విజయవాడ: పెట్రో ధరలు తగ్గించాలంటూ లారీ ఓనర్ల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-28T17:23:52+05:30 IST

పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలంటూ విజయవాడలో లారీ యజమానులు ఆందోళన చేపట్టారు.

విజయవాడ: పెట్రో ధరలు తగ్గించాలంటూ లారీ ఓనర్ల ఆందోళన

విజయవాడ: పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గించాలంటూ గురువారం విజయవాడలో లారీ యజమానులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా... పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 109 డాలర్లు ఉన్నప్పుడు లీటర్ డీజిల్ రూ. 65 ఉంటే.. ఇప్పుడు 83 డాలర్లుకు తగ్గినా..106 రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం పన్నుల రూపంలో రూ. 32 వసూలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం లీటర్ డీజిల్‌కు 22.25శాతం వ్యాట్ టాక్స్‌తో పాటు అదనంగా నాలుగు రూపాయలు, రోడ్ సెస్ కింద 1.22 రూపాయలు వసూలు చేస్తోందన్నారు. ఇప్పటికే రవాణా రంగం పూర్తిగా కుదేలైందని, ఇప్పుడు రోజూ ముప్పై పైసల చొప్పున పెంచడం దారుణమన్నారు. కార్మికుల పొట్ట కొట్టి... కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టడం సరికాదన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరల వల్ల అన్ని రకాల నిత్యావసరాలు రెట్టింపు అయ్యాయనన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చి పన్నుల భారాన్ని తగ్గించాలని కోరారు. రోడ్ సెస్ లేదా టోల్ గేట్లు ఎత్తివేయాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్  ప్రీమియం తగ్గించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వాలు స్పందించకుంటే.. మరోసారి దేశ వ్యాప్త బంద్‌కు దిగుతామని ఈశ్వరరావు హెచ్చరించారు.

Updated Date - 2021-10-28T17:23:52+05:30 IST