‘వెళ్లిపో కరోనమ్మ’.. కర్ణాటకలోని ఓ గ్రామంలో కరోనమ్మకు పూజలు..!

ABN , First Publish Date - 2020-05-24T18:08:37+05:30 IST

ప్రపంచం మొత్తం కంటికి కనిపించని కరోనాతో చావుబతుకుల పోరాటం చేస్తోంది. ఇప్పటికే...

‘వెళ్లిపో కరోనమ్మ’.. కర్ణాటకలోని ఓ గ్రామంలో కరోనమ్మకు పూజలు..!

ప్రపంచం మొత్తం కంటికి కనిపించని కరోనాతో చావుబతుకుల పోరాటం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల మంది ప్రాణాలను హరించిన ఈ కరోనాకు వ్యాక్సిన్‌ను కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం తాము నమ్మిన ఆచారాలను అనుసరిస్తున్నారు. ఉత్తర కర్ణాటకలోని ఓ గ్రామంలో సరిగ్గా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. బళ్లారి జిల్లాలోని కుడ్లిగి తాలూకా హుళికెరె గ్రామంలో ఓ ఆచారం ఉంది. కొత్తకొత్త వ్యాధులు ఉపద్రవంలా మారి బాధపెడుతున్నప్పుడు ఆ వ్యాధి పేరుతో.. వేప ఆకులు, చింత ఆకులతో ఓ ప్రతిమను చేసి పూజ చేస్తారు.


పూజ అనంతరం.. ఊరేగింపుతో ఆ ప్రతిమను మరో గ్రామంలోకి సాగనంపుతారు. ఇలా చేస్తే ఆ వ్యాధి వారి గ్రామం వదిలిపోతుందని అక్కడి వారి నమ్మకం. తాజాగా అలాంటి తంతే ఈ గ్రామంలో జరిగింది. ఓ ప్రతిమ చేసి.. వేప, చింత ఆకులతో అలంకరించి.. చిన్న చక్రాల బండిపై ఆ ప్రతిమను ఉంచారు. ఆ ప్రతిమకు ‘కరోనమ్మ’ అని పేరు పెట్టారు. ఊరంతా ఊరేగించి.. ‘ మా ఊరు వదిలి వెళ్లిపో.. కరోనమ్మ’ అంటూ పక్క గ్రామంలో వదిలిపెట్టారు.

Updated Date - 2020-05-24T18:08:37+05:30 IST