లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్థుల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-04-13T06:15:22+05:30 IST

డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో పలువురు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్థుల ఆగ్రహం
పట్టా పత్రాలను పడేస్తున్న మహిళలు

 ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్‌ 12:  డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన గ్రామసభలో పలువురు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   గ్రామంలో 40 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించగా 226 మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్వే నిర్వహించిన అధికారులు గ్రామసభ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు సిద్ధమయ్యారు. పేర్లను వెల్లడిస్తున్న క్రమంలో అనర్హులకు ఇళ్లు కేటాయించారని పలువురు అడ్డుకున్నారు.  గతంలో  62 మంది నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన స్థల పట్టాలను అధికారులపై పడేశారు. తాము అర్హులం కాకపోతే ఇవ్వెందుకు ఇచ్చారని మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు  మధ్యలోనే వెనుదిరిగారు.  సర్పంచ్‌ అంజవ్వ, ఎం పీటీసీ తిరుపతిబాబు, ఉప సర్పంచ్‌ బాలయ్య పాల్గొన్నారు.

 ముస్తాబాద్‌ :  డబల్‌ బెడ్‌రూం ఇళ్ల ఎంపిక ప్రక్రియలో గొడవకు దారితీసింది. అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారని  దరఖాస్తుదారులు, కాంగ్రెస్‌ నాయకులు  ఆందోళనకు దిగారు. ముస్తాబాద్‌ మండల కేం ద్రంలో  156 డబల్‌ బెడ్‌ రూం ఇళ్లకు  509 దరఖాస్తులు వచ్చాయి.  ఎంపిక చేసిన జాబి తాను సోమవారం ఊరందరి సమక్షంలో చదివి వినిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.  ఆర్‌ఐ రమేశ్‌ చదువుతుండగా ఒక సామాజిక వర్గానికే ఎక్కువగా ఇల్లు వచ్చాయని మరో సామాజిక వర్గానికి రాలేదని  మహిళలు ప్రశ్నించారు.  కాంగ్రెస్‌  మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గజ్జెల రాజు, దీటి నర్సింలు, అరుట్ల మహేశ్‌రెడ్డి, ఆగుళ్ల రాజేశం ఆందోళనకు దిగారు. తహసీల్దార్‌, ఎంపీడీవో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సర్పంచ్‌తో పాటు అధికారులు, అక్కడి నుండి వెళ్లెందుకు సిద్దం కాగా సర్పంచ్‌ సుమతిని నిలదీశారు.  అనంతరం సీఐ ఉపేందర్‌ ఆధ్వర్యంలో ఎస్సైలు రవి, లక్ష్మారెడ్డి, సౌమ్య శాంతింప జేసేందుకు ప్రయత్నించారు.  వినకపోయేసరికి ఠాణాకు తరలించే యత్నం చేస్తుండగా దరఖాస్తుదారులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అక్కడే దించడంతో ఆందోళన విరమింప జేశారు.   

వీర్నపల్లి: వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో ఇటీవల నిర్వహించిన గ్రామసభలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని పలువురు గ్రామయువకులు, మహిళలు సోమవారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.  గ్రామంలో నిరుపేదలు ఉన్నారని, పాలక వర్గం దగ్గరి బంధువులకు మాత్రమే కేటాయింపులు జరిగాయని ఆరో పించారు.   ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.  గ్రామ యువకులు మహిపాల్‌, వినోద్‌, శేకర్‌, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 

గంభీరావుపేట:మండల కేంద్రంలో డబుల్‌ బెడ్‌ రూంల జాబితాలో అవకతవకలు జరిగియాంటూ మండల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీ కార్యాయంలో జరిగిన గ్రామసభలో డబుల్‌ బెడ్‌ అర్హుల జాబితా లిస్ట్‌ను ప్రకటించడంలో కాంగ్రెస్‌  మండల అధ్యక్షుడు హమీద్‌ అర్హులకు అన్యాయం జరిగిందంటూ వాదించారు. తక్షణమే పున పరిశీలన చేసి, అర్హులకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు.  మంత్రి కేటీఆర్‌ స్పందించాలని, అర్హులకు న్యాయం చేయాలని కోరారు.  కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు హమీద్‌, నాయకులు పాపగారి రాజు పాల్గొన్నారు. 

 తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించాలని గ్రామస్థులు సోమవారం తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.  లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగలేదని అనర్హులకు కేటాయించారని ఆరోపించారు.  అనంతరం తహసీల్దార్‌ సదానందకు వినతిపత్రం అందజేశారు. 


Updated Date - 2021-04-13T06:15:22+05:30 IST