Abn logo
Apr 17 2021 @ 02:14AM

మహారాష్ట్రకు విశాఖ ట్యాంకర్లు

భిలాయ్‌లో ఆక్సిజన్‌ నింపుకొని రవాణా

మెడ్‌టెక్‌ జోన్‌ నుంచి వెంటిలేటర్లు సరఫరా


(విశాఖఫట్నం-ఆంధ్రజ్యోతి)

మహారాష్ట్రలో కరోనాను కట్టడి చేయడానికి అవసరమైన ఆక్సిజన్‌ ట్యాంకర్లు విశాఖపట్నం నుంచి వెళుతున్నాయి. ఇక్కడినుంచి భిలాయ్‌ స్టీల్‌ప్లాంటుకు వెళ్లి, అక్కడ లిక్విడ్‌ ఆక్సిజన్‌ను నింపుకొని అటు నుంచి మహారాష్ట్ర పంపుతున్నారు. భిలాయ్‌లో ట్యాంకర్ల కొరత ఏర్పడటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులతో మాట్లాడి, ఖాళీ ట్యాంకర్లు పంపాలని కోరింది. దీంతో ట్యాంకర్‌ ఆపరేటర్లతో అధికారులు సంప్రదించి ఇక్కడి నుంచి పంపుతున్నారు. గతేడాది కరోనా ప్రబలినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలకు అవసరమైన ఆక్సిజన్‌ను విశాఖలో స్టీల్‌ప్లాంట్‌లోనే ఉత్పత్తి చేశారు. రోజుకు 100 నుంచి 200 టన్నుల వరకూ మార్కెట్‌ ధర కంటే తక్కువకే సరఫరా చేశారు. ఆ సమయంలో స్థానికంగా ఉన్న ట్రాన్స్‌పోర్టు వ్యాపారులు ఈ ట్యాంకర్లను సమకూర్చుకున్నారు. ఇప్పుడు కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో విశాఖపట్నం కలెక్టర్‌ వినయ్‌చంద్‌తో మహారాష్ట్ర అధికారులు మాట్లాడారు. శుక్రవారమే కొన్ని ఖాళీ ట్యాంకర్లు భిలాయ్‌ వెళ్లాయి. కాగా, విశాఖలోని ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో పెద్దఎత్తున వెంటిలేటర్లు తయారు చేస్తున్నారు. వాటిని కూడా మహారాష్ట్రకు ప్రత్యేకంగా పంపుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement