సర్వేమంగళం?

ABN , First Publish Date - 2020-07-12T16:19:37+05:30 IST

పామర్రు మండలం జమిగొల్వపల్లికి చెందిన నాగేశ్వరి అనే మహిళ ఒంటరిగా..

సర్వేమంగళం?

ప్రజాసాధికార సర్వే తప్పులతో అందని సంక్షేమ పథకాలు

సచివాలయాల్లో జరగని మార్పులు చేర్పులు

ఒంటరి మహిళలకు బియ్యం కార్డులు ఇవ్వరట

ఆస్తులు లేని వారికి ఉన్నట్టుగా తప్పుడు రికార్డులు

పథకాలు అందక పేదలు లబోదిబో


పామర్రు మండలం జమిగొల్వపల్లికి చెందిన నాగేశ్వరి అనే మహిళ ఒంటరిగా ఉంటోంది. ప్రజాసాధికార సర్వేలో ఆమె పేరున 6.27 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. దీంతో ఆమె రేషన్‌కార్డు రద్దయింది. తాను నిరుపేదనని, తనకు ప్రభుత్వం ద్వారా బియ్యంకార్డు ఇప్పించాలని కోరుతూ సచివాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తే ఒంటరి మహిళకు బియ్యంకార్డు ఇచ్చేది లేదని, పింఛన్‌ కూడా రాదని తేల్చిచెప్పారు. 


విజయవాడకు చెందిన వెంకటసత్యనారాయణ పేరున కారు ఉన్నట్లు ప్రజాసాధికార సర్వేలో నమోదు చేశారు. తనకు కారు లేదని ఆధారాలు చూపి రవాణా కార్యాలయంలో ఆయన రికార్డులు సరి చేయించుకున్నారు. అయినా ఆర్‌టీజీఎస్‌లో ఆయన పేరున కారు ఉన్నట్టే చూపుతోంది. దీంతో రేషన్‌కార్డుపై సరుకులు ఇవ్వట్లేదు. బియ్యంకార్డు కోసం సచివాలయంలో దరఖాస్తు చేసి ఆన్‌లైన్‌లో ఆధార్‌ కార్డు నెంబరు నమోదు చేయగానే కారు ఉన్నట్టుగా చూపడంతో దరఖాస్తు స్వీకరించలేని పరిస్థితి.


గన్నవరానికి చెందిన జె.కోటేశ్వరరావు డ్రైవరుగా పనిచేస్తాడు. ప్రజాసాధికార సర్వేలో ఆయన పేరున గన్నవరంలో 9.88 ఎకరాలు ఉన్నట్టుగా నమోదైంది. ఆ భూమి తనది కాదని తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులు సరిచేయించుకున్నాడు. రద్దయిన రేషన్‌కార్డు స్థానంలో బియ్యంకార్డు కోసం దరఖాస్తు చేసి ఆధార్‌ కార్డు నెంబరు నమోదు చేయగానే 9.88 ఎకరాలు ఉన్నట్టు చూపించింది. అదేంటని అధికారులు, సచివాలయ ఉద్యోగులను ఆయన అడిగితే ఆర్‌టీజీఎస్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లి భూమి లేదని సరిచేయించుకోవాలని చెబుతున్నారు.


ప్రజాసాధికార సర్వేలో జరిగిన తప్పుల కారణంగా పేదలు పడుతున్న కష్టాలివి. ప్రజాసేవ కోసమే స్థానిక సచివాలయాలు అని చెప్పుకొనే రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇబ్బందులను మాత్రం పరిగణనలోకి తీసుకోవట్లేదు. ఫలితంగా ఎవరో చేసిన తప్పునకు అసలైన అర్హులు సంక్షేమ పథకాలు అందుకోలేకపోతున్నారు. 


మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : సచివాలయాల ద్వారానే పాలన సాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. సచివాలయాల ద్వారా 540కుపైగా సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చామంటోంది. క్షేత్రస్థాయిలో అలా లేదు. సచివాలయాల్లో ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకోడానికి వెళ్లిన వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. 45-60 ఏళ్లలోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ‘చేయూత’ పథకానికి దరఖాస్తు చేసేందుకు వెళ్తే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసే అవకాశంలేని పరిస్థితి. తహసీల్దార్‌ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపేందుకు, లాగిన్‌ అయ్యేందుకు సచివాలయాలకు పాస్‌వర్డ్‌ ఇవ్వలేదు. వీఆర్వోలు సచివాలయాలకు రాకపోవడంతో  దరఖాస్తులు తహసీల్దార్‌ కార్యాలయాల్లో కనిపించని పరిస్థితి. మచిలీపట్నంలోని ఒక వార్డులో సచివాలయం ద్వారా పంపిన 150కు పైగా దరఖాస్తులు కనిపించడానికి మూడు రోజులు పట్టింది. ఇక జగనన్న విద్యాదీవెన పథకం కోసం దరఖాస్తులు వేలల్లో పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. 


ప్రజాసాధికార సర్వే తప్పుల కారణంగానే..

ప్రజాసాధికార సర్వేలో  దొర్లిన తప్పులు పేదలను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. పేదలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు సచివాలయాలకు వెళ్తే.. వారిపేరున భూమి, కార్లు ఉన్నట్టుగా చూపిస్తోంది. ఆధారాలను బట్టి వాస్తవంగా వారి పేరున భూమి, కార్లు లేవు. తిరిగి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసే ఆప్షన్‌ ఇవ్వలేదని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రజాసాధికార సర్వేలో జరిగిన సమయంలో కుటుంబంలోని  తల్లిదండ్రులతో పాటు వారి పిల్లల పేర్లు నమోదు చేశారు. సర్వే జరిగిన అనంతరం పిల్లలకు ఉద్యోగాలు వచ్చి వారు వేరే ప్రాంతాల్లో ఉంటున్నా.. వారి తల్లిదండ్రుల రేషన్‌కార్డులను రద్దుచేసి, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు అనర్హులుగా చూపుతున్నారు.


Updated Date - 2020-07-12T16:19:37+05:30 IST