పార్కింగ్‌ దందా!

ABN , First Publish Date - 2022-04-30T06:02:37+05:30 IST

విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని పార్కింగ్‌ స్థలాలు లీజుదారులకు, అధికారులకు కూడా కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

పార్కింగ్‌ దందా!
గాంధీజీ మున్సిపల్‌ హైస్కూల్‌ ఎదుట పార్కింగ్‌లో కార్లు

వీఎంసీకి రూ.కోట్లలో ఎగ్గొడుతున్న లీజుదారులు

గతంలో స్మార్ట్‌ పార్కింగ్‌ పేరుతో రూ.3 కోట్లకు కుచ్చుటోపీ

తాజాగా కేఆర్‌ మార్కెట్‌లో రూ.అరకోటి ఎగవేత

నిమ్మకు నీరెత్తినట్టు వీఎంసీ ఎస్టేట్‌ విభాగం

అధికార పార్టీ కార్పొరేటర్లకు కొమ్ముకాసేలా అధికారుల తీరు


విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని పార్కింగ్‌ స్థలాలు లీజుదారులకు, అధికారులకు కూడా కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గతంలో స్మార్ట్‌ పార్కింగ్‌ పేరుతో ఓ లీజుదారు సుమారు రూ.3 కోట్ల మేర వీఎంసీకి ఎగవేసి వెళ్లగా, తాజాగా కేఆర్‌ మార్కెట్‌ సెల్లార్‌ పార్కింగ్‌ను లీజుకు తీసుకున్న వ్యక్తి అరకోటి మేర వీఎంసీకి నామం పెట్టాడు. అయినా ఏ ధైర్యంతోనో మళ్లీ అదే లీజుదారుడు అదే సెల్లార్‌ పార్కింగ్‌ను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నాడు. వీఎంసీ పార్కింగ్‌ స్థలాల్లో అధికార పార్టీ నేతల దందాకు వీఎంసీ అధికారులూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఫలితంగా కోట్లాది రూపాయల వీఎంసీ ఆదాయం ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి చేరుతోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ/వన్‌టౌన్‌) : విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పార్కింగ్‌ దందాకు అధికార పార్టీ నేతలు తెర తీశారు. వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ (కేఆర్‌ మార్కెట్‌) సెల్లార్‌ పార్కింగ్‌ లీజుదారులు నగరపాలక సంస్థకు రూ.అరకోటి ఎగ్గొట్టారు. ఈ వ్యవహారంలో వీఎంసీ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఽధికార పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి సిండికేట్‌గా ఏర్పడి ‘హోమ్‌ నీడ్‌ ఫుడ్స్‌’ పేరిట గత ఏడాది జూన్‌ 29న కార్పొరేషన్‌ నిర్వహించిన టెండర్‌ కమ్‌ వేలం పాటలో కేఆర్‌ మార్కెట్‌ సెల్లార్‌ పార్కింగ్‌ లీజు హక్కులను పొందారు. ఆ టెండర్లలో వీరు మినహా వేరెవరూ పాల్గొనలేదు. సింగిల్‌ టెండర్‌ వచ్చినపుడు నిబంధనల ప్రకారం దానిని రద్దు చేసి మరోసారి టెండర్లు పిలవాలి. కానీ అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ల ఒత్తిడి మేరకు వీఎంసీ అధికారులు ఆ సంస్థకే టెండరు కట్టబెట్టారు. ఏడాదికి సుమారు రూ.93 లక్షలు చెల్లించేలా టెండరు పాడుకున్న టెండరుదారులు తొలుత ఈఎండీ రూ.23 లక్షలు చెల్లించారు. నిబంధనల ప్రకారం లీజుదారులు ప్రతి నెలా కార్పొరేషన్‌కు రూ.10 లక్షలు చెల్లించాలి. గత ఏడాది ఆగస్టు ఒకటో తేదీ నుంచి డిసెంబరు వరకు పార్కింగ్‌ ఫీజును లీజుదారులు వసూలు చేసుకున్నారు. ఆ ఐదు నెలల కాలానికి కార్పొరేషన్‌కు నయాపైసా చెల్లించలేదు. దీంతో  అధికారులు ఈ ఏడాది జనవరి నుంచి కేఆర్‌ మార్కెట్‌ సెల్లార్‌ పార్కింగ్‌ను స్వాధీనం చేసుకుని స్వయంగా నిర్వహిస్తున్నారు. ఐదు నెలల కాలానికి పాత లీజుదారులు చెల్లించాల్సిన రూ.50 లక్షల్లో ఒక్క రూపాయి కూడా ఇంతవరకు వీఎంసీ అధికారులు వసూలు చేయలేదు. కేవలం నోటీసులతో సరిపెట్టారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు వీఎంసీ ఎస్టేట్‌ అధికారిపై ఒత్తిడి తెచ్చి బకాయిలు కట్టకుండా మేనేజ్‌ చేశారనే ప్రచారం ఉంది.  ఏకంగా మేయర్‌తోనే ఎస్టేట్‌ అధికారికి ఫోన్‌ చేయించి మరీ బకాయిలు అడగవద్దంటూ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. బకాయి మొత్తాన్ని రాబట్టడంలో వీఎంసీ అధికారులు ఉదాసీన వైఖరితో వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 


మళ్లీ వారికే కట్టబెట్టేందుకు డ్రామా..

ప్రస్తుతం కేఆర్‌ మార్కెట్‌ సెల్లార్‌ పార్కింగ్‌ను వీఎంసీ స్వయంగా నిర్వహిస్తోంది. ఇక్కడి సిబ్బందిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చేతివాటం ఎక్కువగా ఉండి వీఎంసీకి నెలకు ఐదారు లక్షల ఆదాయం మాత్రమే సమకూరుతోంది. ఇప్పుడు ఇదే పాత లీజుదారులకు వరంగా మారింది. కేఆర్‌ మార్కెట్‌ పార్కింగ్‌లో ఆదాయం పెద్దగా లేనందున తాము నష్టపోయామని, ఈ నేపథ్యంలో పాత బకాయిలు రద్దు చేసి పార్కింగ్‌ను తమకు కేటాయించాలని కోరుతూ పాత లీజుదారులు వీఎంసీ అధికారులకు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా మళ్లీ పాత లీజుదారులకు కేఆర్‌ మార్కెట్‌ పార్కింగ్‌ను గతంలో పాడుకున్న టెండరు కంటే తక్కువ ధరకే కట్టబెట్టేందుకు అధికారులు చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం వీఎంసీకి సమకూరుతున్న ఆదాయాన్ని ఆధారంగా చూపుతూ దానికంటే కొద్దిగా ఎక్కువ మొత్తానికి పాత లీజుదారులకు టెండరు  కట్టబెట్టేందుకు వీఎంసీ ఎస్టేట్‌ కార్యాలయం కేంద్రంగా పావులు కదులుతున్నాయి. 


సామాన్యులకో న్యాయం.. వారికో న్యాయమా..!

నీటిపన్ను, ఇంటి పన్ను, డ్రెయినేజీ చార్జీలు, ఇటీవల ప్రవేశపెట్టిన చెత్తపన్ను సహా ఏది చెల్లించకపోయినా సామాన్యులపై వెంటనే చర్యలు తీసుకుంటున్న వీఎంసీ అధికారులు కార్పొరేషన్‌కు రూ.50 లక్షలు బకాయిపడిన వారి నుంచి సొమ్ము రాబట్టడంలో ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారో తెలియడం లేదు. నగర కమిషనర్‌ స్పందించి బకాయిల వసూలుపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ఆర్‌టీఐ ద్వారా తెలుసుకోండి

- అంబేడ్కర్‌, ఎస్టేట్‌ అధికారి వింత జవాబు 

కేఆర్‌ మార్కెట్‌ సెల్లార్‌ పార్కింగ్‌ బకాయి గురించి ఎస్టేట్‌ అధికారి అంబేడ్కర్‌ను వివరణ కోరగా మీకు ఏమైనా సమాచారం కావాలంటే ఆర్‌టీఐ ద్వారా తెలుసుకోండంటూ ఉచిత సలహా ఇవ్వడం గమనార్హం. పాత లీజుదారు నుంచి బకాయిలు వసూలు చేశారా? ప్రస్తుతం కేఆర్‌ మార్కెట్‌ పార్కింగ్‌ నుంచి నెలకు వీఎంసీకి ఎంత ఆదాయం సమకూరుతుంది? అనే వివరాలు ఎస్టేట్‌ అధికారి వద్దే ఉంటాయి. కానీ ఆయన ఎలాంటి వివరాలూ తెలపకుండా ఆర్టీఐ ద్వారా తెలుసుకోండని చెప్పి ఫోన్‌ కట్‌ చేశారు.

Updated Date - 2022-04-30T06:02:37+05:30 IST