మిర్చి.. తామర పురుగు తాకిడి..

ABN , First Publish Date - 2022-01-22T05:40:45+05:30 IST

మిర్చి రైతులు నిండా మునిగారు. తామర పురుగుతోపాటు రసం పీల్చే పురుగు, ఎండు తెగులు సోకడంతో తోటలన్నీ నాశనమయ్యాయి.

మిర్చి.. తామర పురుగు తాకిడి..

రైతులకు లక్షల్లో నష్టం


కుక్కునూరు, జనవరి 21: మిర్చి రైతులు నిండా మునిగారు. తామర పురుగుతోపాటు రసం పీల్చే పురుగు, ఎండు తెగులు సోకడంతో తోటలన్నీ నాశనమయ్యాయి. ఇప్పటికే వేల రూపాయలు ఖర్చు చేసి పురుగు మందులు కొట్టినా ఫలితం లేదు. కనీసం సగం పంటైనా చేతి కొస్తుందనే ఆశతో కొందరు మిర్చి సాగు చేస్తుండగా మరికొందరు పంట పీకేస్తున్నారు. రెండేళ్లుగా దిగుబడితోపాటు మద్దతు ధర ఉండటంతో ఈ ఏడాది కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 15 వేల ఎకరాలకుపైగా మిర్చి సాగు చేశారు. మొదట్లో గోదావరి వరదలు ముంచెత్తడంతో నష్టపోయారు. మళ్లీ మిర్చి మొక్కలు కొని నాటారు. అయితే ఎన్నడూ లేని విధంగా తామ ర పురుగు మహమ్మారిలా తయారైంది. ఎకరానికి దాదాపుగా రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి రావడంతో ఇక పెట్టుబడులు పెట్టలేక నాశనమైన పంటను తొలగిస్తున్నారు. కుక్కునూరులోని గుండేటి వాగు ప్రాంతంలోని తూము రవి అనే రైతు తన ఏడు ఎకరాల పంటను తొలగించాడు. ‘ఎకరానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. నాలుగు ఎకరాల మిర్చి తోట తామర పురుగు ప్రభావంతో నాశనమైంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా లాభం లేకపోయింది. దీంతో పంటను తీసేస్తున్నా’ అని దామరచర్లకు చెందిన రైతు గుర్రం శ్రీను వాపోయారు. కుక్కునూరుకు చెందిన మరో రైతు దుద్దుకూరు శ్రీను ఇంత తీవ్రంగా ఎప్పుడూ నష్టపోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-01-22T05:40:45+05:30 IST