ఖాళీ చేయకుంటే చంపేస్తాం!

ABN , First Publish Date - 2020-07-13T15:14:05+05:30 IST

‘శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన శ్రీసీతారామ కల్యాణ మండపం..

ఖాళీ చేయకుంటే చంపేస్తాం!

వృద్ధ బ్రాహ్మణ దంపతులకు అధికార పార్టీ నేతల బెదిరింపులు

ఈవో అనుమతి లేకుండా ఆలయ ప్రాంగణంలోనే సమావేశం

శ్రీకాశీవిశ్వేశ్వరుని స్థలం స్వాధీనం చేసుకున్నామని ప్రకటన

సహకరిస్తున్న దేవదాయ శాఖ అధికారులు

మంత్రి, ప్రజాప్రతినిధి అండతో చెలరేగిపోతున్న కబ్జాదారులు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ‘శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన శ్రీసీతారామ కల్యాణ మండపం మా స్వాధీనం అయింది. దానికి అనుబంధంగా ఉన్న ధర్మసత్రం కూడా మాదే. మీరు తక్షణం మీకు కేటాయించిన గదులను ఖాళీ చేసి వెళ్లిపోండి. లేకపోతే మీ ప్రాణాలకు గ్యారంటీ లేదు..!’ అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు సత్రం గుమస్తా ముప్పాళ్ల లీలాకృష్ణప్రసాద్‌కు, అతని తల్లిదండ్రులకు చేసిన బెదిరింపులు ఇవి. విజయవాడ సత్యనారాయణపురం శివాజీ కేఫ్‌ సెంటర్‌లోని శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన సుమారు రూ.10 కోట్ల విలువ చేసే 900 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై ‘శివయ్య స్థలం స్వాహాయ’ శీర్షికన ఈ నెల 10వ తేదీ ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది. దీంతో దేవదాయశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. న్యాయ పరమైన సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుందామని, స్థలం స్వాధీనాన్ని నిలిపివేశారు.


అయితే మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధి అండతో కబ్జాదారులు మాత్రం విలేకరుల సమావేశం పెట్టి మరీ స్థలం శ్రీభువనేశ్వరి పీఠం స్వాధీనం అయిపోయిందంటూ ప్రకటనలు చేశారు. మంత్రికి, ప్రజాప్రతినిధికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. శనివారం సాయంత్రం ఆలయప్రాంగణంలోనే కొందరు అధికార పార్టీ నేతలు సమావేశమయ్యారు. 900 గజాల స్థలం తమకు అప్పగించేశారని మరోసారి ప్రకటించారు. అయితే ధర్మసత్రంలో కొన్ని దశాబ్దాలుగా గుమస్తాగా చేస్తున్న ఓ వృద్ధ బ్రాహ్మణ దంపతులు, వారి కుమారుడు ఉంటున్నారు. వారిని ఖాళీ చేయిస్తే కానీ మొత్తం స్థలం తమ సొంతం కాదని భావించిన కబ్జాదారులు తక్షణం గదులను ఖాళీచేసి వెళ్లాలని, లేకుంటే ప్రాణాలు దక్కవని వారిని హెచ్చరించారు. దీంతో వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు ధర్మ సత్రంలోని కొంత భాగాన్ని ఇప్పటికే కబ్జాదారులు తమ స్వాధీనంలోకి తెచ్చేసుకున్నారు. కల్యాణమండపాన్ని కూడా ఒకటి రెండు రోజుల్లో స్వాధీనం చేసుకుంటామని ప్రకటనలు చేస్తుండటం గమనార్హం.


దేవదాయశాఖ సహకారం!

దేవదాయ శాఖ అధికారుల అనుమతి లేకుండా బయటి వ్యక్తులు ఆలయ ప్రాంగణంలో సమావేశం కావడం, ఆ శాఖ స్థలాన్ని తమదేనని ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సహకారంతోనే ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

Updated Date - 2020-07-13T15:14:05+05:30 IST