విశాఖలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-07-16T15:40:55+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ బారినపడి, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న..

విశాఖలో అనూహ్యంగా పెరుగుతున్న కరోనా మరణాలు

కలవరం

11వ తేదీ నుంచి నిత్యం ప్రాణాలు కోల్పోతున్న బాధితులు 

గత ఐదు రోజుల్లో 25 మంది మృత్యువాత

జిల్లాలో మొత్తం 40కి చేరిన మృతుల సంఖ్య

చికిత్స పొందుతున్న వారిలో ఆందోళన

మరో 81 పాజిటివ్‌లు

జిల్లాలో 2,456కు చేరిన కరోనా కేసులు 

పెదవాల్తేరులో ఆరు, తాటిచెట్లపాలెం మసీదు వీధిలో నాలుగు...

గత రెండు రోజులతోపోలిస్తే కొద్దిగా తగ్గుదల


జూలై నెలలో కొవిడ్‌ మరణాలు

తేదీ మృతులు

11 7

12 3

13 4

14 6

15 5


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ బారినపడి, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో పలువురు ప్రాణాలు కోల్పోతుండడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ఈ నెల ఆరంభం నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండగా.... గత ఐదు రోజుల నుంచి నిత్యం మరణాలు నమోదు అవుతుండడం కలవరపరుస్తున్నది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 40 మంది కరోనా బాధితులు చనిపోయారు. వీరిలో 25 మంది ఈ నెల 11వ తేదీ తరువాత మృతిచెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఆరు రోజుల్లోనే మరణాలు 166 శాతం పెరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది. రికార్డు స్థాయిలో ఈనెల  11వ తేదీన ఏడుగురు చనిపోయారు. 12వ తేదీన ముగ్గురు, 13వ తేదీన నలుగురు, 14వ తేదీన ఆరుగురు, బుధవారం ఐదుగురు మరణించారు. తాజాగా మృతిచెందిన వారు రైల్వే న్యూకాలనీ, తిమ్మాపురం, హెచ్‌బీ కాలనీ, సిరిపురం, డెయిరీ ఫారం ప్రాంతాలవాసులని అధికారులు తెలిపారు. 


మరో 81 పాజిటివ్‌లు

జిల్లాలో బుధవారం 81 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు 2,456 మంది వైరస్‌బారిన పడ్డారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు 1,03,125 మంది నమూనాలు పరీక్షించగా, 98,007 మందికి నెగెటివ్‌ వచ్చింది. 2,662 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. 91 క్వారంటైన్‌ కేంద్రాల్లో 1309 మంది, ఐసోలేషన్‌ ఆస్పత్రుల్లో 592 మంది ఉన్నారు. గత రెండు రోజులతోపోలిస్తే వైరస్‌బారిన పడిన వారి సంఖ్య కొంతమేర తగ్గినప్పటికీ... వైరస్‌ అనుమానిత లక్షణాలతో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

 

పెదవాల్తేరులో ఆరు.. 

పెదవాల్తేరు పరిసర ప్రాంతాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. తాజాగా పెదజాలరిపేటలో 57 ఏళ్ల వ్యక్తి, పెదవాల్తేరు కాయితాలవారివీధిలోఒకరు(33), లాసన్స్‌ బే కాలనీకి చెందిన 52, 65 వయసుగల వ్యక్తులు, ఈస్ట్‌పాయింట్‌ కాలనీలో 30 ఏళ్ల మహిళ, 54 ఏళ్ల పురుషుడు, పెదవాల్తేరు రైతుబజార్‌ డ్వాక్రా గ్రూపు సభ్యుడు(57) వైరస్‌ బారినపడ్డారు.  


మసీదు వీధిలో నాలుగు.. 

తాటిచెట్లపాలెం ప్రాంతంలోని రైల్వే న్యూకాలనీ మసీదు వీధికి చెందిన నలుగురు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వీరంతా 35-40 ఏళ్ల మధ్య వయస్కులే. నగరంలోని వేర్వేరు ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న వీరు అనారోగ్యంతో బాధపడుతుండడంతో నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. 


69వ వార్డులో మూడు.. 

జీవీఎంసీ 69వ వార్డు పరిధి తుంగ్లాంలో వార్డు వలంటీర్‌గా చేస్తున్న యువకుడు, యువతి వైరస్‌ బారినపడ్డారు. షీలానగర్‌ ప్రాంతానికి చెందిన మరో యువకుడు కూడా వైరస్‌ బారినపడ్డారు. 


ఎన్‌ఏడీ ప్రాంతంలో ముగ్గురికి..

ఎన్‌ఏడీ కొత్తరోడ్డు పరిసర ప్రాంతాల్లో ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గోపాలపట్నం తహసీల్దార్‌ కార్యాలయం గ్రేడ్‌-2 వీఆర్‌వో, 52వ వార్డు శాంతినగర్‌ ప్రాంతంలో వృద్ధురాలు(68), గురజాడనగర్‌ ప్రాంతానికి చెందిన వృద్ధుడు(68) వైరస్‌ బారినపడ్డారు. 


ఎండాడలో ముగ్గురికి.... 

ఎండాడలో ముగ్గురికి కరోనా సోకింది.  పెట్రోల్‌ బంక్‌ పక్కనే నివాసముంట్ను 37 ఏళ్ల వ్యక్తితో పాటు మరో వ్యక్తి(52)కి, 37 ఏళ్ల మహిళకు వైరస్‌ సోకింది. 


మల్కాపురం ప్రాంతంలో మూడు..

మల్కాపురం ప్రాంతంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పవనపుత్ర నగర్‌లో యువకుడు(32), మాజీ సైనికుల కాలనీలో వ్యక్తి(48), చింతలలోవ ప్రాంతంలో ఒక వ్యక్తి(36) వైరస్‌ బారినపడ్డారు. 


ఆరిలోవలో ప్రాంతంలో మరో ఇద్దరికి కరోనా సోకింది. ఈ నెల 12న హైదరాబాద్‌ నుంచి వచ్చిన యువకుడికి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శ్రీకాంత్‌ నగర్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి వైరస్‌ సోకింది. 


సబ్బవరం శివారు ఆదిరెడ్డిపాలెంలో డాక్టర్‌(40)కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. భార్యాభర్తలిద్దరూ విశాఖలోని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో డాక్టర్లుగా పని చేస్తున్నారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండడంతో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించుకోగా, బుధవారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. 


పెందుర్తి రూరల్‌ పరిధి చీమలాపల్లి గవరపాలెం కాలనీకి చెందిన యువకుడు(30) వైరస్‌ బారినపడ్డారు. ఇతను నగరంలోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అస్వస్థతగా ఉండడంతో కొవిడ్‌ పరీక్ష నిర్వహించుకోగా పాజిటివ్‌గా తేలింది. 


సింహాచలం 90వ వార్డు ఎస్సీ కాలనీకి చెందిన 41 ఏళ్ల వ్యక్తి వైరస్‌ బారినపడ్డాడు. 


పాడేరులో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మండలంలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ భార్య(35) ఇటీవల విజయనగరం నుంచి వచ్చారు. ఆమెకు జ్వరంతోపాటు కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో స్థానిక ఆస్పత్రిలో పరీక్షించగా పాజిటివ్‌ నిర్ధారణ జరిగింది.  అలాగే పాడేరుకు చెందిన ఓ డాక్టర్‌(34) విజయవాడలో 104 విభాగంలో పని చేస్తున్నారు. ఆయన రెండు రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో బుధవారం పరీక్షించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది.  


అనకాపల్లి గాంధీనగరం కోర్టు వీధిలో 38 ఏళ్ల వ్యక్తికి కరోనా వచ్చింది. 13వ తేదీన ఎన్టీఆర్‌ వైద్యాలయంలో కరోనా పరీక్ష చేయగా 15న పాజిటివ్‌ నిర్ధారణ అయిందని పోలీసులు చెప్పారు. దీంతో అనకాపల్లిలో కరోనా కేసుల సంఖ్య 158కి చేరింది. 


అనంతగిరి మండలం కొండిభ పంచాయతీ తైడాలో నివాసం ఉంటున్న 24 ఏళ్ల రైల్వే ఉద్యోగి కరోనా వైరస్‌బారిన పడ్డాడు. బిహార్‌కు చెందిన ఇతను గతనెల 22న అక్కడి నుంచి రైలులో విశాఖ చేరుకున్నాడు. అక్కడ నుంచి తైడాకు ఆర్టీసీ బస్సులో వచ్చి హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే బస్సులో వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్టు గుర్తించిన అధికారులు విషయాన్ని 30వ తేదీన స్టేషన్‌ మాస్టర్‌కు తెలిపారు. దీంతో ఆ యువకుడు విజయనగరంలో కొవిడ్‌ పరీక్షలు చేసుకోగా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. 


అచ్యుతాపురం సెజ్‌ పునరావాస కాలనీ గురజాపాలెంలో మహిళ వైరస్‌బారిన పడ్డారు. వారం క్రితం ఈ గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌కి పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతని భార్య, కుమారుడ్ని అనకాపల్లి తరలించి పరీక్షలు చేయగా భార్యకు పాజిటివ్‌, కుమారుడికి నెగెటివ్‌ వచ్చింది.


చీడికాడ మండలంలోని జి.కొత్తపల్లిలో ఒక యువకుడు వైరస్‌బారిన పడ్డాడు. విశాఖలో ఉద్యోగం చేస్తున్న ఇతను కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామానికి వచ్చాడు. అనారోగ్యంగా ఉండడంతో 12న విశాఖ వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. 15న పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. కుటుంబ సభ్యులు ఏడుగురిని చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 


మునగపాక మండలం నాగులాపల్లిలో యువకుడికి(35) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. విశాఖపట్నం కలెక్టర్‌ కార్యాలయంలో ఉద్యోగి అయిన ఇతను రోజూ విధులకు వెళ్లివస్తుంటాడు.  కలెక్టరేట్‌ సిబ్బంది అందిరికీ కొవిడ్‌ పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలినట్టు బుధవారం సమాచారం వచ్చింది. 


Updated Date - 2020-07-16T15:40:55+05:30 IST