వైసీపీ నేతల దాష్టీకం

ABN , First Publish Date - 2022-02-05T06:47:29+05:30 IST

పెదపారుపూడి మండలం ఈదులమద్దాలి గ్రామంలో వైసీపీ నేతలదే ఇష్టారాజ్యం.

వైసీపీ నేతల దాష్టీకం
మృతుడు శ్రీనివాసరావు.. రోదిస్తున్న కుటుంబ సభ్యులు

మనస్తాపంతో రైతు మృతి

తమను కాదని వేరే గ్రామ కూలీలతో పనులు చేయించాడని దౌర్జన్యం

అధికార పార్టీ సర్పంచ్‌ భర్త అనుచరుల దాడి

గాయపడిన రైతు కొండవీటి శ్రీనివాసరావు

ఇంటి ముంగిట్లోకి వస్తూనే కుప్పకూలి మృతి

ఈదులమద్దాలిలో పేట్రేగి పోతున్న వైసీపీ మూకలు


పెదపారుపూడి మండలం ఈదులమద్దాలి గ్రామంలో వైసీపీ నేతలదే ఇష్టారాజ్యం. అక్కడ వాళ్లు ఏమి చెబితే అదే వేదం. వారు చెప్పిన వారితోనే పనులు చేయించుకోవాలి. అలా చేయించుకోని కారణంగా వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు గురై, ఆత్మాభిమానమే ప్రాణంగా భావించే ఓ రైతు గుండె ఆగిపోయింది. గ్రామానికి చెందిన రైతు కొండవీటి శ్రీనివాసరావుపై వైసీపీ నాయకుడు వంగర సూర్యచంద్రరావు అనుచరులు గురువారం రాత్రి చేయి చేసుకున్నారు. గాయపడిన శ్రీనివాసరావు ఇంటి ముంగిట్లో అడుగు పెడుతూనే కుప్పకూలిపోయాడు. శ్రీనివాసరావు మృతి చెందాడని తెలియడంతో గ్రామస్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పెదపారుపూడి యలమర్రు రహదారిపై నాలుగు గంటలకు పైగా బైఠాయించారు. 


గుడివాడ, పెదపారుపూడి, ఫిబ్రవరి 4 : పెదపారుపూడి మండలం  ఈదులమద్దాలి గ్రామంలో కొండవీటి శ్రీనివాసరావుకు పది ఎకరాల పొలం ఉంది. దానితో పాటు తన కుటుంబసభ్యులకు చెందిన మరో 20 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం కుప్ప నూర్పిళ్లు మొదలుపెట్టేందుకు ట్రాక్టర్లవారిని అడగగా, వైసీపీ నాయకులు సూచించిన ట్రాక్టర్ల యజమానులు ఎకరాకు రూ.6,500 డిమాండ్‌ చేశారు. దీంతో శ్రీనివాసరావు పక్క గ్రామాల ట్రాక్టర్లతో కుప్ప నూర్పిళ్లు పూర్తి చేశారు. ఇందుకు గానూ ఎకరాకు రూ.5,300 చొప్పున వారికి చెల్లించారు. దీంతో గ్రామంలోని ఇతర రైతులు తమకు కూడా వారిని మాట్లాడిపెట్టమంటూ శ్రీనివాసరావును ఆశ్రయించారు. ఇది వైసీపీ నాయకుల ఆగ్రహానికి కారణమయింది. 

గురువారం రాత్రి వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్‌ భర్త సూర్యచంద్రరావు మాట్లాడాలని రమ్మని శ్రీనివాసరావును తన అనుచరుల ద్వారా రైసుమిల్లుకు పిలిపించాడు. అక్కడికి చేరుకున్న శ్రీనివాసరావుపై ట్రాక్టర్‌ యజమానులు, మరికొంత మంది దాడి చేశారు. తనకు అనారోగ్యంగా ఉందని, తరువాత మాట్లాడదామని  చెప్పినా వినకుండా సమస్య పరిష్కారమైన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్లాలంటూ బెదిరించారని, ప్రత్యక్ష సాక్షి పడమటి వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. ఈ ఘటన రాత్రి 8 - 9 గంటల నడుమ గ్రామంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన సమయంలో చోటుచేసుకుందని వివరించారు. అక్కడి నుంచి గాయాలతో వచ్చిన తన తండ్రి ముంగిట్లోకి అడుగు పెడుతూనే కుప్పకూలి మరణించారని శ్రీనివాసరావు కుమార్తె అనిత రోదించారు. తన తండ్రి మృతికి సర్పంచ్‌ భర్త సూర్యచంద్రరావు, అతని అనుచరులే కారణమని ఆమె పెదపారుపూడి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన తండ్రి చావుకు కారణమైన వారిని చట్టప్రకారం శిక్షించాలంటూ కన్నీరుమున్నీరయ్యారు. పెదపారుపూడి ఎస్సై దార్ల శ్రీను కేసు  దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ గ్రామానికే చెందిన మంత్రి కొడాలి నాని పీఏ, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 


గ్రామస్థుల ఆగ్రహం

అందరితో కలివిడిగా ఉంటూ, సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్న శ్రీనివాసరావు మరణ వార్త తెలియడంతో ఈదులమద్దాలి గ్రామస్థులు మండిపడుతున్నారు. మహిళా సర్పంచ్‌కు అధికారం కట్టబెడితే, ఆమె భర్త రైస్‌మిల్లులో సెటిల్‌మెంట్‌లు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 


కొడాలి నాని పీఏ అండ ఉందంటూ..

మంత్రి కొడాలి నాని పీఏ ఆచంట లక్ష్మోజీ అండదండలు తమకు ఉన్నాయంటూ, గ్రామంలోని రైతులు కూలీ పనులు తమవారికే ఇవ్వాలంటూ వైసీపీకి చెందిన కొందరు హుకుం జారీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పక్క గ్రామాలతో పోలిస్తే ఎకరాకు రూ.వేయి నుంచి రెండు వేల వరకు కూలీ ఎక్కువ డిమాండ్‌ చేస్తున్నా, కొందరు రైతులు ఇష్టం లేకపోయినా వారు సూచించిన ట్రాక్టర్లతోనే పనులు చేయించుకుంటున్నారు. మృతుడు శ్రీనివాసరావు మాత్రం రెండున్నరేళ్లుగా తక్కువ కూలీ ఉన్న ప్రాంతంవారితోనే పనులు చేయించుకుంటున్నారని, ఇటీవల మరికొందరు రైతులు కూడా ఆయన బాట పడుతుండటంతో వైసీపీ నాయకులు ఈ దారుణానికి పాల్పడ్డారని గ్రామస్థులు చెబుతున్నారు. రైతులు సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి ఎవరితోనో పనులు చేయించుకుంటే వారకి అభ్యంతరమేమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా తమకు మంత్రి పీఏ అండదండలు ఉన్నాయనడం విస్మయానికి గురిచేస్తోంది. 


శ్రీనివాసరావు మృతికి కారకులైనవారిని అరెస్ట్‌ చేయాలి

టీడీపీ నేత వర్ల కుమార్‌రాజా డిమాండ్‌

శ్రీనివాసరావు మృతికి కారకులైన అధికార వైసీపీ నాయకుడు, అతని అనుచరులను వెంటనే అరెస్ట్‌ చేయాలని పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్ల కుమార్‌రాజా డిమాండ్‌ చేశారు. రైతు మృతి వార్త తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన గ్రామానికి చేరుకుని రైతు మృతదేహంతో పెదపారుపూడి- యలమర్రు రహదారిపై నాలుగు గంటలకుపైగా బైఠాయించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు చెప్పినవారితో పనులు చేయించుకోకుంటే చంపేస్తారా? అంటూ నిలదీశారు. వైసీపీ నాయకుల దాడితో మృతి చెందినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడమేమిటని ఆయన పోలీసులను నిలదీశారు. శ్రీనివాసరావు కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం అందించాలని, 2.5 ఎకరాల వ్యవసాయ భూమి, నాలుగు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్తా

ఇన్‌చార్జి తహసీల్దార్‌ హామీతో ఆందోళన విరమణ

శ్రీనివాసరావు మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఎం.శ్రీనివాసరావు హామీ ఇవ్వడంతో టీడీపీ నేత కుమార్‌రాజా నేతృత్వంలో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన విరమించారు. ఇతర డిమాండ్లను కలెక్టర్‌ నివాస్‌ దృష్టికి తీసుకెళ్లి, సానుకూలంగా సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దారు హామీ ఇవ్వడంతో అంతా సద్దుమణిగింది. 


మా నలుగురికీ దిక్కెవరు?

మా నాన్న మాకు పెద్దదిక్కు. మొత్తం నలుగురుం అక్కాచెల్లెళ్లం. మాకు ఇప్పుడు దిక్కెవరు? ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి.- కొండవీటి అనిత, మృతుడి కుమార్తె


సర్పంచ్‌ భర్త దౌర్జన్యాలేంటి?

భార్య సర్పంచ్‌గా గెలిస్తే, భర్త హోదాలో పూర్ణ చంద్రరావు దౌర్జన్యాలు చేస్తారా? ఆరోగ్యం బాగాలేదని చెబుతున్నా వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారు. నా ముందే దాడి చేశారు. ప్రాథమిక విచారణ లేకుండా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. - పడమటి వెంకటేశ్వరరావు, ప్రత్యక్ష సాక్షి



Updated Date - 2022-02-05T06:47:29+05:30 IST