విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మి

ABN , First Publish Date - 2021-03-18T06:08:09+05:30 IST

తీవ్ర ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు..

విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మి

మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడి

కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం అనంతరం ప్రకటన

పుణ్యశీలకు చెక్‌ పెట్టేందుకే తెరపైకి బీసీ మంత్రం

తెరవెనుక చక్రంతిప్పిన మంత్రి

నేడు కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు


విజయవాడ, ఆంధ్రజ్యోతి: తీవ్ర ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు విజయవాడ మేయర్‌ పదవి 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాయన భాగ్యలక్ష్మిని వరించింది. కొత్త పాలకవర్గాలు కొద్దిగంటల్లో కొలువుతీరనుండగా, కీలకమైన మేయర్‌ అభ్యర్థిని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రకటించారు. నగరంలో విజయం సాధించిన 49 మంది అభ్యర్థులతో బుధవారం ఓ హోటల్‌లో సమావేశం నిర్వహించిన ఆయన బీసీలకు సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్‌.. భాగ్యలక్ష్మిని మేయర్‌గా నిర్ణయించారని తెలిపారు. గురువారం జరిగే మేయర్‌ ఎన్నికకు సంబంధించి జగన్‌ ఇచ్చిన ఆదేశాలను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, వైసీపీ కార్యాలయ ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి అభ్యర్థులకు అందజేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు విప్‌ జారీ చేశారు. 


పుణ్యశీల కినుక..!

మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి ఖరారు కావడంతో ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన బండి పుణ్యశీల ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెను బుజ్జగించేందుకు బుధవారం మంత్రి వెలంపల్లి పుణ్యశీల ఇంటికి వెళ్లారు. కావాలనే మేయర్‌ స్థానాన్ని బీసీలకు కేటాయించారని.. ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎంతోకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నానని, గత ఎన్నికల్లో తనతో పాటు వైసీపీ జెండాపై గెలిచిన వారంతా టీడీపీలోకి వెళ్లినా తాను మాత్రం పార్టీలో కొనసాగుతూ కౌన్సిల్‌లో ఒంటరి పోరాటం చేశానని, తనకు మంత్రి తగిన శాస్తి చేశారని వాపోయినట్లు సమాచారం. మేయర్‌ సీటుపై ఆశ పెట్టుకున్న పగిడిపాటి చైతన్యరెడ్డి సైతం మంత్రి తీరుపై అసహనంతో ఉన్నట్టు సమాచారం. మరోవైపు డిప్యూటీ మేయర్లుగా తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్‌ కార్పొరేటర్‌ బెల్లం దుర్గ, సెంట్రల్‌ నియోజకవర్గంలోని 24వ డివిజన్‌ కుక్కల అనిత పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, అధికారికంగా పార్టీ ఎవరిని నిర్ణయిస్తుందన్న దానిపై ఉత్కంఠ సాగుతోంది. 


బందరులో ఉత్కంఠ

మచిలీపట్నం టౌన్‌ : మచిలీపట్నం నగరపాలక సంస్థ తొలి మేయర్‌ ఎవరనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. జనరల్‌ మహిళకు కేటాయించిన ఈ స్థానం బీసీ, మైనారిటీ, బడుగు మహిళలకు దక్కుతుందని సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బందరు ఎమ్మెల్యే, ఎంపీ కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడం వల్ల బీసీలకు మేయర్‌ ఇవ్వాలన్న ఆలోచన కనిపిస్తోంది. అధిష్ఠానం కూడా అందుకు సూచనలిచ్చినట్టు తెలుస్తోంది. అయితే, మంత్రి పేర్ని నానీకి అనుచరుడిగా ఉంటున్న కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ శీలం బాబ్జీ సతీమణి భారతి నాగ కుసుమరాణికి డిప్యూటీ మేయర్‌ పదవైనా దక్కుతుందని భావిస్తున్నారు. అలా జరిగితే, వీలైనంత వరకు బడుగు, బలహీన వర్గాల వారికి మేయర్‌ పదవి ఇస్తే బాగుంటుందని సీఎం జగన్‌ సూచించడంతో ఆ వర్గాల కార్పొరేటర్లూ ఆశలో ఉన్నారు. ఎస్సీ మహిళ తంటిపూడి కవిత, బీసీ మహిళలు చిటికెన వెంకటేశ్వరమ్మ, మోకా వెంకటేశ్వరమ్మ కూడా మేయర్‌ పదవిని ఆశిస్తున్నారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సిలార్‌దాదా కోడలు షేక్‌ షహీనాకు మేయర్‌ పదవి దక్కుతుందని ముస్లిం మైనారిటీ వర్గాల ఆశ. ఇక మత్స్యకార సామాజికవర్గానికి చెందిన, హత్యకు గురైన మోకా భాస్కరరావు భార్య వెంకటేశ్వరమ్మకు గానీ, మాజీ కౌన్సిలర్‌ చిటికెన వెంకటేశ్వరమ్మకు గానీ మేయర్‌ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని కొందరు బీసీ నాయకులు భావిస్తున్నారు. మేయర్‌ పదవి పొందే సామాజికవర్గం కాకుండా ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఇద్దరిని డిప్యూటీ మేయర్లుగా ఎన్నుకునే అవకాశం ఉంది. కాగా, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలకు జాయింట్‌ కలెక్టర్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ మాధవీలత, కమిషనర్‌ శివరామకృష్ణ రంగం సిద్ధం చేశారు.



Updated Date - 2021-03-18T06:08:09+05:30 IST