు. అయితే సమీపంలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని గడ్డివా ములు వేసుకొని  కొంతకాలంగా తమ స్వాధీనంలోనే ఉంచుకున్నారు. అలాంటి వారి పేర్లు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉండడంతో వారికి కూడా స్థలాలను కేటాయించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారికి కూడా మరోమారు ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని మరో వర్గం వారు ప్రశ్నించారు.


దీంతో ఇరువర్గాల నడుమ ఘర్షణ జరిగింది. దీంతో ఒక వర్గానికి చెందిన జాజం వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. దీంతో కొంత సమయం తరువాత బజారుకు వచ్చిన ఆయన మరో వర్గానికి చెందిన కాళె తిరుపతయ్య, ఆయన కుమారుడు కాళె వెంకటేశ్వర్లుపై తన అనుచరులతో పథకం ప్రకారం అడ్డగించి రాళ్లు, కర్ర లతో దాడికి పాల్పడడంతో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఉద యగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


ఘర్షణలో గాయపడ్డ కాళె వెంకటేశ్వర్లు భార్య ప్రవల్లిక గ్రామ వలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. మరో వర్గానికి చెందిన గ్రామ వలంటీర్‌ కిరణ్‌ సైతం ఘర్షణ సమయంలో ఉన్నట్లు తెలిసింది. అనంతరం ఇరువర్గీయులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వరికుంటపాడు ఎస్‌ఐ ఉమాశంకర్‌ ఘటనా స్థలిని పరిశీలించారు. ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-03T10:11:03+05:30 IST