వైరల్‌.. హడల్‌

ABN , First Publish Date - 2021-09-19T04:49:26+05:30 IST

సిద్దిపేట జిల్లాలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజుకు వందలాది మంది వైరల్‌ ఫీవర్‌ బారిన పడుతున్నారు. జ్వర బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. రక్త పరీక్షల కోసం ల్యాబ్‌ల వద్ద క్యూ కడుతున్నారు. నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రులకు వెళ్లి వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యులు సూచించిన మందులను వేసుకోవాలని చెబుతున్నారు.

వైరల్‌.. హడల్‌
సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలోని ల్యాబ్‌ వద్ద రోగులు

జిల్లాలో విజృంభిస్తున్న జ్వరాలు

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిట 

రక్త పరీక్ష కోసం ల్యాబ్‌లకు క్యూ కడుతున్న బాధితులు


సిద్దిపేట జిల్లాలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజుకు వందలాది మంది వైరల్‌ ఫీవర్‌ బారిన పడుతున్నారు. జ్వర బాధితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. రక్త పరీక్షల కోసం ల్యాబ్‌ల వద్ద క్యూ కడుతున్నారు. నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రులకు వెళ్లి వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యులు సూచించిన మందులను వేసుకోవాలని చెబుతున్నారు.


సిద్దిపేట టౌన్‌, సెప్టెంబరు 18 : జిల్లాలో వైరల్‌ ఫీవర్‌లు హడలెత్తిస్తున్నాయి. ఇంటికొకరు జ్వరం బారిన పడిన వారు ఉన్నారు. సాధారణంగా వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. కానీ ఈ ఏడాది ఇలాంటి కేసులు లేకున్నా వైరల్‌ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. జ్వర బాధితులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. రోగులు వైద్య చికిత్సల కోసం ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. 


కిటకిటలాడుతున్న ఆసుపత్రులు

జిల్లా వ్యాప్తంగా వైరల్‌ ఫీవర్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో వచ్చే రోగలకంటే రెండు, మూడు రెట్లు అధికంగా రోగులు ఆస్పత్రులకు వైద్య చికిత్స కోసం వస్తున్నారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యులు తగిన రీతిలో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, అనుబంధ మెడికల్‌ కళాశాలకు రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఓపీ విభాగం కిటకిటలాడుతున్నది. జనరల్‌ ఆసుపత్రికి రోజుకు 400 మందికిపైగా ఓపి పేషెంట్లు, మందుల కోసం వస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గజ్వేల్‌లోని జిల్లా ఆసుపత్రికి రోజుకు 120 మంది, దుబ్బాకలోని ఏరియా ఆసుపత్రికి 120 మంది వరకు జ్వర లక్షణాలతో వస్తున్నారు. ఆస్పత్రికి వస్తున్న వారిలో 20 శాతం వరకు వైరల్‌ ఫీవర్‌ బారిన పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే కేసులు ఇలా నమోదవుతుంటే ఇక ప్రైవేట్‌, ఆర్‌ఎంపీ ఆసుపత్రుల్లోనూ వైరల్‌ ఫీవర్‌ బాధితుల సంఖ్య విపరీతంగానే ఉందని వైద్య వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే రక్త పరీక్షల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌ల వద్ద క్యూ కడుతున్నారు.


రోజుకు 500 మందికి  వైరల్‌ పీవర్‌

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులను మించి వైరల్‌ ఫీవర్‌ బాధతుల పెరుగుతున్నారు. పల్లె, పట్టణం.. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా వైరల్‌ ఫీవర్‌ విజృభిస్తొంది. గత నెలలో రోజుకు సరాసరిగా 300 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వాటిని మించి పోయేలా ప్రస్తుతం ప్రతి రోజూ దాదాపు 500లకు పైగా వైరల్‌ కేసులు నమోదవుతున్నాయని వైద్య ఆరోగ్య వర్గాలు తెలిపాయి. జిల్లా వ్యాప్తంగా వందలాది సంఖ్యలో వైరల్‌ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే స్కూళ్లు తెరుచుకోవడం, వెంటనే వైరల్‌ ఫీవర్లు విజృభించడం మరింత ఆందోళనను రేకిస్తున్నాయి.


ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

వైరల్‌ ఫీవర్‌ రాగానే నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరం రాగానే తీవ్రమైన ఒంటినొప్పులు వస్తాయి. ఎప్పటికప్పుడు వైద్యులు రాసిచ్చిన మందులను వేసుకోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, ఎక్కడా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.

- క్రాంతికుమార్‌, జనరల్‌ ఫిజీషియన్‌

 

అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలి

గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా వైరల్‌ ఫీవర్‌ విజృంభిస్తున్నా వైద్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి వృద్ధులు, చిన్నారులకు అవసరమైన మందులను ఇవ్వాలి. వైరల్‌ జ్వరాలు మరింత విజృభించకుండా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలి.

- శ్రీకర్‌గౌడ్‌, సిద్దిపేట


Updated Date - 2021-09-19T04:49:26+05:30 IST