జిల్లాలో కరోనా కట్టడి దిశగా పల్లెలు

ABN , First Publish Date - 2021-05-04T03:55:59+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెలలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

జిల్లాలో కరోనా కట్టడి దిశగా పల్లెలు

  - పలుచోట్ల సంతల నిర్వహణ నిలిపివేత

  - జరిమానాల విధింపు

  - స్వచ్ఛంద బంద్‌లు

  - వ్యాపార వేళల్లో మార్పులు

బెజ్జూరు, మే 3: జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెలలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. పలువురు మృత్యువాత పడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధించగా జిల్లాలో పలుచోట్ల స్వచ్ఛందబంద్‌కు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు కూరగాయల మార్కెట్లు, సంతలను మూసివేయిస్తున్నారు. పలుచోట్ల వ్యాపార సంఘాలు ముందుకు వచ్చి దుకాణాలను బంద్‌ చేయిస్తున్నాయి. మాస్కులు ధరించకుండా బయట తిరిగితే జరిమానాలు విధించేందుకు పంచాయతీ పాలక వర్గాలు సిద్ధమవుతున్నాయి. గతేడాది మార్చిలో వైరస్‌ వ్యాప్తి మొదలు కాగా సెప్టెంబరు నుంచి వైరస్‌ వ్యాప్తి కొంతమేర తగ్గు ముఖం పట్టింది. మళ్లీ ఈ ఏడాది మార్చి నుంచి వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. జిల్లాలో రోజుకు వందకు పైగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలను అప్రమత్తం చేయడానికి పల్లెలను కట్టడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ విజృంభణ..

జిల్లాలో గతేడాది గ్రామీణ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చాలా తక్కువగా ఉండేది. ఈఏడాది మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోనూ వైరస్‌ వ్యాప్తి దుమారం రేపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు పెరగడంతో రాకపోకలు పెరిగాయి. దీంతో వైరస్‌ వ్యాప్తికి కారణమయిం దని చెప్పవచ్చు. గ్రామాల్లో వారసంతలు నిర్వహిస్తున్నందున వ్యాప్తి పెరిగిపోయింది. ప్రభుత్వం సైతం ఉపాధిహామీ కూలీలకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీతో మూడు, నాలుగు రోజులుగా పరీక్షలు నిర్వహించడంతో కూలీల్లోను అధికంగా వైరస్‌ వ్యాప్తి జరిగినట్లు వెల్లడైంది. దీంతో ఇక గ్రామపంచాయతీ పాలకవర్గాలు ప్రత్యేక శ్రద్ధ వహించి కట్టడికి చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే దహెగాం, సిర్పూర్‌(టి), కౌటాల, బెజ్జూరు, పెంచికలపేట మండలాల్లో నిర్వహించే వారసంతలు రద్దు చేశారు. అదే విధంగా దుకాణ సముదాయాల సమయాన్ని కూడా కుదించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాలను నడిపిస్తున్నారు. జిల్లాకు సరిహద్దున మహారాష్ట్ర ఉండడంతో ఇరువైపులా రాకపోకలు పెరిగిపోయాయి. అదేవిధంగా గూడెం వద్ద ప్రాణహిత నదిపై బ్రిడ్జి పూర్తికావడంతో రాకపోకలు పెరిగాయి. అంతే కాకుండా మహారాష్ట్రతో జిల్లా ప్రజానికానికి బంధుత్వాలు ఉన్నాయి. ఇరుప్రాంతాల నుంచి రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు లేని కారణంగా రోజు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వాహనాల తాకిడి పెరిగింది. మహారాష్ట్రలో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్నందున ఇది కూడా వ్యాప్తికి కారణమై ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

టీకాపై తొలగిపోతున్న అపోహలు..

కరోనా వైరస్‌ను అరికట్టే టీకాలను ప్రభుత్వం తొలిదశలో విడుదల చేసిన సమయంలో టీకాలపై ప్రజల్లో కొంత అపోహ ఉండేది. ఇటీవల ఆ అపోహలు క్రమేణా తొలగిపోతున్నాయి. టీకాలపై ప్రభుత్వం ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా మండల స్థాయిలో అధికారులు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు, వైద్యసిబ్బంది ప్రజల్లో రోజువారిగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో టీకాలు వేయించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా వేయించుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. గ్రామాల్లో టీకాలు వేసుకునేందుకు ఇతర గ్రామాల నుంచి ప్రజలు ట్రాక్టర్లు, ప్రైవేటు వాహనాల్లో ఆస్పత్రులకు వస్తున్నారు.

కట్టడితో నియంత్రించవచ్చు..

-భోగ సంతోష్‌, బెజ్జూరు

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు కట్టడే సరైనమార్గం. వ్యాపార సముదాయాలను కట్టడి చేయడంతో జనం గుమిగూడకుండా ఉంటుంది. ఆర్థికంగా కొంతమేర నష్టం కలిగే అవకాశం ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. 

టీకాలు వేసుకోవడం శ్రేయస్కరం..

- మురళీధర్‌, బెజ్జూరు

45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోవడం శ్రేయస్కరం. టీకాలపై ప్రజల్లో అపోహ ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం లేదు. టీకా వేసుకుని 20 రోజులు కావస్తోంది. ఇప్పటివరకు నాకెలాంటి సమస్యా లేదు. కాబట్టి అందరూ టీకా వేసుకొని కరోనా నివారణకు తోడ్పడాలి.

Updated Date - 2021-05-04T03:55:59+05:30 IST