ఇది జగన్‌ సైన్యం

ABN , First Publish Date - 2021-04-13T06:18:43+05:30 IST

ఇది జగన్‌ సైన్యం

ఇది జగన్‌ సైన్యం
సభలో సీఎం జగన్‌, కలెక్టర్‌ ఇంతియాజ్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు

వలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవంలో మంత్రి పేర్ని నాని

పురస్కారాలు అందుకున్న 1,368 మంది వలంటీర్లు

విజయవాడ, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి) : సేవ చేయడానికి వలంటీర్లుగా వచ్చిన యువతీ యువకులు జగనన్న సైన్యంగా మారారని మంత్రి పేర్ని నాని ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో వలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటు చేసి 20 నెలలు కావస్తున్నందున వారికి సేవా పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని పోరంకిలో సోమవారం నిర్వహించారు. తొలుత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం సీఎం జగన్‌ ప్రసంగించారు. అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ ఎమ్మెల్యే, కార్పొరేటర్‌, సచివాలయ కార్యదర్శి పేరు తెలియని ఇళ్లు ఉండొచ్చని, వలంటీర్ల పేరు తెలియని ఇల్లు రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. వలంటీర్ల సేవ చూసి చంద్రబాబు, ఆయన కుమారుడు కుళ్లి ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒకటో తేదీ వేకువజామునే పింఛన్లు అందజేస్తున్న ఘనత మనదని, ఇతర రాష్ట్రాలు జగన్‌ కార్యక్రమాలను కాపీ కొడుతున్నాయని చెప్పారు. కొంతమంది వలంటీర్లు తమకు అది కావాలి, ఇది కావాలని లేఖలు రాస్తున్నారని, అటువంటి వారిని దగ్గరకు రానివ్వొద్దని, పక్కకు తోసేయాలన్నారు. వలంటీర్‌ వ్యవస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న వలంటీర్లు నిజమైన హీరోలన్నారు. కొవిడ్‌ సమయంలో కూడా ఒక్కో ఇంటికి ఐదుసార్లు వెళ్లి సర్వే చేశారన్నారు. ఈ పురస్కారాలకు రాష్ట్రంలో 2లక్షల22వేల999 మందిని ఎంపిక చేశామని, ఎంపిక చేయడం కష్టమైందని పేర్కొన్నారు. కంప్యూటర్‌ ఎంపిక చేసిన వారికి 20శాతం వెయిటేజ్‌ మార్కులు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కొలుసు పార్థసారథి, మేకా ప్రతాప్‌ అప్పారావు, సింహాద్రి రమేశ్‌, దూలం నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, కలెక్టర్‌ ఇంతియాజ్‌, జేసీ మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

భౌతిక దూరానికి రాం రాం..

వలంటీర్ల సత్కార సభలో భౌతిక దూరం కనిపించలేదు. సత్కారాలు అందుకోవడానికి వచ్చిన వలంటీర్లకు గ్రామ సచివాలయాలవారీగా వేర్వేరుగా బాక్సులు ఏర్పాటు చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 1,368 మందిని ఎంపిక చేసి, బాక్సులు కేటాయించారు. అయితే, కుర్చీలు దగ్గరగా వేయడం వల్ల భౌతికదూరం కనిపించలేదు. కాగా, పురస్కార సభ నేపథ్యంలో బందరు రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.  

ఏవీ.. చూడలేదేమి?

వలంటీర్లు రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు ఒక ఏవీ (ఆడియో విజువల్‌, డాక్యుమెంటరీ)ని తయారు చేశారు. సీఎం ప్రసంగానికి ముందు ఈ ఏవీని సభా ప్రాంగణంలో డిజిటల్‌ స్ర్కీన్లపై ప్రదర్శించారు. వలంటీర్లు, మీడియా ప్రతినిధులే ఈ ఏవీని చూశారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చూడలేదు. వేదికపై కుర్చీలన్నీ కదిపితే ఇబ్బందవుతుందన్న ఉద్దేశంతో సీఎం చూడలేదని పలువురు అధికారులు తెలిపారు.  

జేసీ.. మురిసి..

సీఎం జగన్‌ ప్రసంగానికి జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత మురిసిపోయారు. పండ్లు ఉన్న చెట్లకే రాళ్ల దెబ్బలు తగులుతాయన్న సామెతను జగన్‌ చదివి వినిపించారు. ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దన్నారు. దీంతో వేదికపై ఉన్న జేసీ మాధవీలత మాస్కు తీసి నవ్వుతూ చప్పట్లు కొట్టారు.

పురస్కారాల లెక్క ఇదీ..

సేవామిత్ర పురస్కారానికి రాష్ట్రంలో 2లక్షల18వేల151 మంది ఎంపిక చేశారు. వారికి రూ.10వేలు, ప్రశంసాపత్రం, బ్యాడ్జీ అందజేసి సత్కరిస్తారు.

సేవారత్న పురస్కారానికి 4వేల మందిని ఎంపిక చేశారు. వారికి రూ.20వేలు, ప్రశంసాపత్రం, బ్యాడ్జీ, పతకం అందజేస్తారు.

సేవావజ్ర పురస్కారానికి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదుగురిని ఎంపిక చేశారు. వారికి రూ.30వేలు, ప్రశంసాపత్రం, బ్యాడ్జీ ఇస్తారు. 

పురస్కారాలు అందుకున్నది వీరే..

వైఎస్సార్‌ తాడిగడపకు చెందిన షేక్‌ నూర్జాహాన్‌, యనమలకుదురుకు చెందిన రాజేశ్‌, పి.ప్రత్యూష, కానూరుకు చెందిన సాజిదా బేగం, వి.భవానీ, ఉయ్యూరుకు చెందిన జి.వల్లీ, కంకిపాడు మండలం ప్రొద్దుటూరుకు చెందిన కొడాలి నవీన్‌కు సేవావజ్ర పురస్కారాలను సీఎం జగన్‌ అందజేశారు. వారికి శాలువా కప్పి సన్మానించారు. 




Updated Date - 2021-04-13T06:18:43+05:30 IST