గణేశా.. మా గతేంటయ్యా

ABN , First Publish Date - 2021-09-07T05:03:28+05:30 IST

వినాయక చవతి.. అంటేనే సంబరం. అటు పిల్లా పెద్దాతో పాటు ఇటు వ్యాపారులు, కార్మికుల్లో కూడా ఆనందమయం.

గణేశా.. మా గతేంటయ్యా
వినాయక ఉత్సవాలకు సిద్దం చేసిన విగ్రహాల వద్ద రాజస్థాన్‌కు చెందిన దీపక్‌ కుటుంబ సభ్యులు

ఈ ఏడాదీ ఉత్సవాలకు నిరాకరణ

ఇప్పటికే రూ.లక్షలతో విగ్రహాల తయారీ

విక్రయాలు లేక తయారీదారుల లబోదిబో

తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు



విఘ్నాలు తొలగించి.. శుభాలు చేకూర్చే విఘ్నాధిపతి ఉత్సవాలకే ఆటంకాలు ఎదురవుతున్నాయి. పేద గొప్ప తారతమ్యం లేకుండా అంగరంగ వైభవంగా వాడవాడలా నిర్వహించే గణపతి ఉత్సవాలకు ఈ ఏడాది కూడా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. కరోనా నిబంధనలు గత ఏడాది ఉత్సవాలు సందడి లేకుండా పోయింది. ఈ ఏడాది అయినా బొజ్జగణపయ్య ఉత్సవాలు జరుగుతాయని తయారీదారులు ఇప్పటికే రూ.లక్షలు వెచ్చించి విగ్రహాలు రూపొందించారు. ఈ పర్వదినంపై ఆధారపడి వేలాది కార్మికులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. కొవిడ్‌ ఆంక్షల కారణంగా ప్రజలు ఇళ్లల్లోనే పండుగను జరుపుకోవాలన్న ఆదేశాలతో అటు తయారీదారులు.. ఇటు కార్మికులతో పాటు  ఉత్సవకమిటీల నిర్వాహకులు హతాశులయ్యారు. 

 

(ఆంధ్రజ్యోతి, గుంటూరు/అమరావతి)

వినాయక చవతి.. అంటేనే సంబరం. అటు పిల్లా పెద్దాతో పాటు ఇటు వ్యాపారులు, కార్మికుల్లో కూడా ఆనందమయం. ప్రతి ఏడాది చవితి సంబరాలు అంబరాన్ని అంటుతాయి. వాడ వాడనా ఉత్సవ కమిటీలు, భక్తులు పోటాపోటీగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేవారు. విగ్రహాల తయారీ.. ఏర్పాటు.. పందిళ్ల నిర్మాణం.. విద్యుత్‌ దీపాలంకరణ.. పూజా సామగ్రి సేకరణ.. విక్రయాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రసాదాల తయారీ.. పంపిణీ..  ఊరేగింపు.. ఇలా ఈ ఒక్క పండుగ ఎందరికో బతుకు ఇస్తుంది. ఈ పండుగతో జిల్లాలో గుంటూరు నుంచి మారుమూల పల్లె వరకు వేలాది మంది ఉపాధి పొందేవారు. కరోనా పడగతో గత ఏడాది సందడి లేకుండానే పండుగ ముగిసింది. ప్రతి ఏడాది ఇతర రాష్ట్రాల నుంచి తయారీదారులను  నెలల ముందుగానే తీసుకువచ్చి రూ.లక్షలు పెట్టుబడి పెట్టి భారీ వినాయక విగ్రహాలను వ్యాపారులు తయారుచేస్తుంటారు. చవితికి పది రోజుల ముందు నుంచే విగ్రహాల కొనుగోళ్లు జరిగేవి. కరోనాతో గత ఏడాది పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయితే అప్పట్లో పండుగ ఆనవాళ్లే లేకపోవడంతో విగ్రహాల తయారీపై పెద్దగా దృష్టి సారించలేదు. అయితే ఈ ఏడాది పరిస్థితి మారిందని.. ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని అశించి రూ.లక్షలు పెట్టుబడి పెట్టి విగ్రహాలు తయారు చేశారు. రూ.లక్షల్లో అడ్వాన్సులు ఇచ్చి మరీ తయారీదారులను, సామగ్రి తదితరాలను కొనుగోలు చేసి వినాయక ప్రతిమలను తయారు చేశారు. విగ్రహాలు అప్పటికప్పుడు తయారు చేసివి కాదు. దీంతో బొమ్మలు చేసే కళాకారులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకు వస్తారు. వాటికి అవసరమైన సామగ్రి పెద్దఎత్తున సేకరిస్తారు. ఇదంతా మూడు నుంచి ఐదు నెలల ముందు నుంచే సాగే ప్రక్రియ. ఇక రూ.వేలల్లో అడ్వాన్స్‌లు ఇచ్చి గిడ్డంగులను అద్దెకు తీసుకుని తయారు చేస్తారు. ఒక్క గుంటూరులోనే దాదాపు 20 నుంచి 25 వరకు తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్కరు దాదాపు రూ.15 నుంచి 20 లక్షలు వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రభుత్వ మార్గదర్శకాలతో వారందరూ తలలు పట్టుకుంటున్నారు.


అప్పులు తీరేది ఎలా...?

చవితి పందిళ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటంతో గత ఏడాది చేసిన అప్పులకు నేటి వరకు తయారీదారులు వడ్డీలు కడుతూనే ఉన్నారు. ఈ ఏడాదైనా అప్పుల నుంచి బయటపడదామనుకుంటే కథ అడ్డం తిరిగింది.   పెద్ద విగ్రహాలకు ఉత్సవ నిర్వాహకులు ముందుగానే పెద్దమొత్తంలో అడ్వాన్స్‌లు ఇచ్చి భారీ విగ్రహాలను తయారు చేయమని ఆర్డర్లు ఇచ్చారు. ఉత్సవాలకు అనుమతి లేకపోవడంతో అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయమని ఒత్తిళ్లు చేస్తున్నారని తయారీదారులు వాపోతున్నారు.  


ఇప్పటికిప్పుడు ప్రకటిస్తే ఎలా

గత ఏడాది రూ.7 లక్షలు నష్టపోయాం. ఈ ఏడాది మరో రూ.10 లక్షలు పెట్టుబడపెట్టి విగ్రహాలు తయారు చేయించాం. కానీ ప్రభుత్వం ఉత్సవాలకు అనుమతి నిరాకరించింది. ముందుగా ప్రకటించలేదు. పండుగకు పది రోజులు ముందు ఉత్సవాలకు అనుమతి లేదని ప్రకటించడం దారుణం. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి ప్రతిమలు తయారు చేశాం. పదేళ్ల నుంచి ఇదే వృత్తిలో ఉన్నాం. మా పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం ఒక్కసారి మా గురించి ఆలోచించాలి. ప్రభుత్వం ఆదుకోవాలి.

- వరాల నాయుడు, గుంటూరు


ఆరు నెలల నుంచి తయారీ

గణపతి ఉత్సవాలకు ఆరు నెలల నుంచి బొమ్మలను సిద్ధం చేస్తున్నాం. రాజస్థాన్‌ నుంచి ఇక్కడకు వచ్చి ఐదేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం. కరోనా నిబంధనలతో ఉత్సవాలను నిషేధించారు.  ఇప్పటికే తయారు చేసిన విగ్రహాలను ఏమి చేయాలి. గత ఏడాది రూ.7 లక్షలు నష్టం వాటిల్లింది. ఆ అప్పు ఇంకా తీరలేదు. ఈ సారైనా గట్టునపడతామనుకున్నాం. బతుకు తెరువు కోసం దూరప్రాంతాల నుంచి వస్తే అప్పులపాలయ్యాం. ఈ ఒక్కసారికి చవితి ఉత్సవాలకు అనుమతిస్తే ఉన్న వాటిని అమ్ముకుని వేరే వృత్తి చూసుకుంటాం.  

- దీపక్‌ దంపతులు, అమరావతి

Updated Date - 2021-09-07T05:03:28+05:30 IST